వారంలో స్పష్టత

ABN , First Publish Date - 2022-05-25T07:53:51+05:30 IST

రాష్ట్ర అభివృద్ధి అప్పుల (ఎస్‌డీఎల్‌)పై సర్కారుకు ఇంకా స్పష్టత లభించలేదు.

వారంలో స్పష్టత

  • అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో రామకృష్ణారావు భేటీ
  • గ్యారంటీ అప్పుల చెల్లింపుపై సమగ్ర వివరణ
  • కార్పొరేషన్లకు చెల్లించే సామర్థ్యం ఉందని వ్యాఖ్య
  • గ్యారంటీ అప్పులను ‘బడ్జెట్‌’ల్లో కలపడంపై అభ్యంతరం
  • వారంలో వివరణ ఇస్తామన్న సోమనాథన్‌
  • 31న 3000 కోట్ల అప్పు తీసుకోవడానికి ఇండెంట్‌
  • అప్పటికి అనుమతి వస్తుందంటున్న అధికారులు


హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధి అప్పుల (ఎస్‌డీఎల్‌)పై సర్కారుకు ఇంకా స్పష్టత లభించలేదు. వాటిపై వారంలోగా స్పష్టత ఇస్తామని ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్‌ చెప్పారు. అప్పులకు అనుమతుల కోసమే కొద్ది రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన రామకృష్ణారావు ఎట్టకేలకు సోమవారం సోమనాథన్‌తో భేటీ అయ్యారు. గ్యారంటీ అప్పులను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ గ్యారంటీ అప్పులను వివిధ కార్పొరేషన్లు తీసుకున్నాయని, వాటికి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందని వివరించారు.


మిషన్‌ భగీరథ కార్పొరేషన్‌ ద్వారా అందించే తాగునీటికి మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, పంచాయతీలు బిల్లులు చెల్లిస్తాయని, ఆ నిధులతో కార్పొరేషన్‌ అప్పులను తీర్చగలదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌ సరఫరా చేసే నీటిని వివిధ పరిశ్రమలు వినియోగిస్తున్నాయని, వాటి నుంచి బిల్లులను కార్పొరేషన్‌ వసూలు చేస్తుందని తెలిపారు. ఇక, స్టేట్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు టోల్‌ట్యాక్స్‌ రూపంలో డబ్బు సమకూరుతుందని చెప్పారు. 


గ్యారంటీ అప్పులు తీసుకున్న కార్పొరేషన్లకు ఏదో ఒక రూపంలో నిధులు సమకూరుతున్నాయని, అప్పులను తీర్చే స్థాయిలో అవి ఉన్నాయని తెలిపారు. ఈ దృష్ట్యా గ్యారంటీ అప్పులను బడ్జెట్‌ అప్పులతో కలిపి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధిలోకి తీసుకురావడం సరైన నిర్ణయం కాదని వివరించారు. ప్రస్తుతం ఆయా కార్పొరేషన్ల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, అవి పూర్తి కాగానే నిధులు సమకూరుతుంటాయని చెప్పారు. అప్పటి వరకు ఓపిక పట్టాలని, అకస్మాత్తుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తెస్తామంటూ అప్పులు పుట్టకుండా చేయడం సరైన చర్య కాదని  తప్పుబట్టారు


. ఏటా జీఎ్‌సడీపీ గణనీయంగా పెరుగుతోందని, అప్పులు తీర్చే సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, బడ్జెట్‌లో ప్రతిపాదించిన మేర అప్పు తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. దాంతో, పూర్తి సమాచారాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, వారంలోగా ఏదేని విషయం చెబుతామని సోమనాథన్‌ బదులిచ్చారని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈనెల 31న రూ.3000 కోట్ల అప్పు తీసుకోవాల్సి ఉందని, అప్పటికి అనుమతి లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి, ఈనెల 24న ఆంధ్రప్రదేశ్‌ సహా ఏడు రాష్ట్రాలు ఆర్బీఐ ద్వారా రూ.13,900 కోట్ల అప్పు తీసుకున్నాయి. కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో 24న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇండెంటు పెట్టలేదు. ఇక, ఈనెల 31న రూ.3000 కోట్లు, జూన్‌ 7న రూ.1000 కోట్లు, జూన్‌ 14న రూ.2000 కోట్లు, జూన్‌ 28న రూ.1000 కోట్ల చొప్పున అప్పులు తీసుకుంటామని ఇండెంట్లు పెట్టింది. కనీసం ఈనెల 31న తీసుకునే అప్పు నాటికైనా కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.

Updated Date - 2022-05-25T07:53:51+05:30 IST