Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 04 Oct 2021 12:35:10 IST

Civils లో 20వ ర్యాంకు సాధించిన మన తెలుగమ్మాయి శ్రీజ.. ఇంటర్వ్యూలో బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలివి..!

twitter-iconwatsapp-iconfb-icon
Civils లో 20వ ర్యాంకు సాధించిన మన తెలుగమ్మాయి శ్రీజ.. ఇంటర్వ్యూలో బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలివి..!

పేరు: డాక్టర్‌ పి. శ్రీజ

ర్యాంకు: 20

స్వస్థలం: వరంగల్‌

(ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం)

తండ్రి: శ్రీనివా్‌స (హోండా షోరూమ్‌లో సీనియర్‌ సేల్స్‌ మేనేజర్‌)

తల్లి: లత 

(రఘునాథపల్లి పీహెచ్‌సీలో నర్సు)

తమ్ముడు: సాయిరాజ్‌ 

(డిగ్రీ చదువుకుంటున్నాడు)

ఇంటర్వ్యూ: టీసీఏ అనంత్‌ బోర్డ్‌


ఇటీవల విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో ఈసారి తెలుగింటి అమ్మాయిలు మెరుగైన విజయాలు సాధించారు. ప్రిపరేషన్‌ నుంచి ఇంటర్వ్యూ వరకు ఎవరి స్టయిల్‌ వారిదే. ఆ క్రమంలో ముందు వరుసలో అంటే 20వ ర్యాంక్‌ సాధించిన శ్రీజ డాక్టర్‌. తాను ఇంటర్వ్యూ ఎదుర్కొన్న విధానాన్ని ‘దిక్సూచి’తో పంచుకున్నారు. సివిల్స్‌ ఇంటర్వ్యూలు ఎలా జరుగుతాయి అనే విషయంలో అందరికీ ఆసక్తి ఉంటుంది. వారికి అవగాహన కలుగడమే కాకుండా, గ్రూప్‌ 1, బ్యాంక్‌ ప్రొబేషనరీ అధికారి, సివిల్స్‌కు సిద్ధమయ్యేవారికీ ఉపయోగపడుతుంది.  


బోర్డ్‌ చైర్మన్‌: హలో శ్రీజ, ఫేస్‌ షీల్డ్‌తో అసౌకర్యంగా ఉంటే నీవు తొలగించుకోవచ్చు. బీ ఫ్రీ. 2018లో ఎంబీబీఎస్‌ పూర్తయింది కదా... అప్పటి నుంచి ఏమి చేస్తున్నావు?


శ్రీజ: 2019లో ఇంటర్న్‌షిప్‌ చేశాను. తరవాత సివిల్స్‌కు ప్రిపరేషన్‌ మొదలుపెట్టాను. 2021 నుంచి ఎన్జీఓ సేవాభారతితో కలిసి పనిచేస్తున్నాను.


ప్ర: సేవాభారతిలో మీరేం చేసేవారు?


జ: అదో స్వచ్చంధ సంస్థ. ఐసోలేషన్‌ సెంటర్స్‌లో ఉన్న రోగుల దగ్గరకు సెలవు రోజుల్లో పర్సనల్‌గా అటెండయేదాన్ని మిగిలిన రోజుల్లో  టెలిమెడిసిన్‌ సేవలు అందించేదాన్ని. 

 

ప్ర: ఎంబీబీఎస్‌ టఫ్‌ కోర్సు. అక్కడ కూడా ఎదిగేందుకు అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏ విషయాలు సివిల్స్‌ వైపు వచ్చేలా మోటివేట్‌ చేశాయి.

 

జ: ప్రజాసేవలో ఉండాలనేది నా కోరిక. అలాగే సైన్సె్‌సపై కూడా ఆసక్తి ఉంది. అలా డాక్టర్‌ అయ్యాను. నేను మెడిసిన్‌ రెండో ఏడాది కోర్సు చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్పాల్సి ఉంది. మా నాన్నగారిని సర్జరీ కోసం ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రిలో  చేర్పించాల్సి వచ్చింది. సుదీర్ఘంగా ఉన్న క్యూ, కనీసం సదుపాయాల లేమి నన్ను మాట్లాడేలా చేసింది. సమానత్వం హక్కుపై మనం మాట్లాడతాం. సామాన్యుడికి ప్రాథమికావసరాలు తీరడాన్ని డిగ్నిటీకి సంబంధించిన హక్కుగా మాత్రం గుర్తించం. సరిగ్గా ఆ సంఘటనే నన్ను ప్రివెంటివ్‌ హెల్త్‌ కేర్‌పై దృష్టి సారించేలా చేసింది. అడ్మినిస్ట్రేషన్‌పరంగా చాలా పాత్ర పోషించాల్సిన అవసరాన్ని గుర్తించేలా చేసింది. అందుకు ఐఏఎస్‌ ఒక సోపానం అవుతుందనీ కూడా భావించాను.


ప్ర: సివిల్‌ సర్వీసె్‌సలో మీ ఎంబీబీఎస్‌ డిగ్రీ ఎలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

 

జ: ఒక సివిల్స్‌ అధికారి మాదిరిగా సమాజంలోని ప్రతి వ్యక్తి బాగోగులను పట్టించుకునే అవకాశం మరెవరికీ ఉండదు. అతి తక్కువగా ఉండే మానవవనరులు ముఖ్యంగా ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అలాగే ఆశావహ దృక్పథంతో ట్రయేజ్‌ ఫిలాసఫీ ఆచరణకు ఇందులో అవకాశం ఉంటుంది. (దీంతో గుడ్‌ అన్న చైర్మన్‌, మరో సభ్యుడివైపు చూశారు)


మరో సభ్యుడు: మీకు భిన్నమైన హాబీలు ఉన్నాయి. వాటిని ఏ ప్రయోజనంతో అలవర్చుకున్నారు?


జ: నన్ను నేను అర్థం చేసుకునే క్రమంలో వాటన్నింటిపై దృష్టిసారించాను. చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాల కోసం కూడా 


ప్ర: మీరు  ఏ సర్వీస్‌ కోరుకుంటున్నారు?


జ: ఐఏఎస్‌


ప్ర: మీ దృష్టిలో ఐఏఎస్‌ అధికారికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? మరోలా చూద్దాం... ఐఏఎ్‌సకు శ్రీజను మేం ఎందుకు ఎంపిక చేయాలి? మీకున్న యూనిక్‌ లక్షణాలు ఏమిటి?


జ: సర్‌ నాలో సహనం, సానుభూతి ఉన్నాయి. చాలా ముఖ్యమైన భావోద్వేగాలను అర్థం చేసుకునేందుకు అవి బాగా ఉపయోగపడతాయి. రియలిజమ్‌ని నమ్ముతాను. అయితే ఐడియలిజమ్‌తో బ్యాలెన్స్‌ చేసుకునే ప్రయత్నం చేస్తాను. కొన్ని సమస్యలకు పరిష్కారం అసాధ్యం  అనిపిస్తుంది. ఆ సమయంలో అధికారం, విచక్షణ ఉపయోగించేటప్పుడు రియాల్టీని గుర్తిస్తూనే ఐడియలిజాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటాను. 


ప్ర: నిబంధనలు, నియంత్రణలు ఈ రెంటికి ఉన్న ప్రయోజనాలను పరిమితం చేయవంటారా?


జ: తప్పకుండా సార్‌. అందుకే బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు వెళతానని చెబుతున్నాను. 


ప్ర: ‘ట్రియాజ్‌’ గురించి మాటల్లో మీరు ప్రస్తావించారు. అంటే ఏమిటి?


జ: రోగులకు చికిత్స అందించడం డాక్టర్ల విధి. అయితే ఏ రోగికి ప్రాధాన్యం లేదంటే ఎవర్ని మొదట చూస్తావు అన్న విచక్షణను ట్రియాజ్‌ అంటారు. 


ప్ర: ట్రియాజ్‌ను పక్కనపెట్టి ఒక ఐఏఎస్‌ అధికారి ప్రత్యేకించి ఒక పేషెంట్‌ను మొదట చూడమంటే, డాక్టర్‌గా మీరేమి చేస్తారు?


జ: ఐఏఎస్‌ చెప్పిన పేషెంట్‌ పరిస్థితిని మొదట తెలుసుకుంటాను. ఆ పేషెంట్‌కు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన పరిస్థితి లేదనుకుంటే మాత్రం మెడికల్‌ ఎథిక్స్‌ అంటే ట్రియాజ్‌ ప్రకారమే ముందుకు వెళతాను. 


ప్ర: ఆఫీసర్‌ తన అధికారం ఉపయోగించి, చూడాల్సిందే అంటే?


జ: సమర్ధుడైన అధికారి - అధికారానికి, విచక్షణకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుంటారు. వ్యక్తిగత ఆసక్తులతో వాటిని ఉపయోగించరు. అప్పటికీ చూడాల్సిందే అంటే, విలువలను అనుసరించి విచక్షణను ఉపయోగించి, రోగుల ప్రయోజనాలను కాపాడతాను.

 

ప్ర: ఆయుష్మాన్‌ భారత్‌ అంటే ఏమిటి?


జ: హెడబ్ల్యూసీ, ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ తదితరాలు కలగలిసి ఉంటాయి. ఇటీవలే లక్ష్యం రెండు కోట్లకు చేరింది. 


ప్ర: మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) మార్గదర్శకాలు ఇటీవల మారాయి. అవి మీకు తెలుసా


జ: ఎన్‌ఎంసీ యాక్ట్‌ గురించి వివరించాను.


ప్ర: ఆ చర్య మంచిదేనంటారా?


జ: మంచిదేనండి. పూర్తిగా అవినీతిమయం కావడంతో పాతదాన్ని రద్దుచేశారు. కొత్త చట్టం ప్రకారం మెడికల్‌ ఎడ్యుకేషన్‌లో సంబంధిత రంగాలకు చెందిన నిపుణులు తమ నైపుణ్యాన్ని తెలియజేసే అవకాశం ఉంటుంది. 


మూడో మెంబర్‌: మన కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌కు మీరిచ్చే రేట్‌ ఏమిటి?


జ: మొదటి వేవ్‌ సమయంలో మనకు సాధ్యమైనంతలో భాగానే చేశాం. రెండో వేవ్‌ సమయంలోనే పదికి అయిదు మార్కులు వచ్చాయి. మన ప్లానింగ్‌ మరింత క్రియాశీలంగా ఉంటే పదికి ఎనిమిది మార్కులు సాధించేవాళ్ళం. 


ప్ర : ఈ సంక్షోభంలో డాక్టర్‌ రాజేంద్ర భరూద్‌ ప్రశంసలు అందుకున్నారు. ఆయన గురించి నీకు తెలుసా?


జ: నందర్బార్‌ డీఎంగా ఆయన తన విచక్షణ, అధికారం, మెడికల్‌ పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించారో వివరించాను. కొవిడ్‌ ఎలా ప్రొటోకాల్స్‌ లేని రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌గా ఆయన గుర్తించారు. ఆక్సిజన్‌తో సింప్టామెటిక్‌ ట్రీట్‌మెంట్‌ ఒక్కటే పరిష్కారంగా ఆయన చెప్పారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ఆయన చేసిన కృషి వివరించారు. ఆయన యత్నం ఆ జిల్లాకే కాకుండా యావత్తు మహారాష్ట్రకు ఎలా ఉపయోగపడిందో తెలిపాను.


ప్ర: మూడో వేవ్‌ ఎప్పుడు వస్తుంది, ఏ మేరకు దెబ్బతీస్తుందన్నది శాస్త్రీయంగా మీరు చెప్పగలరా?


జ: దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా సి.1.2 వేరియంట్స్‌తో ఇబ్బంది పడుతున్నాయి. డెల్టా ప్లస్‌ దీనికి తోడైంది. ఒకటి రెండు నెలల్లో మూడో వేవ్‌ ఆరంభం కావచ్చు(ఇంటర్వ్యూ నాటి పరిస్థితులను బట్టి చెప్పిన సమాధానం ఇది). 


ప్ర: ఆరోగ్యపరంగా మౌలిక సదుపాయాలు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారంగా భావిస్తున్నారా?


జ: దానికితోడు వేరియంట్స్‌లో మార్పులు, వాటి ప్రమాద తీవ్రతను కూడా ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అవన్నీ మన సన్నద్ధతను తుత్తునియలు చేయవచ్చు. సాధ్యమైనంత దగ్గరకు ఊహించి, అందుకుతగ్గ విధంగా పనిచేసుకుంటూ వెళ్ళడమే సాపేక్షంగా మనం ఇక్కడ చేయదగిందని భావిస్తున్నారు. 


మూడో మెంబర్‌: మెడిసిన్‌ కోర్సులో భాగంగా పీడియాట్రిక్స్‌ను కూడా చదివి ఉంటారు. ఒక డాక్టర్‌గా ఈ బ్రాంచ్‌లో ఆరోగ్య సమస్యలు ఏమి ఉన్నాయంటారు?


జ: టెర్షియరీ కేర్‌(మూడో అంచె) హాస్పిటల్స్‌లో పీడియాట్రిక్‌ కేర్‌ ఉంటుంది. పుట్టుకతో సమస్యలను ముందస్తుగా గుర్తించగలిగితే నివారించవచ్చు. వీటి విషయంలో ప్రామాణిక నిబంధనలు అంటూ ఏమీ లేవు. మరొకటి పిల్లలకు సెక్స్‌ ఎడ్యుకేషన్‌. సెక్స్‌పరంగా మన పిల్లలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సరైన విద్య, విజ్ఞానం అందించడం ద్వారా మాత్రమే పిల్లలను మనం కాపాడుకోగలమని భావిస్తున్నారు. 


ప్ర: హెల్త్‌కేర్‌లో సిబ్బంది విషయంలో పాలసీపరంగా మీ సూచనలు ఏమిటి?


జ: ఒక డాక్టర్‌కు పది మంది ఆశా కార్యకర్తలను ఇవ్వగలిగితే ప్రివెంటివ్‌ హెల్త్‌ కేర్‌కు ఉపయోగపడుతుంది. (నా సమాధానంతో సంతృప్తి చెందలేదు)


ప్ర: డాక్టర్‌కు మారుగా ఆశా కార్యకర్త అంటే కుదరదు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇంకా ఏమైనా ఉందా?


జ: తెలంగాణ, చత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వాలు ఆయుష్‌ సిబ్బందితో వ్యవస్థను మెరుగుపర్చుకునే పనిలో ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఆయుష్‌ డాక్టర్లు అందుబాటులో కూడా ఉన్నారు. 


ప్ర: ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వారి సేవలను తీసుకుంటోందా?


జ: నా ఇంటర్న్‌షి్‌పపై ఈ సందర్భంలో మాట్లాడాను. ఆర్‌బీకే స్కీమ్‌ కింద పీహెచ్‌సీలు, స్కూల్స్‌లో పని చేస్తున్న ఆయుష్‌ డాక్టర్లతో నా ఇంటరాక్షన్‌ గురించి వివరించాను. 


నాలుగో మెంబర్‌: ఫాదర్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌... ఈ విభాగం ఎక్కడ నుంచి వచ్చింది?


జ: నాకు తెలియదు సార్‌


ప్ర:కొవిడ్‌ నివారణ కోసం మనం అవసరం లేని అనేక మందులు వాడాం. వీటిలో కొన్ని జంతువులపై ప్రయోగిస్తారు. ఇది మంచి పనే అంటారా?


జ: సైంటిఫిక్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ లేకుండా ఏ డ్రగ్‌నూ పేషెంట్లపై ఉపయోగించకూడదు. కొవిడ్‌ విషయంలోనూ మొదట్లో ఎటువంటి ప్రొటోకాల్‌ లేదు. అప్పటి వరకు ఉన్న ట్రయల్స్‌ను దృష్టిలో పెట్టుకుని చికిత్స అందించారు. ఆ క్రమంలో కొంత మంది డాక్టర్లు విప్లవాత్మకమైన మార్పులు కూడా తెచ్చారు. 


ప్ర:(పై సమాధానంతో సంతృప్తి చెందని మెంబర్‌) అసలు అలా డ్రగ్స్‌ ఉపయోగించడం ఎథికల్‌ అంటారా?


జ: ఈ సందర్భంలోనే బోర్డు చైర్మన్‌ జోక్యం చేసుకున్నారు. చర్చను కుదించే యత్నంలో భాగంగా నీవాదనకు కట్టుబడి ఉన్నావా అంటూ అడిగారు. ఎస్‌ సర్‌ అని చెప్పడంతో ఓకే శ్రీజ... నీ ఇంటర్వ్యూ పూర్తయిందని చెప్పి ముగించారు.  కొద్దిగా నెర్వ్‌సగా ఫీలైన నేను అందరికీ ధన్యవాదాలు తెలిపి నా ఫేస్‌ షీల్డ్‌ తీసుకుని బయటకు వచ్చాను.


(నా సన్నద్ధతకు తగ్గట్టుగానే ఇంటర్వ్యూ పూర్తి చేశాను. అయితే ఇంకొంచెం మెరుగ్గా చేసి ఉండవచ్చని కూడా అనుకున్నాను. ఇక్కడ చెప్పిన మాటల్లో కొద్దిపాటి తేడా ఉన్నప్పటికీ, నేను వ్యక్తం చేసిన భావాలు మాత్రం ఇంచుమించుగా ఇలాగే ఉంది.)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.