సిటీ బస్సుల్లో సీసీ కెమెరాలు

ABN , First Publish Date - 2022-05-15T15:34:58+05:30 IST

నగరంలో సిటీ బస్సులలో మహిళలు, బాలికలు సురక్షితంగా ప్రయాణించేందుకు అనువుగా నిర్భయ సురక్షిత నగర పథకం కింద ఏర్పాటు చేసిన కొత్త భద్రతా సదుపాయాలను

సిటీ బస్సుల్లో సీసీ కెమెరాలు

                   - 500 బస్సుల్లో ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై: నగరంలో సిటీ బస్సులలో మహిళలు, బాలికలు సురక్షితంగా ప్రయాణించేందుకు అనువుగా నిర్భయ సురక్షిత నగర పథకం కింద ఏర్పాటు చేసిన కొత్త భద్రతా సదుపాయాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. సచివాలయంలో శనివారం ఉదయం ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో మహానగర రవాణా శాఖ ఆధ్వర్యంలో 500 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలు, అత్యవసర సమయాల్లో అలారం మోగించే పానిక్‌ బటన్‌ సదుపాయాలను వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా సీఎం ప్రారంభించారు. ప్రతి సిటీ బస్సులోనూ మూడు సీసీ టీవీ కెమెరాలు, నాలుగు పానిక్‌ బటన్‌లు, మొబైల్‌ నెట్‌వర్క్‌ వీడియో రికార్డింగ్‌ సదుపాయాలు కలిగి ఉంటాయి. ఈ పరికరాలన్నీ మహానగర రవాణా సంస్థ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానమై ఉంటాయి. బస్సులో ప్రయాణించే మహిళలు లైంగిక వేధింపులకు గురైనా, బాలికలపై లైంగిక వేధింపులు జరిగినా వెంటనే బస్సులో ఉన్న నాలుగు పానిక్‌ బటన్లలో ఏదైనా ఒకదానిని నొక్కితే చాలు, కంట్రోల్‌ రూమ్‌లో ఉన్న సిబ్బంది ఆ బస్సులో కొద్ది క్షణాలకు ముందు నమోదైన వీడియో దృశ్యాలను ఆ తర్వాతి వీడియో దృశ్యాలను నమోదు చేసి, వాటి ఆధారంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు రుజువైతే వెంటనే పోలీసు కంట్రోల్‌ రూమ్‌లకు సమాచారం అందిస్తారు. వెనువెంటే ఆ బస్సు ప్రయాణిస్తున్న చోటుకు సమీపంలో ఉన్న పోలీసులు చేరుకుని నిందితులను నిర్బంధంలోకి తీసుకుంటారు. ఈ పథకం అమల్లో భాగంగా మహానగర రవాణా సంస్థకు చెందిన 31 డిపోలు, 35 బస్‌స్టాపులపై కంట్రోలు రూమ్‌ నుంచే నిఘా వేయనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ధారపోయిన వ్యక్తులను, పాత నేరస్తులను సులువుగా కనుగొనటానికి వీలవుతుంది. రవాణా శాఖ, పోలీసు శాఖ, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కలిసికట్టుగా ఈ పథకం అమలుకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తాయి.


వారసులకు నియామక ఉత్తర్వులు

ఈ కార్యక్రమంలోనే రాష్ట్ర రవాణా సంస్థలు, రాష్ట్ర మోటారు వాహనాల మరమ్మతు సంస్థల్లో విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల వారసులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులను కూడా ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందజేశారు. ఆ మేరకు 136 ఉద్యోగుల వారసులకు కారుణ్య ప్రాతిపదికన వారి విద్యార్హతలను బట్టి ఉద్యోగ నియామక ఉత్తర్వులను పంపిణీ చేశారు. సచివాలయంలో పది మంది ఉద్యోగుల వారసులు ఈ నియామకపు ఉత్తర్వులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.గోపాల్‌, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-15T15:34:58+05:30 IST