పానీపూరి వ్యాపారి కుటుంబానికి అభిమానుల అండ

ABN , First Publish Date - 2020-06-26T00:28:17+05:30 IST

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న కార్ల్‌మార్క్స్ వ్యాఖ్యల్ని ముంబై ప్రజలు తిరగ రాశారు.

పానీపూరి వ్యాపారి కుటుంబానికి అభిమానుల అండ

ముంబై : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న కార్ల్‌మార్క్స్ వ్యాఖ్యల్ని ముంబై ప్రజలు తిరగ రాశారు. ఓ వ్యాపారికీ, వినియోగదారుడికీ ఉన్న బంధం కేవలం వర్తకంతోనే ముగిసిపోతుందనుకోవడం వఠ్ఠి భ్రమే... ఆ బంధాన్నీ మమతాను రాగాలతో అల్లుకోవచ్చని ముంబై వాసులు నిరూపిస్తున్నారు. భగవతీ యాదవ్..... అతి పెద్ద ముంబై నగరంలోని రంగ్టా లేన్ దగ్గర ఓ పానీ పూరీ వ్యాపారి. 46 సంవత్సరాలుగా ఇదే వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. పానీ పూరీ.. ఛాట్ మసాలా లాంటి పదార్థాలను అత్యంత శుభ్రతను పాటిస్తూ... రుచిగా తయారు చేస్తాడు.


ఈ పదార్థాలన్నింటినీ కేవలం ‘మినరల్ వాటర్’తో మాత్రమే తయారు చేస్తాడు. అందుకే ఈయన్ను ‘‘బిస్లరీ పానీపూరీ వాలా’ అని ప్రేమగా పిలుచుకుంటారు.  ఆ ప్రాంతంలో భగవతీ యాదవ్ బండి అంటే... తెలియని వారుండరని ప్రతీతి. భగవతీ యాదవ్‌కు, వినియోగదారులకు మధ్య అవ్యాజ ప్రేమ ఉంది. కొన్ని రోజుల క్రిందటే... ఓ విషాదం సంభవించింది. భగవతీ యాదవ్‌ కరోనా సోకి మరణించాడు.


ఈ వార్త ఆయన వినియోగదారుల్ని తీవ్రంగా కలిచి వేసింది. దీంతో ఇన్ని రోజులుగా స్వచ్ఛమైన, అత్యంత రుచికరమైన పానీపూరీ, ఛాట్‌ను అందిస్తూ.... అందరి మనస్సులకు దగ్గరైన ఆయన కుటుంబం ఒంటరైంది. ఈ విషాదాన్ని భరించలేకపోయిన ఆయన అభిమానులు... 5 లక్షల రూపాయాల ఆర్థిక సహాయాన్ని చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


ఇప్పటికి 2.50 లక్షల రూపాయల్ని పోగు చేసి ఆ కుటుంబానికి అందించారు. అంతేకాకుండా విరాళాల కోసం  www.ketto.org fundraiser for the panipuriwala,"  అన్న వెబ్ పోర్టల్‌నే సృష్టించి... దాని ద్వారా విరాళాల్ని సేకరిస్తున్నారు. దీనిపై ఓ స్థానికుడు మాట్లాడుతూ....


‘‘ఈ ప్రాంతంలో ఈయన చాలా పాపులర్. చాలా సంవత్సరాలుగా ఈయన దగ్గరే పానీపూరీ తింటున్నాం. ఇక నుంచి మేము వేరే బండిని వెతుక్కోవాలి. ఓ మంచి తండ్రిని, భర్తని ఆ కుటుంబం కోల్పోయింది. వారికి మద్దతు, భరోసా కావాలి. అందుకే మేము ఈ వెబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించాం. ఎవరికి తోచినంత వారు విరాళాలిస్తే బాగుంటుంది.’’ అని గిరీశ్ అగర్వాల్ పేర్కొన్నారు.


మరో వినియోగదారుడు షా మాట్లాడుతూ... కొన్నేళ్లుగా శుభ్రంగా... స్వచ్ఛంగా... అదే రుచితో పానీపూరీ అందిస్తున్నాడు. ఆయన మరణించడం అత్యంత బాధాకరం. చాలా మందికి ఆయన పేరు తెలియదు. కానీ ఆయన రుచితో దాదాపు అందరికీ పరిచయమే. కొన్ని రోజులుగా ఆయన బండిని పెట్టడం లేదు. ఆయన మరణించడం చాలా బాధగా ఉంది’’ అని వాపోయారు.

Updated Date - 2020-06-26T00:28:17+05:30 IST