ప్రజా వ్యతిరేక విధానాలు తగవు

ABN , First Publish Date - 2020-08-10T10:30:03+05:30 IST

కేంద్ర సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ కోరారు.

ప్రజా వ్యతిరేక విధానాలు తగవు

 కేంద్ర సర్కార్‌ తీరుకు నిరసనగా గళమెత్తిన కార్మికులు, వివిధ సంఘాల ప్రతినిధులు 

జిల్లావ్యాప్తంగా ఆందోళన 


విజయనగరం దాసన్నపేట, ఆగస్టు 9: కేంద్ర సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ కోరారు. రైల్వే, రక్షణ, బీఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌, స్టీల్‌ సంస్థలను ప్రైవేటీకరించడం తగదన్నారు. సేవ్‌ ఇండియా-సేవ్‌ నేషన్‌-సేవ్‌ డెమోక్రసీ నినాదంతో సీఐటీయూ,  రైతు సంఘం, వ్యవసాయ, కౌలు రైతు సంఘాలు  ఆదివారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో మోదీ సర్కార్‌  విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా సంస్కరణలు చేస్తోందన్నారు. రైతులను పూర్తిగా దివాలా తీస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేస్తుందని తెలిపారు. ఇటు వంటి విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలంతా  ఉద్యమించేందుకు సిద్ధమవ్వా లని కోరారు. ఈ నిరసనలో సీఐటీయూ, రైతు సంఘాల ప్రతినిధులు  రమణ, రాంబాబు, రమణ, జగన్మోహనరావు, ఆనంద్‌ పాల్గొన్నారు.  ఫ


బొబ్బిలి:  స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ముందు వామపక్ష కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.  కొవిడ్‌  విధుల్లో ఉన్న స్కీం వర్కర్లకు బీమా సౌకర్యంతో పాటు, రూ.25 వేల రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. క్వారంటైన్‌ కాలంలో వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు ఇవ్వాలన్నారు.  సీఐటీయూ , సీపీఐ నాయకులు పొట్నూరు శంకరరావు, కోట అప్పన్న, ఇఫ్టూ నాయకుడు పిల్లా లక్ష్మణరావు, స్కీం వర్కర్ల నాయకులు లక్ష్మి, శాంతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.


సాలూరు:   స్థానిక పోస్టాఫీసు వద్ద సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు ఎన్‌.వై. నాయుడు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు.  కార్మిక చట్టాలను సమర్థంగా అమలు చేయాలని కోరారు. పనిగంటల పెంపును నిలిపివేయాలని కోరారు. అందరికి ఉచిత ఆరోగ్యం సౌకర్యం కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ధరలు అదుపు చేయాలన్నారు.


సేవ్‌ ఇండియాడే పేరిట ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు సిద్దాబత్తుల రామచంద్రరావు ఆధ్వర్యంలో పట్టణంలో జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. లాక్‌డౌన్‌ కాలంలో కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు. 


నెల్లిమర్ల: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని  కార్మిక సంఘాల ప్రతినిధులు స్థానిక మొయిద జంక్షన్‌లో   నిరసన  చేపట్టారు. సేవ్‌ ఇండియా పేరిట  సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇఫ్టూ నేతలు  కిల్లంపల్లి రామారావు, తాలాడ సన్నిబాబు, పి.మల్లిక్‌ , కనకల రాము, మద్దిల ప్రకాష్‌,  కె.సింహాచలం , ఆటో కార్మికులు పాల్గొన్నారు.


గజపతినగరం:  స్థానిక గ్రామ సచివాలయం కార్యాలయం ఆవరణలోని గాంధీ  విగ్రహం వద్ద ప్రజా సంఘాల నేతలు నిరసన  తెలిపారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని అక్కడి అధికారికి వినతిపత్రం అందజేశారు. ఆదాయపుపన్ను పరిధిలోకి రాని పేదలకు నెలకు రూ.7,500 అందించాలని,  ఉపాధి హామీ పథకంలో కుటుంబానికి 200రోజులు పనులు డిమాండ్‌ చేశారు.  బంజరు సాగు చేసుకుంటున్న పేదలకు  పట్టాలు అందించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరావు,  ఐద్వా జిల్లా కార్యదర్శి వి. లక్ష్మి,  సీఐటీయూ నాయకులు కృష్ణ, అప్పలరాజు, కోటి, ఐద్వా నాయకులు హరి కృష్ణవేణి, లక్ష్మి, రైతు సంఘం నాయకులు సింహద్రి  తదితరులు పాల్గొన్నారు.


పార్వతీపురంటౌన్‌: స్థానిక నాలుగురోడ్ల కూడలి వద్ద  సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి జీవీ రమణ ఆధ్వర్యంలో ధర్నా  నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు ఆర్‌.శ్రీరామ్మూర్తి, సంగం, రమణి తదితరులు పాల్గొన్నారు.


కొత్తవలస: స్థానిక సచివాలయం సమీపంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు గాడి అప్పారావు ఆధ్వర్యంలో ఆందోళననిర్వహించారు. పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల కు ఉపాధి కల్పించాలని, వేతనాలలో కోతను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైౖతులను కుదేలు చేసే మూడు ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలన్నారు.  

Updated Date - 2020-08-10T10:30:03+05:30 IST