రాక్ సిరామిక్ పరిశ్రమ ఎదుట సీఐటీయూ ఆందోళన

ABN , First Publish Date - 2021-11-11T23:27:40+05:30 IST

పట్టణంలోని రాక్ సిరామిక్ పరిశ్రమలో కార్మికులను అక్రమంగా తొలగించడాన్ని

రాక్ సిరామిక్ పరిశ్రమ ఎదుట సీఐటీయూ ఆందోళన

పెద్దాపురం: పట్టణంలోని రాక్ సిరామిక్ పరిశ్రమలో కార్మికులను అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ కంపెనీ ఎదుట సీఐటీయూ ఆందోళన నిర్వహించింది. పరిశ్రమలో కార్మికుల అక్రమ తొలగింపు, వేధింపులను నిరసిస్తూ గురువారం ఉదయం కంపెనీ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. 2004లో ప్రారంభమైన కంపెనీలో సుమారు మూడువేల మంది కార్మికులు విధులు నిర్వహించేవారన్నారు. కానీ నేడు 500 మందితో కంపెనీని నడుపుతున్నారని విమర్శించారు. కరోనా కారణంగా కంపెనీ ఉత్పత్తులు వెళ్లడం లేదనే కారణంతో ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నారన్నారు. కార్మికులకు ఎటువంటి పరిహారం ఇవ్వకుండా రాజీనామా చెయ్యాలని కంపెనీ యాజమాన్యం తీవ్రంగా వేధిస్తుందని వారు ఆరోపించారు. 




కంపెనీ ఆరంభంలో కార్మికుల ద్వారా కోట్ల రూపాయలు ఆదాయాన్ని పొందిన యాజమాన్యం నేడు నష్టాలు వస్తున్నాయని కారణంతో కార్మికులను తొలగించడం దారుణమన్నారు. కంపెనీ లాభాలను యాజమాన్యం తీసుకొని, నష్టాలు వస్తే కార్మికులు భరించాలా అని వారు ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే లేబర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. చర్చల పేరుతో తమను యాజమాన్యం పిలిచిందన్నారు. ప్రస్తుతం తొలగించిన కార్మికులతో పాటు మరో 200 మంది కార్మికులను తొలగిస్తామని లేదా గుజరాత్‌కు బదిలీ చేస్తామని యాజమాన్యం బెదిరిస్తుందని వారు వాపోయారు. గుజరాత్‌కు ఆఫీస్ సిబ్బందిని బదిలీ చేసుకోవాలన్నారు. కానీ కార్మికులను ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. తక్షణం అక్రమ బదిలీలను, అక్రమ తొలగింపులను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మికులతో కలిపి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని కార్మికులు, సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.

Updated Date - 2021-11-11T23:27:40+05:30 IST