ఆమె ‘క్లాస్‌’ అదరహో!

ABN , First Publish Date - 2020-06-17T05:30:00+05:30 IST

ఆమె పక్కింటి ఆంటీలా కనిపిస్తుంది. ఒక సాధారణ గృహిణిలా కొత్త సినిమాలపై, వెబ్‌ సిరీస్‌లపై తనదైన శైలిలో రివ్యూ చేస్తుంది. ఆ రివ్యూలో ఏమాత్రం భేషజాలు ఉండవు. బాగుంటే అభినందిస్తుంది...

ఆమె ‘క్లాస్‌’ అదరహో!

ఆమె పక్కింటి ఆంటీలా కనిపిస్తుంది. ఒక సాధారణ గృహిణిలా కొత్త సినిమాలపై, వెబ్‌ సిరీస్‌లపై తనదైన శైలిలో రివ్యూ చేస్తుంది. ఆ రివ్యూలో ఏమాత్రం భేషజాలు ఉండవు. బాగుంటే అభినందిస్తుంది... బాగా లేకుంటే మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. సున్నితంగా మొట్టికాయలు కూడా వేస్తుంది. ఇంతకీ ఆ ఆంటీ పేరు... బీసీ (భేరీ క్యూట్‌) ఆంటీ. అసలు పేరు స్నేహిల్‌ దీక్షిత్‌ మెహ్రా. ఇటీవల బీసీ ఆంటీ కళ్లజోడు పెట్టుకుని స్కూల్‌ టీచర్‌ అవతారమెత్తి చేసిన ‘క్లాస్‌ ఆఫ్‌ 2025’, ‘క్లాస్‌ ఆఫ్‌ హీరోస్‌’ అనే రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఆమె సెన్సాఫ్‌ హ్యూమర్‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. ఇంతకూ ఆ వీడియోల్లో ఏముంది? ఎవరీ బీసీ ఆంటీ?


అది ‘క్లాస్‌ ఆఫ్‌ 2025’... టీచర్‌ అటెండెన్స్‌ తీసుకుంటోంది. ‘క్వారంటైన్‌ జోషీ’, ‘లాక్‌డౌన్‌ సింగ్‌ రాథోడ్‌’, ‘సోషల్‌ డిస్టెన్స్‌ సింగ్‌’, ‘కొవిడ్‌ అవస్థి’, ‘మాస్క్‌ మహతో’, ‘గ్లోవ్స్‌ గైక్వాడ్‌’... ఒక్కొక్కరి పేరు పిలుస్తుంటే ‘ప్రజెంట్‌ మిస్‌’ అంటున్నారు. మధ్య మధ్యలో టీచర్‌ వారికి చురకలు కూడా అంటిస్తుంది. అదెలాగంటే... ‘కొవిడ్‌ అవస్థి... సెండ్‌ యూ బ్యాక్‌ టు చైనా’ అంటూ. ఇక ‘క్లాస్‌ ఆఫ్‌ హీరోస్‌’ వీడియో విషయానికొస్తే... కొవిడ్‌ సమయంలో హీరోలు సమాజం పట్ల స్పందించిన తీరును ఇందులో చూపే ప్రయత్నం చేశారు. బీసీ ఆంటీ తన క్లాస్‌రూమ్‌లో హీరోలను ప్రస్తావిస్తూ అక్షయ్‌కుమార్‌ను ‘మానిటర్‌ ఆఫ్‌ క్లాస్‌’గా పరిచయం చేస్తుంది. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, టైగర్‌ ష్రాఫ్‌, సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌లను కూడా సున్నితంగా హెచ్చరిస్తుంది. సోనూసూద్‌ను మాత్రం తెగ పొగుడుతుంది. ‘కంగ్రాట్చ్యూలేషన్స్‌ సోనూ... మొన్న పిక్నిక్‌కు వెళ్లినప్పుడు కొంతమంది పిల్లలు వెనకబడితే, సురక్షితంగా వారి వారి ఇళ్లకు చేర్చావు... ఇక నుంచి నువ్వే మానిటర్‌ ఆఫ్‌ మై క్లాస్‌’ అంటుంది. మరో వీడియో ‘క్లాస్‌ ఆఫ్‌ 2025’ సెకండ్‌ పార్ట్‌లో కూడా ఆయా దేశాల పేర్లు చెబుతూ కరోనా పట్ల అవి స్పందిస్తున్న తీరును కామెడీగా, సెటైరికల్‌గా చెబుతుంది. ఈ వీడియోలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతూ ఫన్నీగా ఉండటంతో సోషల్‌ మీడియాలో బీసీ ఆంటీ తెగ పాపులర్‌ అవుతోంది. ఆమె కామికల్‌ స్ర్కిప్ట్‌, టైమింగ్‌ చూసి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా మెచ్చుకుంటున్నారు. 




ఆలోచన ఎలా వచ్చిందంటే...

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన స్నేహిల్‌ దీక్షిత్‌ మెహ్రా ముంబైలోని ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. టీచర్‌గా, న్యూస్‌ యాంకర్‌గా ఆమె అప్పటికే కొన్ని ఫన్నీ వీడియోలు పోస్ట్‌ చేసింది. ఒకరోజు భర్తతో మాట్లాడుతుండగా కరోనాపై గమ్మత్తుగా వీడియో చేయాలనే ఆలోచన ఆమెకు వచ్చింది. ‘‘మొదట్లో ఒక వీడియో చేసినప్పుడు అంతగా నవ్వు రాలేదు. కానీ ఫన్నీ ఇంటిపేర్లు పెట్టడంతో క్లిక్‌ అయ్యింది. వీడియో తీసి నా స్నేహితులకు షేర్‌ చేశా. వారంతా మెచ్చుకోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశా. ఆ తర్వాత వైరల్‌ అయ్యింది. మా అబ్బాయి స్కూల్‌ గ్రూప్‌లో కూడా ఎవరో షేర్‌ చేసి ‘ఫన్నీగా ఉంది’ అన్నారు. ‘అది నేనే’ అని వారికి జవాబిచ్చాను. దాంతో పిల్లల తల్లులు కూడా షాకయ్యారు. చాలామంది పిల్లలు కూడా దానికి అనుసరణలు చేసి ఆ వీడియోలను నాకు పంపారు’’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు స్నేహిల్‌. 


‘క్లాస్‌ ఆఫ్‌ 2025’ సక్సెస్‌ అయిన తర్వాత ‘క్లాస్‌ ఆఫ్‌ హీరోస్‌’ అంటూ మరో వీడియో తీశారు స్నేహిల్‌. అందులో హీరోలను క్లాస్‌ రూమ్‌ పిల్లలుగా సంభోదించడం విశేషం. ‘‘ఈ కరోనా సమయంలో వలస కార్మికులకు సోనూసూద్‌ చేస్తున్న సేవ చాలా గొప్పది. దాంతో ‘క్లాస్‌ ఆఫ్‌ హీరోస్‌’ చేశాను. ఈ వీడియోను సోనూసూద్‌ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు కూడా’’ అన్నారామె. నెటిజన్లు ‘బీసీ ఆంటీ’ అని పిలుస్తున్నప్పటికీ స్నేహిల్‌ పేజీలో సంస్కారవంతమైన కంటెంట్‌ మాత్రమే ఉంటుంది. ‘‘నేనెప్పుడూ అభ్యంతరకరమైన భాషనుగానీ, అసభ్యకరమైన పోస్టులనుగానీ వాడలేదు. సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల రివ్యూలు కూడా సాదా సీదాగా ఉంటాయి. వీడియోలన్నింట్లో భోలీ భాలీ, క్యూట్‌ ఆంటీలు ఎలా ఉంటారో అలాగే కనిపిస్తాను. నా టాలెంట్‌ను అంతా గుర్తిస్తున్నప్పటికీ నేను కేవలం హాబీగా మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నా. గృహిణిగా, ఉద్యోగినిగా బిజీగా ఉన్నప్పటికీ నా ఈ అభిరుచిని ఇలాగే కొనసాగిస్తా’’ అంటున్న బీసీ ఆంటీ మొత్తానికి తన సృజనాత్మక ఫన్నీ వీడియోలతో నవ్వుల పూలు పూయిస్తున్నారు.


Updated Date - 2020-06-17T05:30:00+05:30 IST