మోదీకి క్లీన్‌చిట్‌

ABN , First Publish Date - 2022-06-25T08:45:42+05:30 IST

గుజరాత్‌ అల్లర్ల కేసులో నాటి ముఖ్యమంత్రి మోదీకి ప్రత్యేక దర్యాప్తు బృం దం(సిట్‌) క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.

మోదీకి క్లీన్‌చిట్‌

గుజరాత్‌ అల్లర్ల కేసులో సుప్రీం తాజా తీర్పు

జకియా జాఫ్రి పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, జూన్‌ 24: గుజరాత్‌ అల్లర్ల కేసులో నాటి ముఖ్యమంత్రి మోదీకి ప్రత్యేక దర్యాప్తు బృం దం(సిట్‌) క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. మైనారిటీ వర్గం లక్ష్యంగా హింసను ప్రేరేపించడానికి అప్పటి గుజరాత్‌ ప్రభుత్వం కుట్ర పన్నినట్టు ఆధారాలు లేవని పేర్కొంది. అలాగే సిట్‌కు వ్యతిరేకంగా పిటిషనర్లు న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన సాక్ష్యాలేవీ దర్యాప్తును సందేహించాల్సినంత బలంగా లేవని కోర్టు పేర్కొంది. నాటి హింస వెనుక ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తుల కుట్రగానీ, ప్రమేయంగానీ లేదన్న సిట్‌ నివేదికతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. సిట్‌ అనుసరించిన విధానంలో ఎలాంటి లోపం లేదని జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన త్రిసభ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఈ కేసులో సుదీర్ఘ వాదనలకు తెరపడింది. 


అధికారులను జైల్లో పెట్టాలి..

తీర్పు సందర్భంగా సుప్రీం ధర్మాసనం గుజరాత్‌ కు చెందిన కొందరు ఉన్నతాధికారులు, పిటిషనర్లలో ఒకరైన తీస్తా సెతల్వాడ్‌ వైఖరిని తప్పుబట్టింది. సిట్‌ దర్యాప్తులో అప్పటి గుజరాత్‌ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమా ర్‌, మరికొందరు అధికారుల ఉద్దేశాలను కోర్టు ఆక్షేపించింది. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మక్కై కేసును సెన్సే షన్‌ చేయడానికి ప్రయత్నించారని పేర్కొంది. వారం తా అల్లర్ల విషయంలో సిట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపింది. సిట్‌ క్షుణ్నంగా దర్యాప్తు జరపడంతో అధికారులు చెప్పినవన్నీ అవాస్తవాలని తేలిందని ధర్మాసనం పేర్కొంది. కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన అధికారులను జైల్లో పెట్టాలని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే కో-పిటిషనర్‌ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌ సొంత ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకున్నారని కోర్టు తెలిపింది. సెతల్వాడ్‌పై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది.


తీర్పు నిరుత్సాహ పరిచింది: తన్వీర్‌ జాఫ్రి

సుప్రీంకోర్టు తీర్పు తనను నిరుత్సాహపరిచిందని ఇషాన్‌ జాఫ్రి కుమారుడు తన్వీర్‌ జాఫ్రి అన్నారు. తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత వివరంగా ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలిపారు. గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అర్జున్‌ మోధ్వాడియా స్పందిస్తూ.. గుజరాత్‌ అల్లర్లల్లో తమ పార్టీ ఎంపీ ఇషాన్‌ జాఫ్రి మృతి చెందారని, అయితే కోర్టు తీర్పును ఆమోదించడం తప్ప తమకు మరో మార్గం లేదని అన్నారు. సుప్రీం కోర్టు రెండు నిమిషాల్లోనే తీర్పును వెలువరించిందని, అల్లర్ల విషయంలో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని పేర్కొందని  తీస్తా సెతల్వాడ్‌ ఆవేదన చెందారు.

Updated Date - 2022-06-25T08:45:42+05:30 IST