వాణిజ్యం.. విభజన

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

జిల్లాల విభజన మూడు నెలల క్రితం జరిగింది. అయితే వాణిజ్య పన్నుల శాఖ విభజన జరగలేదు. ఉమ్మడి జిల్లా నేపథ్యంలోనే ఇప్పటి వరకు కార్యకలాపాలు కొనసాగాయి.

వాణిజ్యం.. విభజన

సీటీశాఖ పునర్విభజన కొలిక్కి

గుంటూరు 2గా నరసరావుపేట డివిజన్‌

గుంటూరు 1, 2 డివిజన్లలో రెండు కొత్త సర్కిళ్లు 

గుంటూరు-2 పర్యవేక్షణలోనే బాపట్ల, చీరాల సర్కిళ్లు 



గుంటూరు, జూలై 1: జిల్లాల విభజన మూడు నెలల క్రితం జరిగింది. అయితే వాణిజ్య పన్నుల శాఖ విభజన జరగలేదు. ఉమ్మడి జిల్లా నేపథ్యంలోనే ఇప్పటి వరకు కార్యకలాపాలు కొనసాగాయి. ఇటీవల ప్రభుత్వం బదిలీలపై నిషేధాన్ని రెండు సార్లు సడలించింది. అయితే విభజన జరగకపోవడంతో వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలపై అయోమయం నెలకొంది. ఈ క్రమంలో సుధీర్ఘ కసరత్తు అనంతరం వాణిజ్యపన్నులశాఖ డివిజన్‌, సర్కిల్స్‌ పునర్విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కొత్త సర్కిల్స్‌, డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. ఈ మేరకు ఆ శాఖ గుంటూరు -1, 2 డివిజన్లలో కొత్త సర్కిళ్లను, వాటి పరిధి సహా వివరాలను అధికారులు ప్రకటించారు. నరసరావుపేట డివిజన్‌ పేరును రద్దు చేశారు. దీనిని గుంటూరు-2 డివిజన్‌గా మార్చారు.  గుంటూరు-2 డివిజన్‌లో బ్రాడీపేట, కొత్తపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల సర్కిల్స్‌తో పాటు కొత్తగా అరండల్‌పేట సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. వినుకొండ సర్కిల్‌ను నరసరావుపేట సర్కిల్‌లో, మాచర్ల సర్కిల్‌ను పిడుగురాళ్ల సర్కిల్‌లో, చిలకలూరిపేట సర్కిల్‌ను సత్తెనపల్లిలో విలీనం చేశారు. ఇక బాపట్ల డివిజన్‌లో ఉన్న బాపట్ల, చీరాల సర్కిళ్లు గుంటూరు-2 జాయింట్‌ కమిషనర్‌ పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. గుంటూరు 1 డివిజన్‌లో పట్నంబజారు, ఏలూరుబజారు, లాలాపేట, మంగళగిరి, తెనాలి సర్కిళ్లు ఉండగా కొత్తగా పెదకాకాని సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. మెయిన్‌బజార్‌ను కొంత పట్నంబజారు సర్కిల్‌లో, కొంత ఏలూరు బజారు సర్కిల్‌లో విలీనం చేశారు. ఒక్కో సర్కిల్‌లో మూడు నుంచి 4వేల మంది వరకు డీలర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంతేగాక రెవెన్యూ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ఆశాఖ అధికారులు తెలిపారు.


త్వరలో బదిలీలకు పచ్చజెండా 

పునర్విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఎంతోకాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తోన్న బదిలీకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ బదిలీల ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో చేపట్ట వచ్చని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. బదిలీలకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలనే కొనసాగిస్తారా లేక కొత్తగా విడుదల చేస్తారా అనేది తేలాల్సి ఉంది.  

 

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST