తూకాల్లో తేడాపై విచారణ

ABN , First Publish Date - 2021-02-27T05:05:25+05:30 IST

కోవెలకుంట్ల సివిల్‌ సప్లయ్‌ గోదాము నుంచి డీలర్లకు వెళ్లే రేషన్‌ సరుకుల తూకాల్లో తేడాలు వస్తుండడంతో తహసీల్దారు పుష్పకుమారి శుక్రవారం సివిల్‌ సప్లయ్‌ గోదామును తనిఖీ చేశారు.

తూకాల్లో తేడాపై విచారణ

కోవెలకుంట్ల, ఫిబ్రవరి 26: కోవెలకుంట్ల సివిల్‌ సప్లయ్‌ గోదాము నుంచి డీలర్లకు వెళ్లే రేషన్‌ సరుకుల తూకాల్లో తేడాలు వస్తుండడంతో తహసీల్దారు పుష్పకుమారి శుక్రవారం సివిల్‌ సప్లయ్‌ గోదామును తనిఖీ చేశారు. రేషన్‌ సరుకులు తీసుకెళ్లే డీలర్ల నుంచి తహసీల్దారుకు ఫిర్యాదులు వచ్చాయి. రేవనూరు గ్రామానికి చెందిన 18వ రేషన్‌ దుకాణానికి చెందిన డీలరు గత నెలలో తీసుకున్న సరుకుల్లో భారీగా తేడాలు వచ్చాయి. కందిబేడలు, రేషన్‌ బియ్యంలో తూకాలు తక్కువగా వచ్చినట్లు గుర్తించి ఈ విషయంపై తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. కందిబేడలు, బియ్యంలో తూకాల్లో తక్కువగా ఉన్నాయని సంబంధిత డీలరు ఆర్‌ఐని నిలదీశాడు. గత నెలలో తీసుకున్న సరుకులు తక్కువ వచ్చాయంటే తీనేమి చేయాలని అనడంతో డీలరు తహసీల్దారుకు ఫిర్యాదు చేశాడు. తహసీల్దారు పుష్పకుమారి, డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖర్‌ కలిసి సివిల్‌ సప్లయ్‌ గోదామును తనిఖీ చేశారు. డీలర్ల సమక్షంలోనే పక్కాగా తూకాలు వేసి సరుకులను పంపిణీ చేయాలని తహసీల్దార్‌ ఆర్‌ఐని ఆదేశించారు. మొత్తం మీద సివిల్‌ సప్లయ్‌ గోదాములో ఈ-పాస్‌ యంత్రాల ద్వారా డీలర్లకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా ఆర్‌ఐ ఇష్టానుసారంగా సరుకులు ఇస్తున్నట్లు డీలర్ల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీలర్లకు సరుకులు తూకాల్లో తక్కువగా ఇస్తున్నట్లు పలువురు డీలర్లు ఆరోపిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుగా బియ్యం, కందిబేడలు పంపిణీ చేయాలని ఆర్‌ఐని తహసీల్దారు ఆదేశించారు. ఆర్‌ఐ సంబంధిత డీలరుకు కావాల్సిన కందిబేడలను పంపిణీ చేశారు. దీంతో సమస్య సద్దుమనిగింది.   

Updated Date - 2021-02-27T05:05:25+05:30 IST