నెలాఖరుకు సిటీ బస్సులు

ABN , First Publish Date - 2020-09-20T08:29:44+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిలిచిపోయిన సిటీ బస్సులు త్వరలో మళ్లీ రోడ్డెక్కనున్నాయి. కొవిడ్‌-

నెలాఖరుకు సిటీ బస్సులు

తొలుత 50 శాతం సర్వీసులే..

ఏడు రద్దీ మార్గాల్లో నడిపేందుకు యోచన

ముంబయి ఇతర నగరాల్లో అధ్యయనం


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌19 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిలిచిపోయిన సిటీ బస్సులు త్వరలో మళ్లీ రోడ్డెక్కనున్నాయి. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఇప్పటికే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సిటీ బస్సులనూ నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. వాస్తవానికి లాక్‌డౌన్‌ సడలింపులతో అన్ని రకాల కార్యకలాపాలు పునఃప్రారంభమైనా.. సిటీ బస్సులు అందుబాటులోకి రాక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.


మరోవైపు దేశంలోని ఇతర నగరాల్లో బస్‌ సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడివారు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి నగరంలోనూ అమలు చేయాలని గ్రేటర్‌ ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. సర్వీసులను ప్రారంభించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలిచ్చిన్నట్లు తెలిసింది.


సరిగ్గా ఆరు నెలలు..

దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించిన మార్చి 22వ తేదీ నుంచే రాష్ట్రంలో బస్‌ సర్వీసులు నిలిచిపోయాయి. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా మే నెల మూడో వారం నుంచి జిల్లాల్లో, అనంతర దశలో జిల్లాల నుంచి హైదరాబాద్‌కు సర్వీసులు ప్రారంభమయ్యాయి.

అయితే, రద్దీ రీత్యా కొవిడ్‌ నిబంధనల పాటింపు అసాధ్యమనే భావనతో సిటీ బస్సులకు మాత్రం అనుమతివ్వలేదు. దీంతో ఆరు నెలలకు పైగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. నగరవాసులు ఉద్యోగాలు, పనులపై బయటకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తోంది. రోజువారీ పనులు చేసుకునే వారికి ఆటో చార్జీలు భారంగా మారుతున్నాయి. 


ఏడు మార్గాల్లో.. 50 శాతం బస్సులు

మెట్రో స్టేషన్లకు చేరడానికి, స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరడానికి నగర వాసులకు సిటీ బస్సులు కీలకం. తద్వారా సంస్థకూ ఆదాయం సమకూరుతుంది. మహారాష్ట్రలోని ముంబైలో జూన్‌ నుంచే సిటీ సర్వీసులు తిరుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటకల్లోనూ సర్వీసులను పునరుద్ధరించారు. దీంతో టీఎ్‌సఆర్టీసీ అధికారులు ఆ రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు.

హైదరాబాద్‌లో మొదట 50 శాతం బస్సులు నడపాలని భావిస్తున్నారు. అది కూడా ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే  ఏడు మార్గాల్లో వీటిని తిప్పనున్నారు. అంతా ఓకే అయితే.. ఈ నెల చివరి వరకు సిటీ బస్‌ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.


Updated Date - 2020-09-20T08:29:44+05:30 IST