‘మన నెల్లూరు - మన బాధ్యత’ ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-05T08:13:52+05:30 IST

మన ఇంటిని, దాని పరిసరాలతోపాటు మన నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిదని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పిలుపునిచ్చారు.

‘మన నెల్లూరు - మన బాధ్యత’ ప్రారంభం
మన నెల్లూరు - మన బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(సాంస్కృతికం), మార్చి 4 : మన ఇంటిని, దాని పరిసరాలతోపాటు మన నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిదని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని శ్రీవెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో మన నెల్లూరు - మన బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. నగర పాలక సంస్థ ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.  దేశంలోని అత్యుత్తమమైన పరిశుభ్ర నగరాల్లో ఒకటిగా నెల్లూరును తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలనే సందేశంతో విద్యార్థులు ప్రదర్శించిన నాటిక బాగుందని ప్రశంసించారు. ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లేట్ల వాడకాన్ని పూర్తిగా మానేయాలని కోరారు. దానికి ప్రత్యామ్నాయాలను కలెక్టర్‌ వివరించారు. పర్యావర్ణ మిత్రులైన సఫాయి కర్మచారులను గౌరవించాలని కోరారు. జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ మాట్లాడుతూ క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలతో కార్యక్రమం చేపట్టామన్నారు. చెత్త ఉత్పత్తిని తగ్గించి ప్రకృతిని కాపాడుకోవాలన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే 10 లక్షల టన్నుల చెత్తను డంప్‌ చేసి ఉన్నామన్నారు. ఇంకా పెరిగితే ప్రమాదమని అధికారులతోపాటు ప్రజలపైనా బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-05T08:13:52+05:30 IST