సివిల్స్‌ ఫేక్‌ ర్యాంకర్‌..!

ABN , First Publish Date - 2020-09-27T09:09:47+05:30 IST

ఇదో సివిల్స్‌ ఫేక్‌ ర్యాంకర్‌ కథ! యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ పరీక్ష రాయడు.

సివిల్స్‌ ఫేక్‌ ర్యాంకర్‌..!

 పరీక్ష రాయడు.. ర్యాంకు వచ్చిందంటాడు

తన పేరును పోలినవారుంటే హంగామానే

ఆ దెబ్బకు ప్రముఖులతో పరిచయాలు

వారు అభినందించిన ఫొటోలతో పోస్టులు

నిజామాబాద్‌ కలెక్టర్‌కు విద్యార్థుల ఫిర్యాదు


హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఇదో సివిల్స్‌ ఫేక్‌ ర్యాంకర్‌ కథ! యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ పరీక్ష రాయడు. కానీ, ఫలితాల్లో తన పేరును పోలిన వారుంటే.. ఆ ర్యాంకు తనదేనంటూ హంగామా చేస్తాడు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సచిన్‌ మగ్గిడి అనే యువకుడి తీరిది. 2019లో విడుదల చేసిన ఫలితాల్లో.. సచిన్‌ కుమార్‌ అనే వ్యక్తి 669 ర్యాంకు సాధించాడు. అది తనదేనంటూ సచిన్‌ మగ్గిడి అందరినీ నమ్మించాడు. ఢిల్లీలో యూపీఎస్సీ కార్యాలయం వద్ద ఫొటోలు దిగి.. ఇంటర్వ్యూకు హాజరయ్యానంటూ హంగామా చేశాడు. ఆ దెబ్బకు ప్రముఖులతో పరిచయాలు చేసుకున్నాడు. వారు అభినందనలు తెలుపుతున్నప్పుడు దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పెట్టాడు. ‘‘ఎంతో కష్టపడి చదివి.. ర్యాంకు సాధించాను’’ అంటూ చెప్పుకొన్నాడు. ‘‘శిక్షణకు ఎందుకు వెళ్లలేదు?’’ అని స్నేహితులు అడిగితే.. ‘‘ఐఆర్‌టీఎస్‌ వచ్చింది. నాకు ఐఏఎస్‌ మాత్రమే ఆసక్తి. అందుకే మరింత కష్టపడి చదువుకుంటున్నా’’ అని నమ్మబలికేవాడు.


ఈ ఏడాది ఏప్రిల్‌లో సివిల్స్‌ ఫలితాలు విడుదలైనప్పుడు కూడా అదే స్థాయిలో హంగామా చేశాడు. సచిన్‌ కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తి 296వ ర్యాంకు సాధిస్తే.. అది తనదేనంటూ ప్రచారం మొదలుపెట్టాడు. అక్కడే అడ్డంగా దొరికిపోయాడు. గత ఫలితాల్లో ర్యాంకు సాధించిన సచిన్‌కుమార్‌... సచిన్‌ మగ్గిడి పేర్ల మధ్య దాదాపు పోలిక ఉంది. ఈ సారి 296వ ర్యాంకర్‌ సచిన్‌ కుమార్‌ యాదవ్‌.. పేరుతో సచిన్‌ మగ్గిడి పేరుకు పోలికే లేదు. సచిన్‌ మగ్గిడి షెడ్యూల్‌ కులానికి చెందిన వ్యక్తి. సచిన్‌ కుమార్‌ యాదవ్‌ ఓబీసీ. దీంతో సచిన్‌ మగ్గిడి అసలు విషయం బయటపడింది. పైగా.. సచిన్‌కుమార్‌, సచిన్‌కుమార్‌ యాదవ్‌ల మాక్‌ ఇంటర్వ్యూ వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయి. వాటిని పరిశీలించిన వారు.. సచిన్‌ మగ్గిడి ‘ఫేక్‌ ర్యాంకర్‌’ అని గుర్తించారు. దీంతో.. కొందరు విద్యార్థులు నిజామాబాద్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వారిలో సచిన్‌ మగ్గిడి సహ విద్యార్థులు కూడా ఉన్నారు.

Updated Date - 2020-09-27T09:09:47+05:30 IST