Abn logo
Sep 25 2021 @ 04:38AM

సివిల్స్‌లో తెలుగు తేజం

32, 48, 75 ర్యాంకులతో ఏపీ యువత సత్తా.. 170, 211 ర్యాంకులు కూడా 

సోదరులకు ఐఏఎస్‌, ఐపీఎ్‌స.. బిహార్‌కు చెందిన శుభం కుమార్‌కు ఫస్ట్‌ ర్యాంక్‌ 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

‘సివిల్స్‌’లో మనోళ్లు మరోసారి సత్తా చాటారు. వందలోపు మూడు ర్యాంకులు సాధించారు. సివిల్స్‌-2020 ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వీరిలో 216 మంది మహిళా అభ్యర్థులు అత్యున్నత ‘సర్వీసు’లు సాధించారు. ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 30 మంది మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాళ్లపల్లి జగత్‌సాయి (32), సాయి మానస (48), దేవగుడి మౌనిక (75)... వందలోపు ర్యాంకులు సాధించారు. ఇంకా... తెలుగు రాష్ట్రాలకు చెందిన చల్లపల్లి యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి (93), బి.చంద్రకాంత్‌ రెడ్డి (120), లక్ష్మీ సౌజన్య (127), రాళ్లపల్లి వసంత్‌కుమార్‌ (170), గొబ్బిళ్ల విద్యాధరి (211), అనిరుధ్‌ ఆర్‌ గంగవరం (252), పి.గౌతమి (317), కె.సౌమిత్‌రాజ్‌ (355), చిలుముల రజనీకాంత్‌ (364), శేషాద్రిని రెడ్డి (401), జి.తిరపతిరావు (441), ఎస్‌.ప్రశాంత్‌ (498), పృథ్వీరాజ్‌ (541), ఎ.అభిషేక్‌ (616), కోట కిరణ్‌కుమార్‌ (652),  దోనేపూడి విజయకుమార్‌ (682), ఇ.వేగిని (686), కె.శ్రీకాంత్‌ రెడ్డి (747) తదితరులు సివిల్‌ సర్వీసులను సాధించారు. జాతీయ స్థాయిలో టాప్‌ 25 ర్యాంకుల్లో 13 మంది అబ్బాయిలు, 12 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరంతా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, బిట్స్‌, జిప్‌మర్‌, ఢిల్లీ వర్సిటీ, ముంబై వర్సిటీ తదితర ప్రముఖ సంస్థల్లో ఇంజనీరింగ్‌, హ్యుమానిటీస్‌, కామర్స్‌, మెడికల్‌ సైన్సెస్‌ చదివిన వారే విశేషం. వీరు సివిల్స్‌కు ఆంత్రోపాలజీ, సివిల్‌ ఇంజనీరింగ్‌, కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ, ఎకనామిక్స్‌, జాగ్రఫీ, మ్యాథ్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెడికల్‌ సైన్సెస్‌, ఫిలాసఫీ, ఫిజిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ సబ్జెక్టులను ఎంచుకున్నారు. 


10 లక్షల దరఖాస్తులు... 761 మంది ఎంపిక

మొత్తం 761 మంది అభ్యర్థులు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారు. జనరల్‌ కేటగిరీ నుంచి 263 మంది, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ నుంచి 86, ఓబీసీల నుంచి 229, ఎస్సీల నుంచి 122, ఎస్టీల నుంచి 61 మంది చొప్పున వివిధ పోస్టులకు ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. మరో 150 మంది అభ్యర్థులను రిజర్వు లిస్టులో పెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం మొత్తం 836 ఖాళీలను ప్రకటించగా, 761 మందిని మాత్రమే యూపీఎస్సీ ఆయా సర్వీసులకు చేసింది. జనరల్‌ కేటగిరీలో 75 పోస్టులు భర్తీ కాలేదు. మిగతా అన్ని కేటగిరీల్లో కేంద్రం ప్రకటించిన ఖాళీల మేరకు అభ్యర్థులు ఎంపికయ్యారు. అభ్యర్థుల మార్కుల వివరాలను 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్టు యూపీఎస్సీ ప్రకటించింది. 2020 అక్టోబరు 4 ప్రిలిమినరీ, 2021 జనవరిలో మెయిన్‌ పరీక్షలు జరిగాయి. ప్రిలిమ్స్‌కు 10 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... 4,82,770 మంది పరీక్ష రాశారు. వీరిలో 10,564 మంది మెయిన్‌ పరీక్షలు రాశారు. వీరిలో నుంచి 2,053 మంది పర్సనాలిటీ టెస్టుకు అర్హత సాధించగా, ఫైనల్‌గా 761 మంది సర్వీసులకు ఎంపికయ్యారు.


కోచింగ్‌ లేకుండానే సాధించాను

కడప నగరం మోడమీదపల్లికి చెందిన దేవగుడి మౌనిక సివిల్స్‌లో 75వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి దేవగుడి మధుసూధన్‌రెడ్డి ప్రైవేటు సంస్థలో ఇంజనీరుగా పనిచేసి రిటైరయ్యారు. తల్లి హేమలత ప్రైవేటు విద్యాసంస్థలో టీచరుగా చేస్తున్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మౌనిక ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నారు. తర్వాత కాన్పూర్‌ ఐఐటీలో ఇంజనీరింగ్‌, అమెరికాలో ఎంఎస్‌ చేశారు. సివిల్స్‌లో విజయం సాధించడంపై మౌనిక స్పందిస్తూ... ‘‘ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. సాధించాలన్న తపన ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. చిన్నప్పటి నుంచి సివిల్స్‌ సాధించాలన్నది నా కోరిక. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి ర్యాంకు సాధించాను. నేను ఏది చేయాలనుకున్నా దానికి తల్లిదండ్రులు ఎటువంటి ఆంక్షలు విధించలేదు. వారి ఆశయాలకు అనుగుణంగా లక్ష్యాన్ని సాధించగలిగాను’’ అన్నారు.

- దేవగుడి మౌనిక, 75వ ర్యాంకు


ఐఎఫ్‌ఎస్‌ కావాలనుకుంటున్నా...

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఎన్‌.సాయిమానస రెండో ప్రయత్నంలో సివిల్స్‌లో 48వ ర్యాంకు సాధించారు. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌ (ఐఎ్‌ఫఎస్‌) ద్వారా దేశానికి తనవంతు సేవ చేయాలని భావిస్తున్నట్టు సాయిమానస తెలిపారు. మదనపల్లె పట్టణం కమ్మగడ్డవీధికి చెందిన ఎన్‌.నందకుమార్‌, భరణీదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయిమానస. నాలుగో తరగతి నుంచి ఇంటర్‌ వరకు మదనపల్లె సమీపంలోని రిషీ వ్యాలీలో చదువుకున్నారు. తర్వాత బెంగళూరులోని పీఈఎస్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్సులో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టు కోసం ఢిల్లీలో ఐదు నెలలు కోచింగ్‌ తీసుకున్నారు. సాయి మానస తండ్రి నందకుమార్‌ ప్రస్తుతం మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ ఉపసర్పంచ్‌. ఆమె మేనత్త రాటకొండ శోభ మదనపల్లె ఎమ్మెల్యేగా పనిచేశారు.

- సాయి మానస, 48వ ర్యాంకు


మావయ్య ప్రోత్సాహంతోనే...

మాది విశాఖపట్టణం. నాన్నగారు వెంకట్రావు స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగి. అమ్మ పద్మావతి గృహిణి.  అన్నయ్య బైజూ్‌సలో పనిచేస్తున్నారు. నిట్‌ వరంగల్‌ నుంచి బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేశాను. తర్వాత మూడేళ్లు ఒరాకిల్‌లో పనిచేశాను. కేబుల్‌ ఆపరేటరుగా చేస్తున్న మా మావయ్య నన్ను సివిల్స్‌ వైపు ప్రోత్సహించారు. సివిల్స్‌ రాసి విజయం సాధిస్తే ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని చెప్పేవారు. నాకూ సేవాభిలాష ఎక్కువ. దాంతో జాబ్‌ మానేసి ఢిల్లీ, బెంగళూరులో సివిల్స్‌కు కోచింగ్‌ తీసుకున్నాను. జాగ్రఫీ నా ఆప్షనల్‌ సబ్జెక్టు. మూడో ప్రయత్నంలో ర్యాంకు సాధించాను.

- ఎంవిఎన్‌వి లక్ష్మీ సౌజన్య, 127వ ర్యాంకు


మూడో ప్రయత్నంలో ర్యాంకు

కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె పంచాయతీ గొల్లపల్లెకుచెందిన గొబ్బిళ్ల విద్యాధరికి సివిల్స్‌లో 211వ ర్యాంకు లభించింది. తల్లిదండ్రులు సుజాతమ్మ, సుబ్బరామయ్య నందలూరులో స్కూలు నిర్వహిస్తున్నారు. విద్యాధరి టెన్త్‌ వరకు అందులోనే చదువుకున్నారు. తర్వాత ఇడుపులపాయలోని ట్రిపుల్‌ ఐటీలో ఇంజనీరింగ్‌ చదివారు. చెన్నైలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నారు. మూడో ప్రయత్నంలో ర్యాంకు సాధించారు.

- గొబ్బిళ్ల విద్యాధరి, 211వ ర్యాంకు


సోదరుల విజయం...

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన సోదరులు జగత్‌ సాయి (32వ ర్యాంకు), వసంత్‌కుమార్‌ (170వ ర్యాంకు) ఒకేసారి సివిల్స్‌కు ఎంపికయ్యారు. వారి తండ్రి రాళ్లపల్లి భీమేశ్వరరావు ఎలక్ట్రికల్‌ ఏఈ (ఏలూరు నార్త్‌)గా పనిచేస్తున్నారు. జగత్‌సాయి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివి సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. వసంత్‌కుమార్‌ కూడా అన్నతోపాటే సిద్ధమయ్యారు. ఇద్దరూ ఒకేసారి కేంద్ర సర్వీసులకు ఎంపికవడంతో వారి కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఇద్దరూ కష్టపడి చదివి లక్ష్యం సాధించారని వారి తండ్రి భీమేశ్వరరావు, తల్లి జ్ఞాన అనసూయ అన్నారు. జగత్‌సాయి మూడో ప్రయత్నంలో, వసంత్‌కుమార్‌ తొలి ప్రయత్నంలో సివిల్స్‌ సాఽధించారు. 


ఒత్తిడికి లోనవకుండా ప్రిపేరయ్యాను

ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆడుతూ పాడుతూ సివిల్స్‌ పరీక్షలకు ప్రిపేరయినట్టు వరంగల్‌కు చెందిన పి. శ్రీజ చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చిలుకానగర్‌లో ఉంటున్నారు. మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ అయిన శ్రీజ మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించారు. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షల్లో సమాధానాలు బాగా రాశానని తెలిపారు. ఇంటర్వ్యూలో ఎలాంటి తడబాటు లేకుండా, ఒత్తిడికి గురికాకుండా జవాబులు చెప్పానని వివరించారు. శ్రీజ తల్లి లత రఘునాథపల్లె పీహెచ్‌సీలో నర్సుగా పనిచేస్తున్నారు. తండ్రి శ్రీనివాస్‌ హోండా షోరూమ్‌లో సీనియర్‌ సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం సివిల్స్‌లో విజయానికి తనకు ఎంతో దోహదపడిందన్నారు. సినిమాలు చూశానని, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ పలు విషయాలపై అవగాహన పెంచుకున్నానని తెలిపారు.

- పి.శ్రీజ, 20వ ర్యాంకర్‌



జాతీయ స్థాయిలో వీరే టాప్‌

బాంబే ఐఐటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివిన బిహార్‌ కుర్రోడు శుభం కుమార్‌ జాతీయ స్థాయిలో టాప్‌ ర్యాంకర్‌గా నిలిచారు. భోపాల్‌లోని ఎన్‌ఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన జాగృతి అవస్థీ రెండో ర్యాంకు సాధించారు.  ఆమె అమ్మాయిల కేటగిరీలో టాప్‌ ర్యాంకర్‌గా నిలిచారు. ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదివిన అంకితా జైన్‌కు మూడో ర్యాంకు లభించింది. సివిల్స్‌ 2016లో టాపర్‌గా నిలిచిన టీనా డాబీ చెల్లెలు రియా డాబీ తాజా ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించడం విశేషం.