కస్టడీలో ‘థర్డ్ డిగ్రీ’పై సీజేఐ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-08-08T23:17:00+05:30 IST

మన దేశంలో కస్టోడియల్ టార్చర్, ఇతర పోలీసు దుశ్చర్యలు

కస్టడీలో ‘థర్డ్ డిగ్రీ’పై సీజేఐ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : మన దేశంలో కస్టోడియల్ టార్చర్, ఇతర పోలీసు దుశ్చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్‌ నుంచి ప్రత్యేక అధికారాలు కలవారికి సైతం మినహాయింపు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పోలీసులకు మానవ హక్కులపై అవగాహన కల్పించాలని జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా)ను కోరారు. నల్సా మొబైల్ యాప్‌ను, ‘విజన్ అండ్ మిషన్ స్టేట్‌మెంట్‌’ను ఆయన ఆవిష్కరించారు. 


నల్సా ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ రమణ మాట్లాడుతూ, మానవ హక్కులకు, శారీరక భద్రతకు ముప్పు పోలీస్ స్టేషన్లలో అత్యధికంగా ఉందన్నారు. పోలీసు కస్టడీలో నిర్బంధంలో ఉన్నవారిపై హింస, ఇతర పోలీసు దుశ్చర్యలు నేడు మన సమాజంలో ఇంకా కొనసాగుతున్న సమస్యలని చెప్పారు. రాజ్యాంగపరమైన ప్రకటనలు, హామీలు ఉన్నప్పటికీ, పోలీస్ స్టేషన్లలో సమర్థవంతమైన న్యాయ ప్రాతినిధ్యం లేకపోవడం అరెస్టయినవారికి, నిర్బంధంలో ఉన్నవారికి అత్యంత తీవ్ర నష్టదాయకమని చెప్పారు. ఇటీవల వస్తున్న వార్తలను పరిశీలించినపుడు ప్రత్యేక అధికారాలు కలవారికి సైతం థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్‌ నుంచి మినహాయింపు ఉండటం లేదన్నారు. 


న్యాయ సహాయం రాజ్యాంగ హక్కు

పోలీసుల అతి ప్రవర్తనను నిరోధించేందుకు చేపట్టవలసిన చర్యలను వివరిస్తూ, న్యాయ సహాయం పొందడం, ఉచిత న్యాయ సహాయ సేవలు అందుబాటులో ఉండటం ప్రజలకు రాజ్యాంగ హక్కులనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. దీనికి సంబంధించిన డిస్‌ప్లే బోర్డులను, ఔట్‌డోర్ హోర్డింగ్స్‌ను ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ, జైలులోనూ ఏర్పాటు చేయాలన్నారు. నల్సా దేశవ్యాప్తంగా పోలీసు అధికారులకు వీటిపై చురుగ్గా అవగాహన కల్పించాలన్నారు. 


తపాలా శాఖ సేవలు

కోవిడ్-19 మహమ్మారి పీడిస్తున్నప్పటికీ, న్యాయ సహాయ సేవలను కొనసాగించడంలో నల్సా విజయవంతమైందన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో అనుసంధానం దయనీయంగా ఉన్నంత మాత్రానికి, ఆ ప్రాంతాలవారికి న్యాయం అందడంలో ఆటంకాలు ఏర్పడకుండా నల్సా సమన్వయంతో కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. న్యాయ సహాయం గురించి అవగాహనను పెంచడం కోసం తపాలా శాఖ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చునన్నారు. భౌగోళిక పరిమితుల కారణంగా న్యాయానికి చేరువ కాలేకపోతున్నవారికి తపాలా కార్యాలయం, పోస్ట్‌మ్యాన్ సేవలు వారధిగా నిలుస్తాయని చెప్పారు. దీనివల్ల పట్టణ, గ్రామీణ జనాభా మధ్య వ్యత్యాసం తగ్గుతుందన్నారు. 


మీడియా ప్రధాన భాగస్వామి

లీగల్ సర్వీసెస్ అథారిటీలో సేవలందిస్తున్నవారందరి కృషిని ప్రశంసిస్తూ, న్యాయవాదులు, మరీ ముఖ్యంగా సీనియర్ న్యాయవాదులు, తమ పని వేళల్లో కొంత వరకు అవసరార్థులకు సహాయం చేయడానికి వినియోగించాలని కోరారు. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో మీడియా ప్రధాన భాగస్వామి అని తెలిపారు. సేవా సందేశాన్ని విస్తృతంగా వ్యాపింపజేయగలిగిన సాటి లేని సామర్థ్యం మాస్ మీడియాకు ఉందన్నారు. 


నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ యూయూ లలిత్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. 


Updated Date - 2021-08-08T23:17:00+05:30 IST