ఐక్య పోరాటంతోనే బీజేపీకి చెక్‌

ABN , First Publish Date - 2020-12-05T05:32:37+05:30 IST

ప్రయివేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేయాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచాలంటే ఐక్యపోరాటమే శరణ్యమని, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా త్వరలోనే ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడం ఖాయమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌.నరసింగరావు అన్నారు.

ఐక్య పోరాటంతోనే బీజేపీకి చెక్‌
సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక ర్యాలీ

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌.నరసింగరావు

సీతంపేట, డిసెంబరు 4: ప్రయివేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేయాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచాలంటే ఐక్యపోరాటమే శరణ్యమని, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా త్వరలోనే ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడం ఖాయమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌.నరసింగరావు అన్నారు. మూడేళ్ల క్రితం కేంద్రం డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) ప్రయివేటీకరణకు ప్రయత్నిస్తే పోరాడి అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తు పోరాటాలకు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.


డీసీఐ పరిరక్షణ దినం సందర్భంగా శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సీతమ్మధార అల్లూరి విగ్రహం నుంచి డీసీఐ కేంద్ర కార్యాలయం వరకు కార్మిక ర్యాలీ నిర్వహించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో నరసింగరావు మాట్లాడుతూ ప్రయివేటీకరణ దిశగా అత్యంత వేగంగా అడుగులు వేస్తున్న మోదీ ప్రభుత్వ విధానాలను అడ్డుకోవాలంటే పోరాడక తప్పదన్నారు. వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా కేంద్రం తెచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతాంగం పోరాటంతో బీజేపీ ప్రభుత్వం బెంబెలెత్తుతోందని, ప్రజా ఉద్యమానికి ఉన్న బలం ఇదన్నారు. తొలుత డీసీఐ ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటంలో చనిపోయిన వెంకటేష్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వి.ఎస్‌.పద్మనాభరాజు, ఎం.జగ్గునాయుడు, ఆర్‌.కె.వి.ఎస్‌.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-05T05:32:37+05:30 IST