ఉగ్రరూపం దాల్చిన గోదావరి, మానేరు

ABN , First Publish Date - 2021-07-24T06:15:43+05:30 IST

జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదు లు, వాగులు ఉప్పొంగుతున్నాయి.

ఉగ్రరూపం దాల్చిన గోదావరి, మానేరు
మంథని వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

- ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి ఎల్లంపల్లికి భారీగా వరద

- మానేరు తీరంలో నీట మునిగిన నిర్మాణంలో ఉన్న చెక్‌ డ్యామ్‌లు

పెద్దపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదు లు, వాగులు ఉప్పొంగుతున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజె క్టులోకి శ్రీరాంసాగర్‌, కడెం ప్రాజెక్టుల నుంచి 8 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద రావడంతో అంతే మొత్తంలో 40 గేట్లు ఎత్తి దిగువకు వదిలిపెడుతున్నారు. ఈ వరదంతా సిరిపురం వద్ద గల పార్వతి బ్యారేజీలోకి వస్తుండడంతో మొత్తం గేట్లు ఎత్తి దిగువకు వదిలిపెడుతున్నారు. దీంతో గోదావరిఖనిలో మున్సిపల్‌ వద్దనున్న ఒక ఇటుక బట్టీ నీట మునిగింది. అక్కడ నివసిస్తున్న 33 కార్మికులు బిక్కుబిక్కు మంటూ ఒక భవనంపైకి చేరారు. వారిని రక్షించేందుకు శుక్రవారం ఉదయం సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. వారితో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ వెళ్లి ఆ కార్మికులందరినీ కాపాడారు. అలాగే గోదా వరి వంతెన సమీపంలో గల లారీ అసోసియేషన్‌ యార్డు కూడా నీట మునిగింది. అక్కడ వెయిటింగ్‌లో ఉన్న 200కు పైగా లారీలు సగం వరకు మునగడంతో లారీ యజమాను లకు నష్టం వాటిల్లింది. శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా నీటమునిగాయి. దాని పక్కనే వినాయకుడి విగ్రహా లు తయారుచేసే ముగ్గురు బెంగాల్‌ కార్మికులు వరదల్లో చిక్కుకోగా వారిని కూడా కాపాడారు. మంథని మండలం సిరిపురంలోగల పార్వతి బ్యారేజీ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో గోదావరి ఒడ్డునగల గౌతమేశ్వరాల యం చుట్టూ పెద్ద ఎత్తున నీళ్లు చేరాయి. ఆ దేవాలయం ఆవరణలో పూజారుల ఇళ్లు ఉన్నాయి. అందులో 15 మంది కుటుంబసభ్యులు నివసిస్తున్నారు. గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లిన పలువురు మత్స్యకారులు వరదల్లో చిక్కుకోగా ఎటు వెళ్లే దారిలేకపోవడంతో గౌతమేశ్వరాల యం వద్దకు చేరుకున్నారు. మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి ఏడుగురు తమ బంధువు చనిపోతే నిద్ర చేసేం దుకు దేవాలయానికి వెళ్లి అక్కడే చిక్కుకున్నారు. సమాచా రం తెలుసుకున్న సింగరేణి రెస్క్యూ బృందం శుక్రవారం ఉదయం అక్కడికి వెళ్లి కాపాడి సురక్షిత ప్రాంతానికి చేర్చా రు. మత్స్యకారులు పడవల ద్వారా ఒడ్డుకు చేరారు. పూజా రుల కుటుంబసభ్యులను సురక్షిత ప్రాంతానికి తీసుకవచ్చేం దుకు డీసీపీ రవీందర్‌, ఏసీపీ ఉమేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ ప్రయత్నించినా వాళ్లు రాలేదు. మధ్యాహ్నం వరకు వరద తగ్గడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. అలా గే కరీంనగర్‌ మానేరు డ్యామ్‌ గేట్లు ఎత్తి సుమారు 50 వేల క్యూసెక్కుల నీటిని మానేరులోకి వదిలిపెట్టడంతో జిల్లాలో మానేరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. సుల్తానాబాద్‌ మండ లం నీరుకుళ్ల వద్ద మానేరు తీరం వెంబడిగల శ్రీ రంగనా యకులస్వామి ఆలయం సగంవరకు నీట మునిగింది. నీరు కుళ్ల, కనగర్తి, ఓదెల, ఓడేడు తదితర ప్రాంతాల్లో మానేరు పై నిర్మిస్తున్న పలు చెక్‌డ్యామ్‌లు నీట మునిగాయి. మల్క పురం, జనగామ, సుందిళ్ల, సిరిపురం, గుంజపడుగు, విలోచ వరం, పోతారం, ఉప్పట్ల, మంథని, ఖానాపూర్‌, ఖాన్‌సాయి పేట, ఆరెంద, మల్లారం గ్రామాల రైతులకు చెందిన దాదా పు 3వేల ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. గోదా వరి, మానేరు నదులు వరదలతో పోటెత్తుతుండడంతో తీర ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు, పోలీసులు అప్ర మత్తం చేశారు. పలు గ్రామాల్లో వరి పొలాలు, పత్తి చేన్లకు నష్టం వాటిల్లింది. పలు చెరువులు, కుంటలు నిండి మత్తడి దూకుతున్నాయి. గోదావరిఖని ప్రాంతంలోగల సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల్లోకి వర్షం నీళ్లు రావడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

Updated Date - 2021-07-24T06:15:43+05:30 IST