బీజేపీలో వర్గపోరు

ABN , First Publish Date - 2022-06-28T06:32:26+05:30 IST

పెద్దపల్లి జిల్లాలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతున్నది. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో వర్గ పోరు మరింత పెరుగుతూ వస్తున్నది. పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.

బీజేపీలో వర్గపోరు

- తీవ్రమవుతున్న విభేదాలు

- జిల్లాలో మారని నేతల తీరు

- మోదీ సభకు ఎవరికి వారే జన సమీకరణ 

- తీవ్ర అసంతృప్తితో కార్యకర్తలు

(ఆంఽధ్రజ్యోతి, పెద్దపల్లి)

 పెద్దపల్లి జిల్లాలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతున్నది. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో వర్గ పోరు మరింత పెరుగుతూ వస్తున్నది. పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. సంస్థాగతంగా పార్టీ బలపడేందుకు అధిష్టానం తీవ్రంగా శ్రమిస్తున్న సందర్భంలో స్థానికంగా నాయకుల మధ్య వైరుధ్యాలు పెరుగడంతో కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా పార్టీ అధ్యక్షుడే ఇరవై రోజుల క్రితం జిల్లాకు చెందిన పలువురు నాయకులను హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడినప్పటికీ వారి తీరు మారడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసలే వర్గపోరుతో పార్టీ సతమతం అవుతుండగా జిల్లా పార్టీ ఇన్‌చార్జీ  వ్యవహరిస్తున్న తీరు అగ్గి మీద ఆజ్యం పోసినట్లవుతున్నదని పలువురు పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొంది బీజేపీ జెండా ఎగుర వేయాలని ఆ పార్టీ అగ్రనేతలు తహతహలాడుతున్నారు. దీంతో ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నది. ‘సాలు దొర.. సెలవు దొర’ అనే నినాదంతో అందరినీ ఆకర్శిస్తున్నది. అలాగే వచ్చే నెల 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ,  అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహ పలువురు నాయకులు హాజరవుతున్నారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందరి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసి జనాల్ని సమీకరించే బాధ్యతను పార్టీ జిల్లా ఇన్‌చార్జీలకు అప్పగించింది.  

ఎవరికి వారే అన్నట్లు...

ప్రతి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారుగా చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లుగా ఉన్నారు. పెద్దపల్లి, గోదావరిఖని, తదితర ప్రాంతాల్లో జిల్లా ఇన్‌చార్జీ నిర్వహించిన సమావేశాలకు పార్టీకి చెందిన అందరు నాయకులకు పిలవ లేదనే విమర్శలు వస్తున్నాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌లు వేర్వేరు వర్గాలుగా కొనసాగుతున్నారు. అయితే పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులంతా గుజ్జుల వర్గానికే చెందిన వారు కావడంతో వారిని పార్టీ ఇన్‌చార్జీ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. దుగ్యాల వర్గానికి చెందిన వారితోనే జన సమీకరణ కోసం సమావేశాలు నిర్వహించే బాధ్యతను అప్పగించారని తెలుస్తున్నది. ఆదివారం ఓదెల మండలానికి వెళ్లిన పలువురు బీజేపీ నాయకులు అక్కడి మండల పార్టీ అధ్యక్షుడికి, ఇతర నేతలకు సమాచారం ఇవ్వకుం డానే కొందరితో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిని గమనించి సమావేశం జరుగుతున్న చోటికి వెళ్లిన పార్టీ మండల అధ్యక్షుడు సహ పలువురు తమకు తెలియకుండా పార్టీ సమావేశం ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. దీంతో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోమారపు సత్యనారాయణ ఆ పదవికి చేసిన రాజీనామాను ఇప్పటి వరకు ఆమోదించక పోవడంతో ఆయన పార్టీ మీద ఆలక బూనారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సోమారపు సత్యనారాయణతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఆమోదించి, వచ్చే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గ నుంచి పార్టీ టిక్కెట్‌ ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో సత్యనారాయణ ఆలక వీడారని అంటు న్నారు. రెండు రోజుల క్రితం మోదీ సభ నేపథ్యంలో గోదావరిఖనిలో నిర్వహించిన సమావేశంలో బీజేపీని వీడేది లేదని, వచ్చే ఎన్నికల్లో రామగుండం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై తనకు పార్టీ నుంచి బలమైన హామీ వచ్చిన నేపథ్యంలోనే ఆయన హుషారుగా సమావేశంలో పోటీ చేస్తానని ప్రకటన చేసి ఉంటారని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఆయన ప్రకటనతో రామగుండం నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు డైలామాలో పడ్డారు. అక్కడ కూడా ఒకరినొకరు సమన్వయంతో ఉండడం లేదు. జిల్లాలో బీజేపీ కార్యకర్తలు నేతల వర్గపోరుతో సతమతం అవుతున్నారు. వర్గ పోరు అణచి వేసి కార్యకర్తలకు భరోసా కల్పించాల్సిన జిల్లా ఇన్‌చార్జీ నేతలను సమన్వయం పరచకోగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జిల్లాలో పరిస్థితిని చక్కదిద్దక పోవడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా నిరుత్సాహానికి గురవుతున్నారు. 


Updated Date - 2022-06-28T06:32:26+05:30 IST