Abn logo
Feb 22 2020 @ 03:07AM

బాబు సర్కార్‌పై సిట్‌

ఇంటెలిజెన్స్‌ డీఐజీ నేతృత్వం

సభ్యులంతా పోలీసు అధికారులే

ఐదేళ్లపాలనపై ‘టోకు’న దర్యాప్తు

అన్ని కీలక నిర్ణయాలపై విచారణ

ఎవరినైనా పిలిచి విచారించవచ్చు

ఏ ఫైలునైనా తెప్పించుకోవచ్చు

సిట్‌నే పోలీసు స్టేషన్‌గా పరిగణన

సీఆర్పీసీ కింద విచారణ, కేసుల నమోదు

మంత్రివర్గ ఉపసంఘ నివేదికే ప్రాతిపదిక

స్పీకర్‌ కూడా ఆదేశించారని ప్రస్తావన


అమరావతి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు  ఐదేళ్ల సర్కారు’పె జగన్‌ ప్రభుత్వం ‘సిట్‌’ వేసింది. అప్పట్లో అవకతవకలు జరిగాయంటూ  మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చిందని... ఆ సంగతి తేల్చేందుకు ప్రత్యేక సంస్థ అవసరమని నిర్ణయించి... సిట్‌ ఏర్పాటు చేస్తున్నామంటూ జీవో విడుదల చేసింది. ‘‘రాష్ట్ర విభజన తర్వాత... నవ్యాంధ్ర అభివృద్ధిపై ప్రభావం చూపించేలా తీసుకున్న ప్రధాన విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు, ఏర్పాటు చేసిన సంస్థలు (కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు మొదలైనవి), ఇతర కీలకమైన పరిపాలనా నిర్ణయాలపై 2019 జూన్‌ 26వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ తన తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సీఆర్డీయే పరిధిలో భూముల కేటాయింపుతో సహా పలు ప్రాజెక్టుల్లో విధాన, న్యాయ, ఆర్థిక పరమైన అవకతవకలను, మోసపూరిత లావాదేవీలను గుర్తించింది. దీనిపై నిశితంగా చర్చించిన తర్వాత... ఈ మొత్తం వ్యవహారంపై ఒక ప్రత్యేక ఏజెన్సీతో దర్యాప్తు చేయాలని నిర్ణయించడమైనది’’ అని జీవోలో పేర్కొన్నారు. పైగా... గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని స్పీకర్‌ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించారని గుర్తు చేశారు.


‘సిట్‌’కు దిశా నిర్దేశం...

సిట్‌ పనితీరు - విధి విధానాలను కూడా జీవోలో పొందుపరిచారు. దీనిప్రకారం... సిట్‌ అధికారులు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్పీసీ) ప్రకారం ఆయా అంశాలపై విచారణ చేయవచ్చు. కేసు రిజిస్టర్‌ చేసి దర్యాప్తు చేయవచ్చు. అలాగే... సంబంధిత సమాచారాన్ని అవసరమైతే రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో పంచుకోవడంతోపాటు సమన్వయం చేసుకోవాలి. అంతేకాదు... తాము దర్యాప్తు చేస్తున్న అంశానికి సంబంధించి ఏ వ్యక్తినైనా, అధికారినైనా పిలిపించుకుని, వారి వాంగ్మూలం రికార్డు చేసుకునే అధికారం కూడా సిట్‌కు ఉంటుంది. ఇక... ఆయా అంశాలకు సంబంధించిన ఎలాంటి రికార్డులనైనా తెప్పించుకుని పరిశీలించవచ్చు. సిట్‌కు అన్ని శాఖలు, అందరు అధికారులు సహకరించాల్సిందే. ఇదే జీవోలో ‘పోలీసు స్టేషన్‌’ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ‘సిట్‌’నే ఒక పోలీసు స్టేషన్‌గా పరిగణిస్తారని స్పష్టం చేశారు.


‘సిట్‌’ స్టాండ్‌ ఏమిటి?

సాధారణంగా ఒక సంచలన సంఘటన, విస్తృతమైన పరిధి ఉన్న అంశంపై సమగ్రమైన, ప్రత్యేక దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటు చేస్తుంటారు. ఉదాహరణకు.... వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై పోలీసు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేశారు. విశాఖ భూముల లావాదేవీలపైనా సిట్‌ వేశారు. ఇందులో భూములతోపాటు మోసం, నేరాల కోణం కూడా ఉండటంతో రెవెన్యూతోపాటు పోలీసు అధికారులను నియమించారు. కానీ... ఇప్పుడు నిర్దిష్టంగా ఒక్క అంశంపై కాకుండా, ‘హోల్‌సేల్‌’గా ఐదేళ్ల కాలంలో తీసుకున్న అన్ని కీలక నిర్ణయాలపై సిట్‌ వేయాలని నిర్ణయించడంపై అధికార వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. పైగా... సిట్‌ అధిపతితోపాటు సభ్యులందరూ పోలీసు విభాగానికి చెందిన వారే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 50కి పైగా విభాగాలు తీసుకున్న నిర్ణయాల్లో లోటుపాట్లపై వీరు దర్యాప్తు చేయడం సాధ్యమేనా? పాలనా నిర్ణయాల్లో లోటుపాట్లపై వీరికి అవగాహన ఏముంటుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు.


ఒక్కటని కాదు! అదీ ఇదీ అనేమీ లేదు! ‘హోల్‌సేల్‌’గా... సిట్‌! రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న, అమలు చేసిన అన్ని  ప్రధాన నిర్ణయాలు, అప్పగించిన కాంట్రాక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలన్నింటిపైనా దర్యాప్తు జరిపించాలని జగన్‌ సర్కారు తీర్మానించింది. దీనిపై ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామ్‌ రెడ్డి నేతృత్వంలో... మొత్తం 10 మంది పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. దీనిపై సాధారణ పరిపాలన విభాగం (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ శుక్రవారం రాత్రి జీవో నెంబరు 344 జారీ చేశారు. ‘సిట్‌’లో వీరే..


కొల్లి రఘురామ్‌ రెడ్డి, 

ఇంటెలిజెన్స్‌ డీఐజీ. (సిట్‌ అధిపతి)

బాబూజీ అట్టాడ, విశాఖ ఎస్పీ

సీహెచ్‌ వెంకట అప్పలనాయుడు,

ఇంటెలిజెన్స్‌ ఎస్పీ-2

శ్రీనివాస రెడ్డి, కడప అదనపు ఎస్పీ

జయరామరాజు, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ 

విజయ భాస్కర్‌- విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ 

ఎం. గిరిధ ర్‌, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ

కెన్నడీ, ఏలూరు రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌

ఐ. శ్రీనివాసన్‌, ఇన్‌స్పెక్టర్‌ (నెల్లూరు జిల్లా)

వి. రాజశేఖరరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ (గుంటూరు జిల్లా)

Advertisement
Advertisement
Advertisement