నేటి నుంచి సిటీ బస్సులు

ABN , First Publish Date - 2020-09-25T07:50:29+05:30 IST

ఎట్టకేలకు సిటీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. మొత్తం సిటీ బస్సుల్లో 25 శాతం.. అంటే 630 బస్సులు శుక్రవారం నుంచి నగర రహదారులపై పరుగులు పెట్టనున్నాయి...

నేటి నుంచి సిటీ బస్సులు

  • 25 శాతం బస్సుల్ని నడపనున్న ఆర్టీసీ
  • కర్నాటక, మహారాష్ట్రలకూ ప్రారంభం
  • ఏపీకి బస్సులు ఒప్పందం కుదిరిన తర్వాతే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు సిటీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. మొత్తం సిటీ బస్సుల్లో 25 శాతం.. అంటే 630 బస్సులు శుక్రవారం నుంచి నగర రహదారులపై పరుగులు పెట్టనున్నాయి. వీటితో పాటే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకూ అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభం కాబోతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌(జీహెచ్‌జడ్‌) పరిధిలో మొత్తం 29 డిపోలున్నాయి. వీటిలో 3,500 బస్సులు ఉండగా.. కాలాతీతమైన 1000కి పైగా బస్సులను ఆర్టీసీ పక్కన పెట్టింది. ప్రస్తుతం 2518 బస్సులున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది మార్చి 19 నుంచి ఈ బస్సులన్నీ డిపోలకు పరిమితమయ్యాయి.


ప్రభుత్వం పాక్షికంగా అనుమతి ఇవ్వడంతో నగర శివారు ప్రాంతాల్లో  గురువారం 229 బస్సులను నడిపారు. మొత్తం బస్సులను నడుపుకోవడానికి అవకాశమివ్వాలంటూ ఆర్టీసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత రెండు రోజులుగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతూ.. బస్సుల ప్రారంభానికి అనుమతించాలంటూ కోరుతున్నారు. ఈ క్రమంలో నగరానికి, కర్ణాటక, మహారాష్ట్రలకు కలిపి మొత్తం 1020 బస్సులను నడిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ఆమోదం తెలిపారని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాల మేరకు.. బస్సులను శానిటైజ్‌ చేయడం, ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.


శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి బస్సులు మొదలుకానున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలకూ కలిపి 390 బస్సుల్ని నడపనున్నట్లు పువ్వాడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు కూడా మొదలుపెట్టాలని యోచించినప్పటికీ... రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కొలిక్కి రాలేదు. దాంతో.. ఒప్పందం కుదిరిన తర్వాతే ఏపీకి బస్సుల్ని నడపనున్నట్లు మంత్రి తెలిపారు. కిలోమీటర్లు తిరిగే విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక బస్సులు తెలంగాణలో, తెలంగాణ బస్సులు ఆ రాష్ట్రాల్లో సమానంగా ఉన్నాయి. అందువల్ల వాటితో ఇబ్బంది లేదు.


ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మాత్రం కిలోమీటర్లపై ఇరు రాష్ట్రాల అధికారుల చర్చలు కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో.. ఒప్పందం కుదరకపోతే ఏపీకే నష్టమని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ‘‘ఏపీ బస్సులు కనిగిరి, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు వంటి దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వస్తుంటాయి. ఆ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ఏపీ ప్రజలు ఎక్కువగా ఉంటారు. దాంతో వారికి లాభదాయకం. అదే కనిగిరి, నెల్లూరు, ఒంగోలు వంటి పట్టణాలకు తెలంగాణ బస్సులను నడపాలంటే మాకు నష్టాలే తప్ప లాభాలుండవు. హైదరాబాద్‌ నుంచి అక్కడికి వెళ్తే తెలంగాణ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కరు. అందుకే మాకు అవసరమైన విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి ప్రాంతాలకు ఎక్కువ బస్సులను నడుపుతామని, అన్నే బస్సులను అవే రూట్లలో ఏపీ నడపాలని వారికి సూచిస్తున్నాం. ఈ ప్రతిపాదనకు ఏపీ అధికారులు ఒప్పుకోవడం లేదు’’ అని పువ్వాడ వివరించారు.


ఆర్టీసీకి ఉపశమనం

మొత్తం వెయ్యికి పైగా బస్సులు ప్రారంభం కానుండటంతో ఆర్టీసీకి ఆర్థికంగా కొంత ఉపశమనం లభించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో నడుస్తున్న జిల్లా బస్సులతో రోజుకు రూ. 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు రాబడి వస్తోంది. తాజాగా మొదలుకానున్న బస్సులతో మరో రూ.2 కోట్ల ఆదాయం పెరగవచ్చని భావిస్తున్నారు.


Updated Date - 2020-09-25T07:50:29+05:30 IST