Oct 22 2021 @ 18:57PM

సినిమా సెట్‌లో గన్ మిస్‌ఫైర్ అవ్వడంతో సినిమాటోగ్రాఫర్ మృతి

హాలీవుడ్ నటుడైన అలెక్ బాల్డ్విన్  చేతిలోని ప్రాప్ గన్ పేలడంతో ఒక సినిమాటోగ్రాఫర్ మృతి చెందింది. ఆ సినిమా దర్శకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన న్యూ మెక్సికోలో వేసిన సినిమా సెట్‌లో గురువారం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.


‘‘ రస్ట్ ’’అనే సినిమా సెట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ సినిమాలో అలెక్ బాల్డ్విన్ 19వ శతాబ్దానికి చెందిన వ్యక్తిగా నటిస్తున్నారు. ఆయన చేతిలోని ప్రాప్ గన్ పేలడంతో సినిమాటోగ్రాఫరైన హాలినా హచిన్స్(42), దర్శకుడైన జోయెల్ సౌజా(48)కు గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా హచిన్స్ చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందింది. జోయెల్ సౌజా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నాయి.   


ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి కేసును నమోదు చేయలేదని పోలీసులు తెలుపుతున్నారు. ప్రస్తుతం సాక్షులను దర్యప్తునకు హాజరు కావాలని ఆదేశించామన్నారు. చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ..అలెక్ చేతిలోని గన్ మిస్‌ఫైర్ అవ్వడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు.


మూవీ సెట్స్‌ల్లో ప్రాప్ గన్‌లను ఉపయోగించడానికి కఠినమైన నిబంధనలుంటాయి. అయినప్పటికీ కొంత‌మంది మరణిస్తూనే ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్ లెజెండ్  బ్రూస్‌లీ తనయుడైన బ్రాండన్‌ లీ గతంలో ఈ విధంగానే మరణించారు. అలెక్ బాల్డ్విన్  1980 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు.