షో.. రెడీ!

ABN , First Publish Date - 2021-07-30T05:41:53+05:30 IST

ఇంచుమించు నాలుగు నెలల తర్వాత సినిమా థియేటర్లు నేటి(శుక్రవారం) నుంచి తెరుచుకోబోతున్నాయి.

షో.. రెడీ!

 నేటి నుంచి మరికొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శనలు

50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతి

నష్టపోవలసి వస్తుందని కొన్ని యాజమాన్యాలు వెనుకంజ

 

గుంటూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఇంచుమించు నాలుగు నెలల తర్వాత సినిమా థియేటర్లు నేటి(శుక్రవారం) నుంచి తెరుచుకోబోతున్నాయి. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో సినిమాలను ప్రదర్శించేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధమయ్యారు. సినిమాహాళ్లని పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేసి రెడీ చేశారు. కొంతమంది మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వారు సినిమా హాల్స్‌ తెరవకూడదని నిర్ణయించుకొన్నారు. ఇప్పటికిప్పుడు పెద్ద హీరోలు నటించిన కొత్త సినిమాలు కూడా లేకపోవడంతో మరి కొన్ని రోజుల పాటు థియేటర్లను మూసే ఉంచాలని తీర్మానించారు. ఇప్పటికే ఓటీటీలలో వచ్చిన సినిమాలు, కొవిడ్‌-19 సెకండ్‌వేవ్‌ ముందు ప్రదర్శించిన చిత్రాలనే ప్రదర్శించేందుకు కొందరు ఏర్పాట్లు చేశారు. 

కొవిడ్‌ ఫస్టు వేవ్‌ తర్వాత సంక్రాంతికి ముందే తెరుచుకొన్న సినిమా థియేటర్లు కేవలం మూడు నెలల వ్యవధిలో సెకండ్‌ వేవ్‌ విజృంభణ కారణంగా మళ్లీ మూతేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఏప్రిల్‌ నెలలో భారీగా కరోనా కేసులు రావడంతో అప్పటినుంచి థియేటర్లు మూసేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇటీవలే కేసులు కాస్త తగ్గడంతో ఈ నెల8వ తేదీ నుంచే థియేటర్లు తెరిచేందుకు అనుమతించినప్పటికీ ఎగ్జిబిటర్లు ముందుకు రాలేదు. జిల్లా కేంద్రమైన గుంటూరు నగరంలో వారం, పది రోజుల నుంచి గౌరీశంకర్‌, గణేష్‌మహల్‌ థియేటర్లలో చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. ఇదిలావుంటే జీవో నెంబరు.35 ప్రకారం టిక్కెట్‌ ఛార్జీలతో థియేటర్లు నడపలేమని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. టిక్కెట్‌ రేట్లు పెంచుకొనేందుకు అనుమతిస్తే వెనువెంటనే థియేటర్లు తెరిచేందుకు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఇప్పుడున్న ఛార్జీలు, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరిచినా కనీసం నిర్వహణ ఛార్జీలు కూడా రావు. ఇప్పటికే విద్యుత్‌ బిల్లులు కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. 

మూడు ఆటలకే అనుమతి

కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ని అరికట్టేందుకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉన్నందున జిల్లాలో మూడు ఆటలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు. సెకండ్‌ షో ఉండదు. అలానే సీటుకు సీటుకు మధ్యన ఒక సీటుని వదిలేయాలి. 50శాతం మించి టిక్కెట్లు జారీ చేయరాదు. థియేటర్లలోకి వచ్చే ప్రతీ ఒక్కరిని థర్మల్‌ స్ర్కీనింగ్‌ తప్పక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తరచుగా హాల్‌ అంతా శానిటైజ్‌ చేయాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనల నడుమ గుంటూరు నగరంలో ఐదారు థియేటర్లు మాత్రమే తెరిచేందుకు ఎగ్జిబిటర్లు, యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2021-07-30T05:41:53+05:30 IST