మరో వివాదంలో పాకిస్థాన్ గురుద్వారా.. ప్రసాదం ప్యాకెట్లపై సిగరెట్ ప్రకటన

ABN , First Publish Date - 2021-12-18T21:57:34+05:30 IST

పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ గురుద్వారా సాహిబ్ మరోమారు వార్తల్లోకి ఎక్కింది. గురుద్వారాను ..

మరో వివాదంలో పాకిస్థాన్ గురుద్వారా.. ప్రసాదం ప్యాకెట్లపై సిగరెట్ ప్రకటన

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ గురుద్వారా సాహిబ్ మరోమారు వార్తల్లోకి ఎక్కింది. గురుద్వారాను సందర్శించే భక్తులకు పంపిణీ చేసే ‘పిన్నీ ప్రసాదం’ పొట్లాల లోపలివైపు ‘గోల్డ్ స్ట్రీట్ ఇంటర్నేషనల్’ బ్రాండ్ సిగరెట్ల ప్రకటన ఉండడం వివాదాస్పదమైంది. అదే రేపర్ బయటి వైపు మాత్రం గురుద్వారా జనమ్ ఆస్థాన్, నాన్‌కానా సాహిబ్ ఫొటోలను గురునానక్ దేవ్ ‌జీ ఆశీస్సులు ముద్రించి ఉన్నాయి.


భక్తులకు పంపిణీ చేసే ప్రసాదం ప్యాకెట్లపై సిగరెట్ల ప్రకటన ఉండడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ (పీఎస్‌జీపీసీ) పేరెంట్ బాడీ అయిన పాకిస్థాన్ ఎవాకీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీపీబీ) ఈ ప్రకటన ఇవ్వడం గమనార్హం.


ఇటీవల కూడా గురుద్వారా వివాదాల్లో చిక్కుకుంది. ఓ మోడల్ తలను కప్పుకోకుండా గురుద్వారాలో ఫొటోషూట్ నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై ఇమ్రాన్ ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. ఆ తర్వాత ఆ మోడల్ క్షమాపణలు చెప్పింది.


తాజా వివాదంపై పాకిస్థాన్ సిక్కు నేత ఒకరు మాట్లాడతూ పిన్నీ ప్రసాదం ప్యాకెట్లపై సిగరెట్ ప్రకటన సరికాదని పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా తమ మాట ఎవరూ వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


 ‘శిఖ్ రెహాత్ మర్యాద (సిక్కు నియమావళి)లోని నాలుగు నిషేధాల్లో పొగాకు కూడా ఒకటి. అయితే, ఈ ప్యాకెట్లు ఇప్పటి కావని, ప్రస్తుతం అలాంటి రేపర్లతో ఏ దుకాణంలోనూ ప్రసాదం పంపిణీ జరగడం లేదని ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ సీఈవోగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ లతీఫ్ తెలిపారు.


ఇదే విషయమై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సిర్సా బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. ప్రసాదం ప్యాకెట్లపై ‘బీడీ సిగరెట్’ ప్రకటనపై చర్యలు తీసుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.



Updated Date - 2021-12-18T21:57:34+05:30 IST