విమానంలో సీట్లంటే రైల్లో బెర్త్‌లు అనుకోవద్దు:పౌర విమానయాన శాఖ

ABN , First Publish Date - 2020-02-22T23:31:12+05:30 IST

విమానం ప్రయాణం సందర్భంగా పాటించవలసిన కనీస మర్యాదలపై పౌర విమానయాన శాఖ ఓ ట్వీట్ చేసింది.

విమానంలో సీట్లంటే రైల్లో బెర్త్‌లు అనుకోవద్దు:పౌర విమానయాన శాఖ

న్యూఢిల్లీ: ఇటీవల.. విమానంలో ఓ మహిళ వెనుక సీట్లో కూర్చుని ఆమె సీటుపై దరువు వేసిన వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇంకా ప్రజలు స్మృతిపథం నుంచి తొలగిపోలేదు. అయితే.. విమానం ప్రయాణం సందర్భంగా పాటించవలసిన కనీస మర్యాదలపై పౌర విమానయాన శాఖ ఓ ట్వీట్ చేసింది. సరదా పుట్టిస్తున్న ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ‘ప్రయాణం సందర్భంగా తొటి ప్రయాణికుల పట్ల కనీస మర్యాదలు పాటించడమనేది ఎప్పటికీ ప్రశంసార్హమైనదే. విమానంలోని సీట్లంటే రైల్లో బెర్తులు అనుకోవద్దు. తోటి ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా చూసుకోండి’ అని ట్వీట్ చేసింది. 

కాగా.. మహిళ వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి ఆమె సీటుపై దరువేయడం పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు మహిళనే తప్పుబట్టారు. విమానం సీటును అంతలా వెనక్కి వాల్చుకుంటే వెనక ఉన్న వారికి ఇబ్బంది కాదా అంటూ ఆమెను ప్రశ్నించారు. దరువేసిన వ్యక్తిపై కూడా అప్పట్లో ఘాటు వ్యాఖ్యలే చేశారు.



Updated Date - 2020-02-22T23:31:12+05:30 IST