‘చిరిగిపోయేంత వరకు ఎన్నాళ్లైనా ఆ మాస్కులు వాడొచ్చు.. పారేయనవసరం లేదు..’

ABN , First Publish Date - 2020-04-08T18:36:41+05:30 IST

విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారికి కరోనా లక్షణాలుంటే, వారిని మాత్రమే ఆస్పత్రిలో క్వారంటైన్‌ చేస్తామని, ఇంకెవరికైనా కరోనా పరీక్షలు నిర్వహిస్తే...హోమ్‌ క్వారంటైన్‌కే పంపిస్తామని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ స్పష్టంచేశారు. విశాఖపట్నంలో క్వారంటైన్‌ తీరుపై చెలరేగుతున్న

‘చిరిగిపోయేంత వరకు ఎన్నాళ్లైనా ఆ మాస్కులు వాడొచ్చు.. పారేయనవసరం లేదు..’

ఎన్‌-95 మాస్కులకు కాల పరిమితి లేదు

విదేశీ ప్రయాణికులకే క్వారంటైన్‌

కరోనా లక్షణాలుంటేనే ఐసోలేషన్‌కు...

కలెక్టర్‌ వినయ్‌చంద్‌


విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారికి కరోనా లక్షణాలుంటే, వారిని మాత్రమే ఆస్పత్రిలో క్వారంటైన్‌ చేస్తామని, ఇంకెవరికైనా కరోనా పరీక్షలు నిర్వహిస్తే...హోమ్‌ క్వారంటైన్‌కే పంపిస్తామని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ స్పష్టంచేశారు. విశాఖపట్నంలో క్వారంటైన్‌ తీరుపై చెలరేగుతున్న విమర్శలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ అతిథి గృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గాజువాక కుంచమాంబ కాలనీకి చెందిన మాంసం వ్యాపారి నుంచి కరోనా పరీక్షకు నమూనాలు సేకరించి, ఆయన్ను ఆస్పత్రిలో ఉంచకుండా ఇంటికి ఎలా పంపించేశారని, విలేఖరులు ప్రశ్నించగా, ప్రభుత్వ నిబంధనల మేరకు ఆ విధంగా చేశామని చెప్పుకొచ్చారు.


మాంసం వ్యాపారి విదేశీ ప్రయాణం చేసి రాలేదని, అతనికి లోకల్‌ కాంటాక్ట్‌ ద్వారా వైరస్‌ వచ్చి ఉంటుందనే అనుమానంతో పరీక్షలు నిర్వహించామని, అటువంటి వారిని ఆస్పత్రిలో క్వారంటైన్‌ చేయకూడదని, నిబంధనలు అంగీకరించవన్నారు. హోమ్‌ క్వారంటైన్‌లో వుండాలని చెప్పి పంపించామని, అయితే అతను నిబంధనలు ఉల్లంఘించారని, అది ఆయన చేసిన తప్పు అని పేర్కొన్నారు. అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. అంతే తప్ప ఇందులో అధికారుల తప్పిదం ఏమీ లేదన్నారు. 


కేవలం 108 మందికే లక్షణాలు

విశాఖపట్నం జిల్లాకు విదేశాల నుంచి 3,117 మంది రాగా, వారందరికీ పరీక్షలు నిర్వహించగా కేవలం 108 మందిలోనే కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించాయన్నారు. వారందరినీ ఐసోలేషన్‌కు పంపించామని, తగ్గిన తరువాత డిశ్చార్జి చేశామన్నారు. లక్షణాలు లేని విదేశీ ప్రయాణికులు 14 రోజులు క్వారంటైన్‌ పీరియడ్‌ పాటించి, స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలన్నారు. విశాఖకు వచ్చిన వారిలో కేవలం 80 మంది మాత్రమే ఇంకా 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి కావలసినవారు ఉన్నారని, మిగిలిన వారికి క్వారంటైన్‌ పీరియడ్‌ పూర్తయిందని, వారు బయట అందరిలాగే  తిరగవచ్చునని, వారిపై ఇరుగుపొరుగు వారు ఫిర్యాదులు చేయడం మానుకోవాలని సూచించారు. కేజీహెచ్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన కోవిడ్‌ లేబొరేటరీలో రోజుకు 100 నుంచి 125 మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, శాంపిల్‌ అందించిన ఆరు గంటల్లో ఫలితం వస్తుందన్నారు. 


ఆ మాస్క్‌ ఎన్నాళ్లయినా వాడుకోవచ్చు

జిల్లాలో మాస్కుల కొరత గురించి మాట్లాడుతూ, ఐసోలేషన్‌, క్వారంటైన్‌ సెంటర్లకు వారం రోజులకు సరిపడా మాస్కులు, మందులు సరఫరా చేశామన్నారు. కరోనా అనుమానిత రోగులను అంబులెన్స్‌ల్లో తరలించే వారికి, నర్సింగ్‌ సిబ్బందికి, వారికి చికిత చేసే వైద్యులకు ఎన్‌-95 మాస్కులు ఇస్తారని, వాటి వినియోగానికి పరిమితి లేదని, చినిగిపోయేంత వరకు ఉపయోగించుకోవచ్చునన్నారు. వైద్య పరికరాలను ఒక దగ్గర నుంచి కాకుండా బహుళ మార్గాల్లో సమీకరిస్తున్నామని, వాటికి కొరత లేదన్నారు.

Updated Date - 2020-04-08T18:36:41+05:30 IST