చెట్లు పెంచడమే కాదు, ఉద్గారాలను తగ్గించాలి!

ABN , First Publish Date - 2022-05-15T08:19:59+05:30 IST

చెట్లు పెంచడమే కాదు, ఉద్గారాలను తగ్గించాలి!

చెట్లు పెంచడమే కాదు, ఉద్గారాలను తగ్గించాలి!

పర్యావరణ పరిరక్షణపై అమెరికా పరిశోధకుల స్పష్టీకరణ


సాల్ట్‌ లేక్‌ సిటీ; మే 14: పర్యావరణ పరిరక్షణ అనగానే మొదట గుర్తొచ్చేది చెట్ల పెంపకమే. భూమిని వేడెక్కిస్తున్న కర్బన వాయువులను పీల్చుకునే శక్తి చెట్లకు ఉండటమే అందుక్కారణం. కానీ.. అమెరికాలోని ఉటా విశ్వవిద్యాలయ పరిశోధకులు మాత్రం చెట్లను పెంచడమొక్కటే దీనికి సమాధానం కాదని తాజాగా తేల్చిచెప్పారు. సైన్స్‌, ఎకాలజీ లెటర్స్‌ అనే రెండు జర్నల్స్‌లో ప్రచురించిన అధ్యయనాల ఆధారంగా ఉటా వర్సిటీ శాస్త్రవేత్తలు పలు వివరాలను తాజాగా వెల్లడించారు. ‘‘పర్యావరణంలోని కర్బనాన్ని చెట్లు తగ్గించడమనేది చాలా పరిమితమైనది. ఉద్గారాల విడుదలను తగ్గించుకోకుండా భూమిని కాపాడేందుకు కేవలం చెట్లపైనే ఆధారపడటం అంత గొప్ప ఆలోచన కాదు.  కాలుష్యం కారణంగా ఎదుగుదల నిలిచిపోయి, కణాజాల అభివృద్ధి ఆగిపోయే అవకాశమూ ఉంటుంది. వేలాది ఏళ్ల వయసు కలిగిన చెట్లపై మేం జరిపిన అధ్యయనాల ప్రకారం.. గాలిలోని కర్బన వాయువు కంటే కరువు పరిస్థితులే చెట్లపై తీవ్రంగా ప్రభావాన్ని చూపించాయి. పర్యావరణ విధానకర్తలు భూమిని కాపాడేందుకు అడవులపై ఆధారపడటం గురించి పునరాలోచించుకోవాలి. కర్బనఉద్గారాల తగ్గుదలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలి. మన పర్యావరణాన్ని కాపాడుకునే అవకాశం ఇంకా మన చేతిలోనే ఉంది. అడవులభవిష్యత్తు కూడా మననిర్ణయాలపైనే ఆధారపడి ఉంది’’ అని పరిశోధకులు స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-15T08:19:59+05:30 IST