రెండు లాప్‌టాప్స్ ఉన్నాయని ఫైనాన్స్ మినిస్టర్‌నే ఆపేశారు

ABN , First Publish Date - 2021-10-01T22:14:51+05:30 IST

తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో గురువారం ఉదయం కలకలం

రెండు లాప్‌టాప్స్ ఉన్నాయని ఫైనాన్స్ మినిస్టర్‌నే ఆపేశారు

చెన్నై : తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో గురువారం ఉదయం కలకలం రేగింది. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్‌ను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అధికారి ఒకరు నిలిపేశారు. త్యాగరాజన్ రెండు లాప్‌టాప్స్‌ను తీసుకెళ్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆ అధికారి చెప్పారు. అయితే ఉన్నతాధికారుల జోక్యంతో త్యాగరాజన్ ప్రయాణానికి అనుమతి లభించింది. 


స్థానిక మీడియా కథనాల ప్రకారం, పళనివేల్ త్యాగరాజన్ చెన్నై నుంచి తూత్తుకుడి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. చెన్నై డొమెస్టిక్ టెర్మినల్ దగ్గర ఆయన తన బ్యాగును స్కానింగ్ కోసం ఇచ్చారు. అందులో రెండు లాప్‌టాప్‌లు కనిపించడంతో సీఐఎస్ఎఫ్ అధికారి అభ్యంతరం తెలిపారు. ఓ ప్రయాణికుడు రెండు లాప్‌టాప్‌లను తీసుకెళ్ళరాదని చెప్పారు. త్యాగరాజన్ స్పందిస్తూ అలాంటి నిబంధన ఏదీ లేదన్నారు. త్యాగరాజన్ రాష్ట్ర మంత్రి అని తెలియడంతో విమానాశ్రయం ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆయనకు క్షమాపణ చెప్పారు. 


చెన్నై విమానాశ్రయం అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇదంతా కొంత అపార్థం వల్ల జరిగిందన్నారు. పళనివేల్ త్యాగరాజన్‌ ఒక లాప్‌టాప్‌నే తీసుకొచ్చినట్లు సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ భావించి ఉంటారని, అందుకే రెండో లాప్‌టాప్‌ను ట్రేలో ఉంచాలని అడిగి ఉంటారని అన్నారు. దీనిని త్యాగరాజన్ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్ ఉత్తరాదికి చెందినవారవడం వల్ల ఆయన స్పష్టంగా తమిళంలో మాట్లాడలేకపోయి ఉండవచ్చునన్నారు. తాము  సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించామని, ఎటువంటి సమస్య లేదని చెప్పారు. విమానాశ్రయం ఉన్నతాధికారులు వెంటనే వెళ్ళి మంత్రి త్యాగరాజన్‌కు క్షమాపణ చెప్పారని, సబ్ ఇన్‌స్పెక్టర్ కూడా క్షమాపణ చెప్పారని తెలిపారు. 


Updated Date - 2021-10-01T22:14:51+05:30 IST