Abn logo
Sep 13 2020 @ 09:02AM

ఊళ్లన్నీ తిరుగుతూ.. 'సినిమా వాలే బాబూ' పాఠాలు!

లాక్‌డౌన్‌ తొలగించగానే స్కూళ్లు తెరిచి.. భౌతిక దూరం పాటిస్తూ, తక్కువ అటెండెన్స్‌తో క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ దేశంలో కరోనా విజృంభణ అంచనాలు దాటేసింది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యా సంస్థలు రీఓపెన్ చేస్తే పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడేసినట్లే. ఈ కారణంగా విద్యా సంస్థల పునఃప్రారంభం ఆలస్యమయ్యేలా ఉంది. స్కూళ్లు తెరవడం మరీ ఆలస్యమైతే విద్యార్థుల భవితవ్యంపై దుష్ప్రభావం పడే అవకాశం మరీ ఎక్కువ. ఈ సమస్యలకు ప్రభుత్వం ఆలోచించిన పరిష్కారం.. ఆన్‌లైన్‌ క్లాసులు. 

కొరియా: అభివృద్ధి చెందుతున్న దేశమైన భారత్‌లో పూర్తిగా ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ అసాధ్యమని విమర్శకులు ఆరోపించారు. ఆన్‌లైన్‌ క్లాసులు అందరూ వినలేరు. ఆర్థిక వెనుకబాటుతనం, టెక్నాలజీకి దూరంగా ఉండటం.. వంటి సమస్యలు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉన్నాయని వారు వాదించారు. చత్తీస్‌గఢ్‌లోని కొరియా కూడా అలాంటి ప్రాంతాల్లోనే ఒకటి. ఇక్కడి చాలా కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడే ఉన్నాయి. వారికి స్మార్ట్‌ఫోన్లు కొనుక్కొని తరగతులు వినేంత స్థోమత లేదు. అయితే పేదరికం కారణంగా వీరి పిల్లలు.. విద్యకు దూరం కాకూడదని అశోక్‌ లోధీ భావించారు. స్థానికంగా ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేసే ఆయనకు అప్పుడే ఓ వినూత్న ఆలోచన వచ్చింది. బైక్‌పై టీవీ పెట్టుకొని విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అందిచాలనేదే ఆ ఐడియా. దీనికి స్కూలు యాజమాన్యం కూడా ఓకే చెప్పేసింది. అంతే.. స్కూలుకు చెందిన ఓ టీవీని బైక్‌పై పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాలన్నీ రౌండ్లు కొట్టేయడం ప్రారంభించారాయన. ఆయా గ్రామాల్లోని పిల్లలకు డిజిటల్ క్లాసులు చెప్పడం మొదలెపెట్టారు.

ఏదో బడికి వెళ్లామా, పాఠం చెప్పామా వచ్చామా అన్నట్లు ప్రవర్తించే టీచర్లున్న ఈ రోజుల్లో.. ఈ చత్తీస్‌గఢ్‌ టీచర్ ఏకంగా బడినే పిల్లల వద్దకు తీసుకెళ్తున్నారు. బైక్‌పై ఊళ్లన్నీ తిరిగి విద్యార్థులకు చదువు చెప్తున్నారు. 'సినిమా వాలే బాబూ' పేరుతో ఈ క్లాసులు నిర్వహిస్తూ పిల్లల్లో బాగా పాపులర్ అయిపోయారు. ఈయన బైక్ పొలిమేరల్లో కనిపించగానే పిల్లలంతా ఓ చోట చేరిపోయి పాఠాల వినడానికి రెడీ అయిపోతున్నారంటే అశోక్‌ పాపులారిటీని అర్థంచేసుకోవచ్చు. కరోనా కారణంగా స్కూళ్లు తెరవడం కష్టమని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ప్రభుత్వం చేస్తున్న సూచనలే తన ఆలోచనకు పునాది అని ఆయన చెప్పారు. ఈ తరగతులు తమకు బాగా నచ్చుతున్నాయని, అస్సలు బోర్‌ కొట్టదని, సినిమా చూస్తున్నట్లు ఉంటుందని పిల్లలు కూడా సంబరంగా చెప్తున్నారు. ఇలా సినిమా చూపిస్తున్నట్లు పిల్లలకు జ్ఞానబోధ చేస్తున్న ఈ టీచర్.. కొరియా పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో పిల్లలకు విద్యనందిస్తున్నారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. స్కూళ్లు ఎప్పుడు రీఓపెన్ చేస్తారో స్పష్టత లేదు. ఈ సమయంలో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదే ఉద్దేశ్యంతో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యావిధానం దాదాపుగా ఆన్‌లైన్‌లోకి మారిపోయింది. అయితే ఆర్థికంగా వెనకబడి టెక్నాలజీని అందిపుచ్చుకోలేని వారి పరిస్థితి ఏంటి? వీరి గురించి ఆలోచించేవారు.. ప్రభుత్వ నిర్ణయంతో పేదలకు చదువు అందని ద్రాక్ష అయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ చత్తీస్‌గఢ్‌ టీచర్ ఐడియా అందరి దృష్టినీ ఆకర్షించింది. కొరియా ప్రాంత ప్రభుత్వాధికారులు కూడా సదరు టీచర్‌ను మెచ్చుకుంటున్నారు. కరోనా సమయంలో ఇలా క్లాసులు నిర్వహించడం వల్ల సోషల్ డిస్టెన్సింగ్‌ కూడా పాటించినట్లవుతుందని, పిల్లలు కూడా ఉత్సాహంగా క్లాసులు వింటారని కొనియాడారు.

Advertisement
Advertisement
Advertisement