సీబీఐపై సీజేఐ జస్టిస్ రమణ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-08-06T19:35:28+05:30 IST

కేంద్ర దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరోల వ్యవహార

సీబీఐపై సీజేఐ జస్టిస్ రమణ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరోల వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు బెదిరింపులు వస్తున్నాయని జడ్జీలు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయ వ్యవస్థకు ఈ సంస్థలు సహకరించడం లేదని దుయ్యబట్టింది. గ్యాంగ్‌స్టర్లు, హై ప్రొఫైల్ వ్యక్తుల ప్రమేయంగల కేసులను విచారించే న్యాయమూర్తులు అనేక సందర్భాల్లో మానసికంగా వేధింపులకు గురవుతున్నారని పేర్కొంది. సీబీఐ, ఐబీలకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం ఉండటం లేదని మండిపడింది. సీబీఐ వైఖరి యథాతథంగా కొనసాగుతోందని న్యాయ వ్యవస్థకు ఎటువంటి సహాయం అందడం లేదని వ్యాఖ్యానించింది. 


జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యకు గురైన కేసుపై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ శుక్రవారం మాట్లాడుతూ, గ్యాంగ్‌స్టర్లు, హై ప్రొఫైల్ వ్యక్తులు నిందితులుగా ఉన్న కేసులు మన దేశంలో చాలా ఉన్నాయన్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ మెసెజ్‌లను పంపిస్తూ న్యాయమూర్తులను మానసికంగా వేధిస్తూ, బెదిరిస్తున్నారన్నారు. ఈ వేధింపులు, బెదిరింపులపై ఫిర్యాదులు చేసినప్పటికీ, సీబీఐ చేస్తున్నదేమీ లేదన్నారు. సీబీఐ వైఖరిలో మార్పులేదని చెప్తూ, ఈ విధంగా వ్యాఖ్యానించవలసి రావడం బాధాకరమని కూడా అన్నారు. 


ప్రతికూల తీర్పు వచ్చినపుడు న్యాయమూర్తులను అపఖ్యాతిపాలు చేసే కొత్త ధోరణి మన దేశంలో వచ్చిందన్నారు. న్యాయమూర్తులు సీబీఐకి కానీ, పోలీసులకు కానీ ఫిర్యాదు చేసినప్పటికీ ఆ వ్యవస్థలు స్పందించడం లేదన్నారు. సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో అసలు ఏమాత్రం న్యాయ వ్యవస్థకు సహకరించడం లేదన్నారు. 


అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ, దాడుల నుంచి న్యాయమూర్తులకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని అంగీకరించారు. భద్రతను కట్టుదిట్టం చేయవలసి ఉందన్నారు. దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన వద్ద ఉందని, కొన్ని కఠినమైన చర్యలను అమలు చేయవలసిన సమయం ఆసన్నమైందన్నారు. 


ధన్‌బాద్ అడిషినల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన ఓ రోజు ఉదయం ఇంటి నుంచి వాకింగ్‌ చేయడానికి వెళ్ళినపుడు, ఓ ఆటో ఆయనను ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసును సుప్రీంకోర్టు స్వీయ విచారణకు చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు యథాతథ నివేదికను ఓ వారం రోజుల్లో సమర్పించాలని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఆదేశాలిచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 17న జరుగుతుంది.


మరోవైపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులిచ్చింది. జడ్జిల ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నివేదికలను సమర్పించాలని కోరింది.


Updated Date - 2021-08-06T19:35:28+05:30 IST