Civils లో 48వ ర్యాంకు సాధించిన మన తెలుగమ్మాయి మానస.. ఇంటర్వ్యూలో బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలివి..!

ABN , First Publish Date - 2021-10-09T15:25:59+05:30 IST

ఇటీవల విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో..

Civils లో 48వ ర్యాంకు సాధించిన మన తెలుగమ్మాయి మానస.. ఇంటర్వ్యూలో బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలివి..!

స్వస్థలం: మదనపల్లి టౌన్‌

చదువు: బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

తండ్రి: చెంగమ్మ నందకుమార్‌ (కొత్తపల్లి ఉపసర్పంచ్‌)

తల్లి: గోనుగుంట్ల భరణీ దేవి (వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఇంగ్లీష్‌ టీచర్‌)

చెల్లెలు: మనస్విని(బీబీఏ - సోనిపట్‌లోని అశోకా యూనివర్సిటీ నుంచి యంగ్‌ ఇండియా ఫెలోషి్‌పతో  లిబరల్‌ ఆర్ట్స్‌ చేస్తోంది.)  

ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్‌: ఎయిర్‌మార్షల్‌ అజిత్‌ బోంస్లే 


ఇటీవల విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో నల్లబోతుల చెంగమ సాయి మానస నంద 48వ ర్యాంకు సాధించారు. తాను ఇంటర్వ్యూ ఎదుర్కొన్న విధానాన్ని దిక్సూచితో పంచుకున్నారు. సివిల్స్‌ ఇంటర్వ్యూలు ఎలా జరుగుతాయి అనే విషయంలో అందరికీ ఆసక్తి ఉంటుంది. వారికి అవగాహన కలుగడమే కాకుండా, గ్రూప్‌ 1, బ్యాంక్‌ ప్రొబేషనరీ అధికారి, సివిల్స్‌కు సిద్ధమయ్యేవారికీ ఉపయోగపడుతుంది. 


చైర్మన్‌: ముందు ఆ మాస్క్‌, కళ్ళద్దాలు తీసేయండి. టిష్యూతో మొహం శుభ్రంగా తుడుచుకోండి. 

మానస: నేను రెడీ సార్‌


చైర్మన్‌: మీరు మా మాట వినటం లేదు. ముందు ఆ రెండూ తీసేయండి

లేడీ మెంబర్‌: అప్పుడే మేం అంతా మీ ఫేస్‌ చూడగలుగుతాం. 

మానస: ఒకే సర్‌


చైర్మన్‌: మీరు బయట కూర్చున్న దగ్గర రిఫ్రెష్‌మెంట్స్‌ పెట్టాం. తీసుకున్నారా?

మానస: కాఫీ తీసుకున్నాను సార్‌


ఛైర్మన్‌ మెంబర్లవైపు తిరిగి... ఈ పిల్లలు లంచ్‌ తీసుకోకుండా వస్తున్నారు. నిజానికి బలంగా ఆహారం తీసుకుని రావాలి. అందుకు బదులు బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుంటున్నారు.


లేడీ మెంబర్‌: అలా అయితే సాయంత్రం అయిదు గంటల వరకు ఎలా ఉండగలరు?

చైర్మన్‌: మీరు బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకున్నారా? 

మానస: లేదు సర్‌


చైర్మన్‌: లంచ్‌ అయిందా?

మానస: లేదు సర్‌. 


చైర్మన్‌: మీరు లంచ్‌ చేయాల్సింది. మేం లంచ్‌ను ఇక్కడ ఒంటి గంటకు ఏర్పాటు చేస్తున్నాం. లంచ్‌ తీసుకోకుంటే ఏమి జరుగుతుందో మీకు తెలుసా?

జ: కార్బొహైడ్రేట్స్‌ రిచ్‌ డైట్‌ తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్‌ లెవెల్స్‌  తగ్గుతాయి. తక్కువ స్థాయి కార్బొహైడ్రేట్స్‌ ఆహారంతో మన దేహం కీటోన్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. 


చైర్మన్‌: ఇది కొత్తగా ఉందే(బిగ్గరగా నవ్వారు). సో మీరు కార్బొహైడ్రేట్‌ డైట్‌ని ఫాలో అవుతున్నారన్న మాట.

జ: ట్రై చేస్తున్నా సర్‌


చైర్మన్‌: ఓకే. మనం ఇంటర్వ్యూని మొదలుపెడదాం. బ్రిలియంట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మీది. మీరు చదివిన రిషివ్యాలీ స్కూల్‌ చాలాకాలంగా తెలిసినదే. ఢిల్లీ ప్రభుత్వం విద్యలో సంస్కరణలు తీసుకురావాలని యత్నిస్తోంది. మీరు చదువుకున్న స్కూల్‌తో పోల్చి చెప్పండి.

జ: హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ - సర్వసమగ్ర అభివృద్ధి. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని మా స్కూలులో అనుసరిస్తారు. అక్కడ ఎడ్యుకేషన్‌ అంటే జ్ఞాన సముపార్జన ఎంతమాత్రం కాదు. కొన్ని లెర్నింగ్‌ స్కిల్స్‌... ముఖ్యంగా మన జీవితాలను తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడేవి నేర్పుతారు. మొత్తానికి హ్యాపీనెస్‌ కరిక్యులమ్‌ అన్నమాట. ఢిల్లీ స్కూల్స్‌ ఆ ఫిలాసఫీని ఫాలో కావచ్చు. (ఇంకా చాలా వివరంగా చెప్పాను. అయితే అదంతా గుర్తులేదు)


చైర్మన్‌: కొత్త విద్యావిధానంలో మూడు ‘సి’ ల గురించి ప్రస్తావించారు. అందులో కొలాబిరేషన్‌ అంటే ఏమిటి?

జ: నేను గెస్‌ చేయవచ్చా సార్‌?


చైర్మన్‌: ష్యూర్‌. ఇక్కడ మనం విషయాన్ని చర్చిస్తున్నాం.

జ: కొలాబిరేషన్‌ అంటే ఇక్కడ లెర్నింగ్‌ టీమ్‌లో భాగం. ఇతరులతో కలిసి పనిచేయడం, ఇతరుల నుంచి నేర్చుకోవడం కూడా. అదే హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ విషయానికి వస్తే, అకడమియాతో పార్టనర్‌షిప్స్‌ డెవలప్‌ చేసుకోవడం.


(చైర్మన్‌ మధ్యలో కలుగుజేసుకుని లేడీ మెంబర్‌వైపు తిరిగి ప్రశ్నించమన్నారు)

లేడీ మెంబర్‌: ప్రఖ్యాత విద్యా సంస్థలో చదవడం కారణంగానే మెయిన్స్‌ రాయగలిగాను అని అనుకుంటున్నారా?

జ: ఎస్‌ మేమ్‌. ఉదాహరణకు ఎగ్జామ్‌లో నా ఎస్సే అసంబద్ధమైన వివరణతో సాగుతోంది. సరిగ్గా అప్పుడే విషయాన్ని గుర్తించాను. సుదీర్ఘంగా సాగకుండా కట్‌ చేసి ముగించగలిగాను. ఈ నైపుణ్యాలకు నాంది అక్కడే నాకు పడింది. 


ప్ర: మన దేశం కంప్యూటర్‌ సైంటిస్టులు కావాలని అనుకుంటోంది. మీరు సివిల్స్‌ వైపు వచ్చారు. ఎందుకీ షిప్ట్‌.

జ: మేమ్‌... మీరు చెప్పింది నిజమే. నేను మాత్రం సివిల్‌ సర్వీసెస్‌ ఎంపిక చేసుకున్నాను. నా మార్గాన్ని మార్చుకున్నాను. నేను చదువుకున్న ఇంజనీరింగ్‌ కాలేజీలో మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ క్లబ్‌ ఉండేది. అలా అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ విధానంపై ఆసక్తి పెంచుకున్నాను. అలాగే కెరీర్‌పరంగా నాకు కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. ప్రపంచమంతా తిరిగి, కొత్త భాషలు నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ప్రజలపై నేరుగా ప్రభావం చూపేవాటిపై పని చేసి దేశానికి నా వంతు సేవలు అందించాలని అనుకుంటున్నాను. నేను చదువుకున్న కంప్యూటర్‌ సైన్సెస్‌ నా ఆకాంక్షలు నెరవేరేందుకు ఉపయోగపడుతుంది కూడా. సివిల్‌ సర్వీసెస్‌ మరీ ముఖ్యంగా ఐఎఫ్‌ఎస్‌ అందుకే ఎంచుకున్నాను. (ఇక్కడే మెంబర్‌ మరికొన్ని ప్రశ్నలు అడిగారు. అవన్నీ నాకు గుర్తులేవు)


రెండో లేడీ మెంబర్‌: మీరు ధరించిన దుపట్టా, ఏ సంప్రదాయానికి చెందినదో తెలుసా?

జ: మేమ్‌... సిల్క్‌ మిక్స్‌తో కూడిన కాటన్‌ ప్లస్‌ జరీ ఉంది. (నాకు తెలియదు అని నేరుగా చెప్పడానికి భయం వేసింది. నేరుగా అంగీకరించనందుకు నన్ను క్షమించాలి)


ప్ర: కేరళీయులు ధరించినట్టుగా అనిపించటం లేదూ?

జ: ఎస్‌ మేమ్‌(అదో స్టయిల్‌ అని మెంబర్‌ అనగానే నేను కృతజ్ఞతలు చెప్పాను)


ప్ర: ఎంయుఎన్‌లో మీరు భాగం అవుతున్నారన్నమాట. మన ఇరుగుపొరుగు దేశాల్లోని రాజకీయాలు మనపై ప్రభావం చూపుతాయి కదా?

జ: ఎస్‌ మేమ్‌(నేపాల్‌ గురించి మాట్లాడాను. ఇటీవలి లింపియదుర ఇష్యూ, అఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకోవడం వివరించాను. ఎస్సే తరహా ప్రశ్న కావడంతో మాటలు తడబడ్డాను కూడా)


ప్ర: ఇతర దేశాల మాటేమిటి?

జ: బంగ్లాదేశ్‌ - తీస్తా ఇష్యూ. అది పశ్చిమబెంగాల్‌లో రాజకీయమైంది కూడా(అక్కడో ఫ్రేజ్‌ వాడాను, గుర్తులేదు)


ప్ర: చైనా విషయం ఏమిటి?

జ: చైనా అధ్యక్షుడు... క్షమించాలి... కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా కార్యదర్శి ఈమధ్య టిబెట్‌ సందర్శించారు. టిబెటన్ల జనాభా అధికంగా ఉన్న మనపై అది ప్రభావం చూపుతుంది. ఢిల్లీలో టిబెటన్లు ప్రదర్శనలు జరిపారు. ఒకరకంగా అది మనకూ సెక్యూరిటీ ప్రాబ్లెమ్‌ కూడా (మొత్తమ్మీద నా జవాబు బాగాలేదు. నిజానికి చైనా దేశీయ రాజకీయాలపై మాట్లాడాల్సింది. ఎల్‌ఏసీ వద్ద చైనా దురాక్రమణ, శత్రుత్వంపై మాట్లాడితే బాగుండేది. అయితే అప్పటికి నా మైండ్‌లోకి వచ్చిన విషయాలను చెప్పేశాను)


ప్ర: మీరు చిత్తూరు కలెక్టర్‌ అయితే, మామిడి ఎగుమతులు అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తారా?

జ: మేమ్‌... ముందు ప్రొడక్షన్‌ పెంచడంపై దృష్టి సారిస్తాను. సంబంధిత రైతులు ఎదుర్కొంటున్న పెస్ట్‌ అటాక్స్‌ వంటి సమస్యలను మొదట పరిష్కరిస్తాను. ఆగ్రో ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ అంటే మ్యాంగో పల్ప్‌ వంటి పరిశ్రమలను ప్రోత్సహిస్తాను. ఎగుమతుల కోసం కామర్స్‌ మినిస్ట్రీ పరిధిలోని ఫారిన్‌ ట్రేడ్‌ ఆఫీ్‌సతో మాట్లాడతాను. 


ప్ర: అగ్రి ఎక్స్‌పోర్ట్‌ కోసం ఏదైనా ప్రత్యేక ఏజెన్సీ ఉందా?

జ: ఎస్‌ మేమ్‌, అపెడా(దాని ఫుల్‌ ఫామ్‌ను విస్తరించి చెప్పాను)


ప్ర: మ్యాంగో పల్ప్‌ గురించి మాట్లాడుతున్నారు. మ్యాంగోతో ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.... మీకు తెలుసా?

జ: పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. దాంతో రూపొందించిన పౌడర్‌ను కూరల్లో వేసుకోవచ్చు.(మెంబర్‌ మరింత సమాధానం కోరుకుంటున్నట్టు కనిపించారు) అలాగే మామిడి కర్ర కూడా ఉపయోగపడుతుంది. 


ప్ర: సీడ్‌ మాటేమిటి?

జ: పౌడర్‌ చేసుకుని కూరల్లో వాడుకోవచ్చు.


ప్ర: పీల్‌ సంగతి?

జ: (తెలియదు సర్‌ అని చెప్పాను. అయితే మెంబర్‌ సరే అన్నట్టు తల ఆడించారు)


ప్ర: గతంలో తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ను తీసుకునేవారు. ఇప్పుడు ఎందుకు ఆ సబ్జెక్టు తీసుకోవటం లేదంటారు?

(నా ఆప్షనల్‌ సబ్జెక్టు పొలిటికల్‌ సైన్స్‌. దానిని దృష్టిలో పెట్టుకుని అడిగి ఉంటారు.)

జ: ఇంతకు మునుపు ఉద్యోగం అంటే ప్రభుత్వం ఇచ్చేవే. గ్లోబలైజేషన్‌తో వేర్వేరు ఉపాధులు లభిస్తున్నాయి. దాంతో యువత భిన్నమైన సబ్జెక్టులవైపు ఆకర్షితులవుతున్నారు. 


ప్ర: ఇన్‌స్పయిర్‌ స్కాలర్‌షిప్‌ ఏమిటి?

జ: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దీన్ని సైన్స్‌లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టింది.


ప్ర: చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా ఉంటే ఆ జిల్లాను ఎలా అభివృద్ధిపరుస్తావు?

జ: అగ్రికల్చర్‌ ముఖ్యంగా మ్యాంగో, టమాట(ఎండాకాలంలోనూ టమాటాను పండించే జిల్లాగా దేశంలోనే చిత్తూరుకు పేరుంది.) మాన్యుఫాక్చరింగ్‌ శ్రీసిటి - తూర్పు ఆసియా దేశాలతో ఇందుకోసం సంబంధాలు పెట్టుకునేలా కృషి చేస్తా.


ప్ర: చిత్తూరు జిల్లాలో చెరుకు కూడా ఎక్కువే అనుకుంటా?

జ: ఎస్‌. అయితే ఎక్కడ అన్నది ప్రత్యేకించి నాకు తెలియదండి.


ప్ర: సైన్స్‌ను ఎందుకు ఆప్షనల్‌ సబ్జెక్టుగా తీసుకోలేదు. 

జ: కంప్యూటర్‌ సైన్స్‌ ఆప్షనల్‌గా లేదండి. (మెంబర్‌ జోక్యం చేసుకుని మేథ్స్‌ అలాగే మరికొన్ని సైన్స్‌ సబ్జెక్టులు ఆప్షనల్స్‌గా ఉన్నాయి కదా అన్నారు)

పూర్తిగా ఒక కొత్త సబ్జెక్టును చదువుకునే అవకాశాన్ని యూపీఎస్సీ నాకు ఇచ్చింది. ఏడాదో, ఏడాదిన్నరో టైమ్‌లో పొలిటికల్‌ సైన్స్‌ నాకు తగింది అనిపించింది. పైపెచ్చు ఇండియన్‌ ఫారిన్‌ సర్వీ్‌సలో చేరాలన్న ఆకాంక్షకు ఇది సరిపోయింది. ఒకరకంగా ఇది నా నేచురల్‌ ఆప్షన్‌. (అచ్చంగా ఇలాగే కాకున్నప్పటికీ నా అభిప్రాయాన్ని బలంగా చెప్పాను. మొదటి మెంబర్‌ నవ్వుతూ తలూపారు. బోర్డు ఛైర్మన్‌ తన చాంబర్‌లోకి పక్కకి వెళ్ళగా, నా సమాధానం మధ్యలోనే మూడో మెంబర్‌ మరో ప్రశ్న అడిగారు)


ప్ర: మన దేశాన్ని చైనా చుట్టుముడుతోందని మీరు భావిస్తున్నారా?

జ: ఎవరైనా అదే అంటారండి. స్ట్రింగ్‌ ఆఫ్‌ పెరల్స్‌ థియరీ వివరించాను.


ప్ర: అవేంటో పేర్లు చెప్పండి?

జ: పాకిస్థాన్‌లోని గ్వదర్‌ పోర్టు సీపీఈసీలో పార్ట్‌. శ్రీలంకలోని హంబంటోట పోర్ట్‌, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ పోర్ట్‌ - ప్రస్తుత పరిణామాలు మాత్రం నాకు తెలియవు(నాలుగో మెంబర్‌ చిట్టగాంగ్‌ కరెక్ట్‌ అన్నారు.) కంబోడియాలోని సిహనౌకవిల్లె, బేస్‌ డ్జిబౌటి.


ప్ర: ఇందుకు ప్రతిగా ఇండియా ఏమి చేస్తోంది?

జ: ఇండో పసిఫిక్‌... క్వాడ్‌.... హిందూ మహాసమద్రం దీవుల్లోని దేశాలతో భారత సంబంధాలను వివరించాను(బేసిక్‌ ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో చాలా వేగంగా మాట్లాడాను)


ప్ర: ఆర్థిక, రాజకీయ కోణాలను వివరిస్తారా?

జ: ఆర్థిక కోణంలో ఆలోచిస్తే, ఈ రీజియన్‌లోని దేశాల అభివృద్ధికి ఇండియా చేయూతనందిస్తోంది. ఉదాహరణకు మాల్దీవులకు 400 మిలియన్‌ డాలర్ల మేరకు రుణాన్ని అందించింది. రాజకీయంగా చూసుకుంటే, అంతర్జాతీయ స్థాయిలో చైనాతో సంబంధాలు సాఫీగా ఉండేలా, బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఉన్నాం. ఉదాహరణకు మన ప్రధాని యుఎన్‌ఎస్‌సి మారిటైమ్‌ సెక్యూరిటీపై మాట్లాడారు. సముద్రంలో ఏ దేశానికి చెందని జలాల విషయంలో స్వేచ్ఛపై మాట్లాడారు. చైనా పేరు నేరుగా చెప్పనప్పటికీ పరోక్షంగా ప్రస్తావించారు.


మెంబర్‌: యాక్ట్‌ ఈస్ట్‌ మాటేమిటి?

జ: తూర్పు ఆసియన్‌ దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా సహా ఇతర ఆసియా దేశాలతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు మనం కృషిచేస్తున్నాం. 


చైర్మన్‌: మీ ఇంటర్వ్యూ పూర్తయింది. వెళ్ళే ముందు ఈ కోట్‌కు అర్థం చెప్పండి. ‘సంతోషం ఒక్కటే జీవితానికి సరిపోదు. జీవితానికి అర్థం కూడా ఉండాలనే భావనతో కోట్‌ చెప్పారు. 

జ: (వివరించేందుకు కొన్ని నిమిషాల సేపు సమయం తీసుకున్నాను. ఆ కోట్‌ అన్ని వేళలా నిజం కాకపోవచ్చు. అందుకని) ఈ విషయంలో నాకు మిక్స్‌డ్‌ ఓపీనియన్‌ ఉంది సార్‌.


చైర్మన్‌: నో. అలా కాదు, మిమ్మల్ని దానిని వివరించండి అని అడుగుతున్నా.

జ: కొద్దిగా వివరించాను. వివరణ బాగుంది అన్నారు. ఇవాళ మీ ప్లాన్‌ ఏమిటి? ఎక్కడ ఉంటున్నారు అని ప్రశ్నించారు. సమాధానం పూర్తయ్యాక థాంక్స్‌ అని చెప్పి ఇక వెళ్ళిపోవచ్చన్నారు. అందరికీ ధన్యవాదాలు చెప్పి బైటకు వచ్చాను. 

(కొన్ని చోట్ల సమాధానాలు చెప్పే సమయంలో కొంత తడబాటుకు, ఆందోళనలకు గురయ్యాను. కొన్ని సందర్భాల్లో సెంటెన్స్‌ ఫ్రేజింగ్‌ విషయంలో కూడా ఇబ్బంది పడ్డాను. అయితే బోర్డు సభ్యులు వాటిని  ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం అభ్యర్థికి సబ్జెక్టుపై ఎంత పట్టు ఉందనే  విషయాన్నే చూశారు.)

Updated Date - 2021-10-09T15:25:59+05:30 IST