దర్జాగా ఈ-సిగరెట్ల దందా

ABN , First Publish Date - 2022-08-08T06:13:21+05:30 IST

ఈ-సిగరెట్ల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

దర్జాగా ఈ-సిగరెట్ల దందా

నిషేధమున్నా నగరంలోకి..  

కస్టమ్స్‌ అధికారుల కళ్లు గప్పి రవాణా

పొరుగుదేశాల నుంచి దొడ్డి దారిన సరుకు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఈ-సిగరెట్ల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వాలు, కోర్టులు వీటిని నిషేధించినా దర్జాగా దందా నడుస్తోంది. ఈ-సిగరెట్లపై కొంత కాలంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. వైద్య బృందాలు కేంద్రానికి లేఖలు రాశాయి. దాంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం 2019లో ఎలకా్ట్రనిక్‌ నికోటిన్‌ డెలివరీ సిస్టమ్స్‌ (ఈఎన్‌డీఎస్‌), ఈ-సిగరెట్ల నిషేఽధ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ-సిగరెట్ల నిషేధంపై ఆర్డినెన్స్‌ జారీ అయింది. ఈ-సిగరెట్లను వినియోగించడం, నిల్వ ఉంచడం చట్ట రీత్యా నేరమని, ఆరు నెలల జైలు, రూ. 50వేల వరకు జరిమానా ఉంటుందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ఈ - సిగరెట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. నిషేధాజ్ఞలున్నా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. 

కంపెనీల కుట్ర ప్రచారం..

ఈ-సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం కాదని కంపెనీలు తొలి రోజుల్లో జోరుగా ప్రచారం చేశాయి. ధూమపానం మానేసేందుకు ఇదో మంచి మార్గమని చెప్పాయి. దీంతో టీనేజ్‌ నుంచి మధ్య వయస్కుల వరకు ఈ-సిగరెట్ల వైపు ఆకర్షితులయ్యారు. దీంతో నగరంలో ఈ దందా జోరుగా సాగుతోంది. నిషేధం ఉన్నా.. చాటుమాటుగా విక్రయాలు జరుపుతున్నారు. 

విదేశాల నుంచి..

నిషేధానికి ముందు ఈ-సిగరెట్లను విదేశాల నుంచి దిగుమతి చేసి ఇక్కడ విక్రయించేవారు. సుమారు 90 శాతం మంది ఈ-సిగరెట్లు ఆన్‌లైన్‌లోనే తెప్పించుకునేవారు. కేవలం విదేశాల్లోనే తయారయ్యే ఫిలిప్‌ మారిస్‌, జూల్‌ ల్యాబ్స్‌ లాంటి ఖరీదైన ఎలకా్ట్రనిక్‌ సిగరెట్లు (రూ. వెయ్యి నుంచి రూ. 3వేల వరకు), సాధారణ ధరలకు (రూ. 400 నుంచి రూ. 450 వరకు) లభించే ఈ-సిగరెట్లు విక్రయంలో ఉండేవి. ఎక్కువగా టీనేజీ కుర్రాళ్లు కొనుగోలు చేసేవారు. కొంత మంది బ్రోకర్లు వీటిని ఇక్కడకు తెప్పించేవారు. 

అక్రమ మార్గంలో..

నిషేధం అనంతరం కూడా నగరంలోని కొంతమంది వ్యాపారులు  రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచి నమ్మకమున్న వారికి కోడ్‌ భాషలో మాట్లాడుతూ విక్రయిస్తున్నారు. పర్‌ఫ్యూమ్‌ పెన్‌, కుష్బూ వాలా పెన్‌ (సువాసనతో కూడిన పెన్‌) అని పిలుస్తూ క్రయ విక్రయాలు సాగిస్తున్నారట. ప్రధానంగా పొరుగున ఉన్న దేశాల నుంచి దిగుమతి చేస్తున్నట్లు సమాచారం. చైనా, యూకే, యూఎ్‌సఏ, ఫిలిప్పీన్స్‌ నుంచి నేపాల్‌ లేదా బంగ్లాదేశ్‌కు తరలించి అక్కడి నుంచి దేశంలోకి తరలిస్తున్నట్లు సమాచారం. కస్టమ్స్‌ అధికారులు చాలా సందర్భాల్లో పట్టుకుంటున్నా.. కొన్ని సార్లు వారి కళ్లు గప్పి, లేదా కిందిస్థాయి సిబ్బంది చేయి తడిపి గంటల వ్యవధిలోనే వేర్వేరు నగరాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ప్రధాన మార్కెట్లు, హోల్‌సేల్‌ మార్కెట్లలో మాత్రమే కాదు... కొన్ని ప్రాంతాల్లోని పాన్‌షాపుల్లో కూడా ఈ-సిగరెట్లు చాటుగా విక్రయిస్తున్నారు. 

Updated Date - 2022-08-08T06:13:21+05:30 IST