సీజే..బోబ్డే వెంటనే తప్పుకోండి

ABN , First Publish Date - 2021-03-04T06:46:07+05:30 IST

అత్యాచారం చేసిన అమ్మాయిని వివాహం చేసుకుంటావా... అని ఓ రేపిస్టును సుప్రీంకోర్టు అడగడం దారుణమని అనేకమంది మహిళా సంఘాల కార్యకర్తలు, సామాజిక ప్రముఖులు తీవ్రంగా నిరసించారు. పలుమార్లు అత్యాచారానికి

సీజే..బోబ్డే వెంటనే తప్పుకోండి

బాధితురాలిని పెళ్లాడతావా అని రేపిస్టును అడగడమా?

మీ మాటలు కోర్టుల గౌరవానికే కళంకం

ఇవి అత్యాచారం చేసిన వారికి ఊతమిస్తాయి

న్యాయం మహిళలకు రాజ్యాంగ హక్కు కాదా?

ప్రత్యేక లేఖలో 4 వేల మంది తీవ్ర విమర్శ

వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: బృందా కరాత్‌

జ్యుడీషియల్‌ రికార్డుల్లో ఉన్నదే సీజే అడిగారు

ధర్మాసనంపై విమర్శలు అన్యాయం: సుప్రీం


న్యూఢిల్లీ, మార్చి 3: అత్యాచారం చేసిన అమ్మాయిని వివాహం చేసుకుంటావా... అని ఓ రేపిస్టును సుప్రీంకోర్టు అడగడం దారుణమని అనేకమంది మహిళా సంఘాల కార్యకర్తలు, సామాజిక ప్రముఖులు తీవ్రంగా నిరసించారు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, హింసించిన వ్యక్తి అదే బాలికను పెళ్లి చేసుకోవాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానమే పరోక్షంగా చెప్పడం అత్యాచారాన్ని సమర్థించినట్లే భావించాలని, దీనిని ఖండిస్తున్నామని, ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ బోబ్డే వెంటనే రాజీనామా చేయాలని దాదాపు 4వేల మంది సామాజిక, మహిళా ప్రముఖులు, సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ముంబైకి చెందిన మొహిత్‌ సుభాష్‌ చవాన్‌ అనే ప్రభుత్వోద్యోగి స్కూల్లో చదువుకుంటున్న బాలికను పదేపదే రేప్‌ చేయడమే కాక, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పెట్రోల్‌ పోసి తగలబెడ్తానని, యాసిడ్‌ పోసి మొహం కాల్చేస్తానని బెదిరించాడు. ఆ వ్యక్తికి కిందికోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయగా బాంబే హైకోర్టు ఆ బెయిల్‌ను కొట్టేసింది. దాంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ‘‘నువ్వు ఆ బాలికను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటానంటే మేం నీకు సాయపడతాం. లేదంటే నువ్వు జైలుకెళ్లాల్సి వస్తుంది. నీ ఉద్యోగమూ పోతుంది. నువ్వు ఆమెను వశపర్చుకుని అత్యాచారం చేశావు..  ఆలోచించుకో. ‘పెళ్లి చేసుకో...’ అని మేమేమీ బలవంత పెట్టడం లేదు’ అని సీజే బోబ్టే అన్నారు.  ఆ రేపిస్టుకు నెలరోజుల గడువిచ్చి అంతదాకా అరెస్టు చేయవద్దని ఆయన సారథ్యంలోని బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది.  ఆ రేపిస్టుకు ఇదివరకే పెళ్లయిపోయింది. ఆ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియపరిచారు. కానీ కోర్టు ఆ ఉత్తర్వులివ్వడం తీవ్ర దుమారం రేపింది.


‘అంటే ఒక అమ్మాయిని తీవ్రంగా రేప్‌ చేసి ఆ తరువాత వివాహం చేసుకుంటే ఫరవాలేదన్నమాట. పెళ్లయిన వ్యక్తి ఇలా అత్యాచారాలకు పాల్పడడాన్ని సమర్థిస్తారా? లోబర్చుకోవడం, అత్యాచారం, పెళ్లి... ఇలాంటి వాటికి అర్థాలను బాధిత మహిళలు సాక్షాత్తూ రాజ్యాంగానికి భాష్యం చెప్పే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకే చెప్పాల్సిన దుర్గతి పట్టడం బాధాకరం. మహిళలపై హింస, లైంగిక వేధింపుల కేసులను విచారించే విషయంలో భారత న్యాయవ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు హానికరంగా మారిందని ఆ ప్రముఖులు బహిరంగలేఖలో దుయ్యబట్టారు. ‘మీకు ముందు సీజేగా వ్యవహరించిన వ్యక్తి (రంజన్‌ గొగోయ్‌) స్వయంగా లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొన్నారు. ఆయనే స్వయంగా జడ్జిగా వ్యవహరించారు కూడా! ఆనాడు ఫిర్యాదు చేసిన మహిళపై అభాండాలు మోపి, ఆమె కుటుంబాన్ని పలువిధాల హింసించిన వైనాన్ని చూశాం. గతంలో దోషిగా తేలిన రేపిస్టు విడుదలను సవాల్‌ చేస్తూ దాఖలైన అప్పీలును అడ్మిట్‌ చేసుకోలేదు. 


సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతుల భార్యలు ఆందోళనలో పాల్గొనడమెందుకు, వారిని ఇళ్లకు పంపేయాలని మీరు సూచిస్తారు... అంటే పురుషులకున్న స్వతంత్రం, బాధ్యత మహిళలకుండవా?... నిన్నటికి  నిన్న ఓ కేసులో మీరు (సీజే) ఏమన్నారు... భార్యాభర్తలుగా సహజీవనం చేస్తున్న ఓ జంటలో భర్త క్రూరుడు కావొచ్చు, కానీ, చట్టబద్ధంగా పెళ్లయిన భార్యాభర్తల మధ్య జరిగే లైంగిక సమాగమాన్ని రేప్‌ అని అనగలమా..? అని ప్రశ్నించారు. అంటే భర్త పెట్టే లైంగిక, భౌతిక, మానసిక హింసను చట్టబద్ధం చేయడమే.....  ఇలాంటివెన్నో.. ఇక చాలు... మీ మాటలు కోర్టుల గౌరవానికి, అధికారానికి కళంకం తెచ్చేవిగా ఉన్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థాన అధిపతిగా ఉన్న మీరు ఇతర జడ్జీలకు, దిగువ కోర్టుల న్యాయమూర్తులకు, చట్టాన్ని అమలు చేసే ఇతర సంస్థలకు, సమాజానికి ఇస్తున్న సందేశమేంటంటే... న్యాయం పొందడం అనేది భారతీయ మహిళల రాజ్యాంగ హక్కు కాదు... అని! శతాబ్దాల మౌనం తరువాత మహిళాలోకం ఇపుడిపుడే తమ బాధలగాథల్ని బయటకు చెబుతోంది.


కానీ ఈ తరహా వైఖరి అమ్మాయిల, మహిళల గొంతును మరింత నొక్కేస్తుంది. రేపిస్టులకు ఇస్తున్న సందేశమేంటంటే... పెళ్లి అనేది అత్యాచారానికి లైసెన్సు అని! ఒకసారి ఆ లైసెన్సు లభించేస్తే తాను చేసిన దుష్కృత్యాన్ని సదరు రేపిస్టు చట్టబద్ధం చేసేసుకోవచ్చు. మోహిత్‌ చవాన్‌ కేసులో దిగువకోర్టు బెయిలివ్వడాన్ని తీవ్రంగా అధిక్షేపిస్తూ ‘ఇది ఘోరం.. ఇలాంటి అత్యంత సీరియస్‌ వ్యవహారంపట్ల ఏమీ పట్టనట్లు, స్పందన లేకుండా సున్నితతత్వం లేకుండా జడ్జి వ్యవహరించారు’ అని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు మాటలు మీ వ్యాఖ్యలకూ అప్లయ్‌ అవుతాయి. చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువగా..! సమస్య పరిష్కారానికి గాను, అత్యాచారానికి గురైన మైనర్‌ బాలికను పెళ్లాడతావా అని మీరు ప్రతిపాదించడం ఘోరాతి ఘోరం, బాధితులకు న్యాయం అందకుండా చేయడం. అందుచేత మార్చి 1వ తేదీన కోర్టులో మీరు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. 


ఈ దేశ మహిళాలోకానికి మీరు క్షమాపణలు చెప్పాలి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పదవికి రాజీనామా చేయడం మర్యాద’’ అని ఆ లేఖలో తీవ్రస్థాయిలో తన అసంతృప్తిని, నిరసనను వ్యక్తం చేశారు. లేఖలపై సంతకాలు చేసినవారిలో కవితా కృష్ణన్‌, కమలా భాసిన్‌, అరుంధతి ధారు, అనీ రాజా, మరియం ధవాలే, మీరా సంఘమిత్రలతో పాటు దేశంలోని అనేక ప్రముఖ మహిళా సంఘాలు, హక్కుల సంఘాల నేతలు ఉన్నారు. వీరితో పాటు రిటైర్డ్‌ అడ్మిరల్‌ రాందాస్‌, అరుణా రాయ్‌, నిఖిల్‌ దే, ఆనంద్‌ సహాయ్‌,  దేవకీ జైన్‌, లక్ష్మీ మూర్తి.. మొదలైన ప్రముఖులు కూడా ఉన్నారు. అటు సీపీఎం నేత బృందా కారత్‌ కూడా సీజే వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘పదహారేళ్ల బాలికపై 10-12 సార్లు అత్యాచారం చేసిన వ్యక్తిని ఆమెను పెళ్లి చేసుకుంటావా అని అడగడం సమాజానికి తప్పుడు సందేశన్నిస్తోంది. వెంటనే వాటిని ఉపసంహరించుకోండి’’ అని ఆమె సీజేకు రాసిన లేఖలో అభ్యర్థించారు. 

Updated Date - 2021-03-04T06:46:07+05:30 IST