తెలంగాణ ఆవిర్భావం నుండి 5.6 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

ABN , First Publish Date - 2021-11-26T20:26:48+05:30 IST

కొత్త రాష్ట్రమైన తెలంగాణ అనతికాలంలోనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో అద్భుతమైన ప్రగతిని సాధించిందని కేవలం ఏడు సంవత్సరాల్లో 88 వేల కోట్ల రూపాయలు విలువ చేసే 5కోట్ల 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావం నుండి 5.6 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

హైదరాబాద్: కొత్త రాష్ట్రమైన తెలంగాణ అనతికాలంలోనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో అద్భుతమైన ప్రగతిని సాధించిందని కేవలం ఏడు సంవత్సరాల్లో 88 వేల కోట్ల రూపాయలు విలువ చేసే 5కోట్ల 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ అఖండ విజయం ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. దేశంలో ఈ విధంగా ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఘనత, గొప్పతనం కేసిఆర్ గారికే చెందుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ధాన్యం కొనుగోళ్లు ఆర్థికంగా భారం కావడంతో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆయా రాష్ట్రాల్లో పండిన ధాన్యాన్ని పూర్తిస్థాయి కొనుగోలుకు ముందుకు రాని నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఆర్థికభారమైన కూడా భరించి రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ ఏడాది 2014 - 15 లో 24,29 లక్షల మెట్రిక్ టన్నులు, 2015 - 16లో 23.56 లక్షల మెట్రిక్ టన్నులు, 2016 - 17లో 35.70 లక్షల మెట్రిక్ టన్నులు, 2017 - 18లో 53.99 లక్షల మెట్రిక్ టన్నులు, 2018 - 19 లో 77.46 లక్షల మెట్రిక్ టన్నులు, 2019 - 20లో కోటి 11 లక్షలు, 2020 -21 లో కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఈ ఏడాది వానాకాలంలో ఇప్పటి వరకు 5,703 కొనుగోలు కేంద్రాల ద్వారా 19 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. 


అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 5.20 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లాలో 2.86 లక్షల మెట్రిక్ టన్నులు, కరీంనగర్ జిల్లాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో దాదాపు 70 నుంచి 90 శాతం వరకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు రైతుల నుంచి కనీస మద్దతు ధరకు 5.06 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ధాన్యం కొనుగోళ్లకు గతంలో లేని నిబంధనలు పెట్టి గడిచిన ఏడాదికాలంగా అనేక ఇబ్బందులకు కేంద్రం గురిచేస్తోంది. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు పెరుగుతుంటే మరోవైపు కొత్త కొత్త నిబంధనలతో ఆంక్షలను విధించడం వల్ల రైతాంగానికి భవిష్యత్తులో పెనుసవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-11-26T20:26:48+05:30 IST