సమాజ విచ్ఛిన్నానికి కుట్ర

ABN , First Publish Date - 2021-01-19T06:00:30+05:30 IST

సమాజాన్ని మతప్రాతిపదికన విభజించి విచ్ఛిన్నం చేయడానికే ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని త్రిదండి చిన జీయర్‌స్వామి అన్నారు.

సమాజ విచ్ఛిన్నానికి కుట్ర
మాట్లాడుతున్న చిన జీయర్‌ స్వామి

  1.  విగ్రహాల విధ్వంసం దుష్ట శక్తుల పని
  2.  వారిపై పాలకులు ఉక్కుపాదం మోపాలి
  3.  త్రిదండి చిన జీయర్‌స్వామి


పత్తికొండ రూరల్‌, జనవరి 18: సమాజాన్ని మతప్రాతిపదికన విభజించి విచ్ఛిన్నం చేయడానికే ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని త్రిదండి చిన జీయర్‌స్వామి అన్నారు. మండల పరిధిలోని దేవనబండ గ్రామంలో టీటీడీ నిధులతో నిర్మించిన వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సోమవారం ఆయన దర్శించారు. పత్తికొండ పట్టణంలో గుత్తి రహదారిలో గతంలో కూల్చిన అంజనేయస్వామి విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం రెండు చోట్ల ఏర్పాటు చేసిన సమావేశాలలో భక్తులనుద్దేశించి ప్రసం గించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తుండడం దురదృష్టకరమని అన్నారు. విగ్రహాల ధ్వంసం పిచ్చోళ్ల పని కాదని, మతి ఉండి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు దుష్టశక్తులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నాయని అన్నారు. విగ్రహాల ధ్వంసం జరిగిన సందర్భంలో దుండగులను గుర్తించడం పాలకుల బాధ్యత  అని అన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. హిందూ ధర్మం సమాజానికి మంచి సంప్రదాయాన్ని నేర్పించిందని అన్నారు. ప్రపంచమే మన సంప్రదాయాలను పాటిస్తుండడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. పురాణాల్లో దేవుళ్లను భక్తితో కొలువడమే కాదు, వారిని ఆదర్శంగా తీసుకుని మానవుడు మనుగడ సాగిస్తున్నాడని అన్నారు. హిందూ ధర్మం అతిప్రాచీనమైనదని, చరిత్రను చెరిపివేయాలని అనుకోవడం మూర్ఖత్వమని పేర్కొన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై పాలకులు ఉక్కుపాదం మోపాలని సూచించారు. హిందూ సమాజం ప్రమాదబారిన పడకుండా హిందూవులు ఐక్యతతో మెలగాలని కోరారు. గ్రామాల్లో చిన జీయర్‌స్వామికి హిందూధార్మిక సంఘాల నాయకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. దేవనబండ దళిత కాలనీలో ఏర్పాటు చేసిన  వెంకటేశ్వరస్వామి ఆలయం చూడముచ్చటగా ఉందని జీయర్‌ స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక సంఘాల నాయకులు రంగాగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి, దండి మల్లికార్జున, బోనాల కాశీ, దేవనబండ గాంధీరెడ్డి, నగూరు సుధాకర్‌, వినోద్‌కుమార్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 


గూడూరు: మండలంలోని పొన్నకల్‌ సమీపంలో ఆంజనేయస్వామి, అమ్మవారి విగ్రహాలను గుప్తనిధుల కోసం దుండగులు పెకిలించిన ఆలయాన్ని త్రిదండి చిన జీయర్‌ స్వామి సందర్శించారు. సోమవారం రాత్రి ఆయన పొన్నకల్‌ పాత ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి ఆంజనేయస్వామి, అమ్మవారి విగ్రహాలు గుప్తనిధుల కోసం దుండగులు పెకిలించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ పునఃనిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ నెల 28వ తేదీన ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించాలని నిర్వహకులకు సూచించారు. 


 మద్దికెర: దేవదేవుడు రంగనాథుడని త్రిదండి చిన్నజీయర్‌స్వామి అన్నారు. సోమవారం మండలంలోని పెరవలి గ్రామానికి వచ్చిన చిన్నజీయర్‌స్వామికి ప్రధాన బస్టాండ్‌ నుంచి మేళతాళాలతో స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా చినజీయర్‌స్వామి మాట్లాడుతూ శ్రీరంగనాథుడు ఆవిర్భవించినప్పుడే సృష్టి మొదలయిందన్నారు. ప్రజలు తీరకలేని సమయం గడుపుతున్నారని, యువత కూడా దైవమార్గంలో నడవాలని కోరారు. శాలివాహన మాజీ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, విరాళా దాతలు పారా రామచంద్రప్రసాద్‌, పారా విశ్వనాథ్‌, నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి రంగాగౌడ్‌, బాబ్జీగౌడ్‌, ఆలయ చైర్మన్‌ లింగం శ్రీధర్‌రెడ్డి, కార్యనిర్వహణాధికారి మల్లికార్జున పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T06:00:30+05:30 IST