debit-credit కార్డు మోసాల్లో నగరం టాప్‌

ABN , First Publish Date - 2022-08-29T14:25:41+05:30 IST

రెండేళ్ల కాలంలో హైదరాబాద్‌ నగరంలో నేరాలు గణనీయంగా పెరిగాయి. 2019లో నగరంలో మొత్తం (ఐపీసీ, ఎస్‌ఎల్‌ఎల్‌ కలిపి) 18,051 నేరాలు నమోదు కాగా

debit-credit కార్డు మోసాల్లో నగరం టాప్‌

 ఇరువర్గాల ఘర్షణలకు ఆస్కారంలోనూ ప్రథమం

 మొత్తం నేరాల్లో 11వ స్థానం 

గణాంకాలు వెల్లడించిన ఎన్‌సీఆర్‌బీ 


హైదరాబాద్‌ సిటీ: రెండేళ్ల కాలంలో హైదరాబాద్‌ నగరంలో నేరాలు గణనీయంగా పెరిగాయి. 2019లో నగరంలో మొత్తం (ఐపీసీ, ఎస్‌ఎల్‌ఎల్‌ కలిపి) 18,051 నేరాలు నమోదు కాగా 2020లో ఇంచుమించు అదే స్థాయిలో 18,055 నమోదయ్యాయి. కానీ 2021లో ఏకంగా 10శాతానికి మించి 20,142 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 19మెట్రో పాలిటిన్‌ నగరాల నేరాల సంఖ్యతో పోలిస్తే హైదరాబాద్‌ 11వ స్థానంలో నిలిచింది. అత్యధిక నేరాలతో ఢిల్లీ ప్రథమస్థానంలో ఉంది. 2021 ఏడాదికి గాను జాతీయ నేర గణాంక సంస్థ (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో) తాజా గణాంకాలను ఆదివారం వెల్లడించింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తడానికి ఆస్కారం కలిగించే కేసుల్లో హైదరాబాద్‌ (28కేసులతో) టాప్‌లో నిలిచింది. చీటింగ్‌, మోసాల్లోనూ నగరం ప్రథమస్థానం (2,809)లో నిలిచింది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డు మోసాల్లోనూ నగరం (381కేసులతో) దేశంలోనే ప్రథమంగా నిలిచింది.


వివిధ నేరాల గణాంకాలను పరిశీలిస్తే

నమోదైన మొత్తం నేరాల్లో ఢిల్లీ (30,30,293) టాప్‌లో ఉండగా  11వ స్థానంలో హైదరాబాద్‌ (20,142) ఉంది.  మహిళలను కించపరచడం, వారిని వేధించడం వంటి కేసుల్లో నగరం (177) 5వ స్థానంలో ఉంది. అత్యాచారం (రేప్‌) కేసులకు సంబంధించి 6వ స్థానంలో (116) నిలిచింది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థలో మహిళలను వేధించే కేసుల్లో హైదరాబాద్‌ (14 కేసులతో)టాప్‌లో ఉంది. హత్యలకు సంబంధించిన కేసుల్లోనూ(98), రోడ్డు ప్రమాదాల మృతుల్లోనూ (290) నగరం 9వస్థానంలో నిలిచింది.  


ఇతర నేరాల్లో ఇలా..

భ్రూణ హత్య కేసులు-14 నమోదయ్యాయి. కిడ్నాప్‌ కేసులు- 513, సాధారణ చోరీలు-1,329, భారీ చోరీలు- 319, ఫోర్జరీ-78, ప్రభుత్వ కార్యకలాపాల్లో విఘాతం- 1,270, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌- 2,005, మహిళలపై గృహహింస- 1,678, జువెనైల్‌ కేసులు-23, బాలకార్మికులు-75, ఎస్సీఎస్టీ అట్రాసిటీ-12, ఆయుధాల చట్టం కింద-75, ఐటీ యాక్ట్‌ -203, మాదకద్రవ్యాలు-274, సిగరెట్లు- పొగాకు ఉత్పత్తులు-195 కేసులుగా నమోదయ్యాయి.

Updated Date - 2022-08-29T14:25:41+05:30 IST