బెజవాడ, విశాఖల్లో నేటి నుంచి సిటీ బస్సులు

ABN , First Publish Date - 2020-09-19T08:39:32+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ అనంతరం.. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం నగరాలలో సిటీ బస్సులకు శనివారం నుంచి అనుమతి

బెజవాడ, విశాఖల్లో నేటి నుంచి సిటీ బస్సులు

  • తెలంగాణకు లక్ష కిలోమీటర్ల తగ్గింపు!
  • డిమాండ్‌ ఉందన్నా టీఎ్‌సఆర్టీసీ వినట్లేదు
  • ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వెల్లడి

విజయవాడ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌ అనంతరం.. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం నగరాలలో సిటీ బస్సులకు శనివారం నుంచి అనుమతి ఇస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు చెప్పారు. వాస్తవానికి సచివాలయ ఉద్యోగుల ప్రవేశ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని బస్సులను నడపాలని నిర్ణయించినట్టు తెలిపారు.  అయితే, సాధారణ ప్రయాణికులను కూడా దృష్టిలో ఉంచుకుని ఒక రోజు ముందుగానే సిటీ బస్సులను నడుపుతున్నట్టు చెప్పారు. సిటీ బస్సులతో పాటు, దూర ప్రాంత బస్సుల్లో అన్ని సీట్లలోనూ ప్రయాణికులు కూర్చునేలా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. వైద్య శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రతి ప్రయాణికుడు మాస్కు ధరించాలని, ధర్మల్‌ స్కానింగ్‌ చేసిన తర్వాతే బస్సులలోకి అనుమతిస్తామని వివరించారు.  కాగా, తెలంగాణ రూట్లలో తిరిగేలా ఏపీ.. 50ు బస్సులు పెంచుకునేందుకు పరిమితులున్నాయని ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్న నేపథ్యంలో.. రాష్ట్రం నుంచి తెలంగాణకు 50ు మేర కిలోమీటర్లు తగ్గించుకోనున్నట్టు కృష్ణబాబు తెలిపారు. దీనికిగాను మానసికంగా సిద్ధమయ్యామని తెలిపారు. దీంతో ఏపీ నుంచి దాదాపు 1.10 లక్షల కిలోమీటర్లు తగ్గించుకోవాల్సి వస్తుందని ఆయన వివరించారు.


ఫలితంగా ప్రైవేటు రవాణా వ్యవస్థ లబ్ధి పొందుతుందన్నారు. ఈ విషయాన్ని టీఎ్‌సఆర్టీసీకి చెప్పినా.. తమకు పరిమితులున్నాయని పేర్కొనట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలో కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. సమాన కిలోమీటర్లు నడపడం, బస్సులను తగ్గించుకునే విషయంలో ఏకీభవిస్తున్నామని, రూట్‌ వైజ్‌ కిలోమీటర్లపై స్పష్టత విషయంలోనే అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు 71 రూట్లలో బస్సులు తిరుగుతున్నాయని, తెలంగాణ నుంచి ఏపీకి 27 రూట్లలో బస్సులు తిరుగుతున్నాయని చెప్పారు. రూట్‌ వైజ్‌ క్లారిటీకి సంబంధించి టీఎ్‌సఆర్‌టీసీ విజయవాడ-హైదరాబాద్‌ ఒక్క రూట్‌ గురించే పట్టు పడుతోందని చెప్పారు. రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో దీనిపై సమీక్షించిన తర్వాత ఆయన ఏపీ వైఖరిని తెలంగాణకు స్పష్టం చేయనున్నారని వివరించారు. 

Updated Date - 2020-09-19T08:39:32+05:30 IST