మళ్లీ ‘సినిమా’ పంచాయితీ!

ABN , First Publish Date - 2021-12-28T08:02:22+05:30 IST

సినిమా పంచాయితీ మళ్లీ మొదటికివచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల విషయంలో అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు ఎగ్జిబిటర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు.

మళ్లీ ‘సినిమా’ పంచాయితీ!

  • నేడు మంత్రి పేర్ని నానితో డిస్ట్రిబ్యూటర్ల భేటీ
  • రాష్ట్రంలో ఇప్పటిదాకా 240 హాళ్లు మూత
  • సీఎంను కలవాలని పరిశ్రమ పెద్దల ప్రయత్నం
  • 10రోజులుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వని జగన్‌


విజయవాడ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : సినిమా పంచాయితీ మళ్లీ మొదటికివచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల విషయంలో అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు ఎగ్జిబిటర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు థియేటర్లను నడపడం సాధ్యం కాదని పలువురు స్వచ్ఛందంగానే థియేటర్లను మూసివేస్తున్నారు. రాష్ట్రంలో సుమారుగా 1200 థియేటర్లు ఉండగా, వాటిలో ఇప్పటి వరకు ఇలా 240 వరకు మూతపడ్డాయి. ఒక్క కృష్ణా జిల్లాలోనే స్వచ్ఛందంగా 35 థియేటర్లను మూసివేయగా, మరో 15 థియేటర్లకు అధికారుల తనిఖీలతో తాళాలుపడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉండటంతో ప్రభుత్వంతో మరోసారి భేటీకావాలని చిత్ర పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. నిర్మాతలు, దర్శకులు, నటులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు విడివిడిగా సీఎం జగన్‌తో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.


 పదిరోజులుగా ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్‌ ఆన్‌లైన్‌ విధానం అమలులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి చర్చలన్నీ మంత్రి పేర్ని నానితోనే జరిగాయి. ఇప్పటి వరకు ఒక్కసారీ సీఎం చిత్ర పరిశ్రమకు చెందిన వారికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. తాజాగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మంత్రి పేర్ని నాని వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం మరోసారి భేటీ నిర్వహించనున్నారు. అయితే, దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఎగ్జిబిటర్లు చెబుతుండటం గమనార్హం. సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే విడివిడిగా భేటీ అవుతామని వారంతా స్పష్టం చేస్తున్నారు. దీంతో మంగళవారం భేటీకి డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే హాజరవుతారా, ఎగ్జిబిటర్లు కూడా వస్తారా అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణ టికెట్‌ ధరలకు సంబంధించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించి.. కొంతమేర వాటిని పెంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలువురు థియేటర్ల యజమానులు ధరలకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను న్యాయస్థానం కొట్టేసింది. 


ఒక్కటవుతున్న పరిశ్రమ

రాష్ట్రంలో థియేటర్లు వరుసగా మూతపడటంపై చిత్రపరిశ్రమలో ఐక్యత పెరుగుతోంది. ధరలపై చర్చించడానికి అగ్రహీరో చిరంజీవి రంగంలోకి దిగుతారని ప్రచారం నడుస్తోంది. హీరో నాని ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్‌.నారాయణమూర్తి ధరలపై స్పందించారు. సినిమాను చూపించేవాళ్లు, చూసేవాళ్లు ఇద్దరూ బాగుండాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చిత్రపరిశ్రమపై సానుకూలంగా స్పందించాలని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు.  


టికెట్‌ ధరలపై జనవరిలో కార్యాచరణ

తూర్పుగోదావరి ఎగ్జిబిటర్ల హెచ్చరిక 

రాజమహేంద్రవరం: థియేటర్లలో టికెట్ల ధరలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 35ను వెంటనే రద్దు చేయాలని  తూర్పుగోదావరి జిల్లా సినీ ఎగ్జిబిటర్లు, డిస్ర్టిబ్యూటర్ల అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.  పట్టణ ప్రాంతాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా టికెట్ల ధరలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది. రాజమహేంద్రవరంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ నాయకులు అత్తి సత్యనారాయణ, కోళ్ల అచ్యుతరామారావు(బాబు),  స్వామిబాబు, రమేశ్‌, సదాశివ, వేంకటేశ్వరరావు, రంగరాజు మాట్లాడారు. కొవిడ్‌ సమయంలో మూతపడిన థియేటర్లకు ప్రకటించిన విద్యుత్‌ రాయితీలను వెంటనే ఇవ్వాలని కోరారు.  లేదంటే జనవరిలో సమావేశమై కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2021-12-28T08:02:22+05:30 IST