సీఐఈ స్థలాలు ఎవరికి..?

ABN , First Publish Date - 2021-04-12T06:51:28+05:30 IST

బాలానగర్‌ కో ఆపరేటివ్‌ ఇండస్ట్రీస్‌ ఎస్టేట్‌ (సీఐఈ) ఫేజ్‌-1లోని

సీఐఈ స్థలాలు ఎవరికి..?

ఎవరికి వారే పోటాపోటీ ప్రయత్నాలు

సొసైటీ ఎన్నికల నిర్వహించాలంటున్న లీజుదారులు

న్యాయస్థానం ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ

ఎన్నికలపై కౌంటర్‌ ఫైల్‌ దాఖలు చేసే యోచనలో అధికారులు 

ఆ స్థలాలు తమకే ఇవ్వాలంటున్న టెనెంట్స్‌  


బాలానగర్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): బాలానగర్‌ కో ఆపరేటివ్‌ ఇండస్ట్రీస్‌ ఎస్టేట్‌ (సీఐఈ) ఫేజ్‌-1లోని స్థలాల లీజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. లీజు పూర్తయిన 47 ఎకరాల స్థలం లెక్క ఎటూ తేలడం లేదు. 51 ఏళ్ల లీజు గడువు పూర్తయ్యాక నోటీసులు ఇవ్వకుండానే ప్రభుత్వం స్థలాన్ని స్వాధీనం చేసుకుందని అలాటీస్‌ ఆరోపిస్తున్నారు. సొసైటీకి ఎన్నికలు నిర్వహించడం ద్వారానే స్థలం చిక్కుముడి వీడుతుందని లీజు దారులు అంటున్నారు. మరో వైపు ఆ స్థలాల్లో ఉన్న టెనెంట్స్‌ (ఎగ్జిస్టింగ్‌ యూనిట్స్‌) తకు కేటాయించాలని ప్రభుత్వానికి అర్జీలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, సొసైటీకి అప్పగిస్తుందా, టెనెంట్స్‌కు ఇస్తుందా అనేది ఆసక్తిగా మారింది. 


కోర్టు మధ్యంతర ఉత్తర్వులు

సీఐఈ గడువు 2003లోనే పూర్తయింది. అయినా సొసైటీ ఎన్నికలు నిర్వహించకుండా అధికారులు దాటవేస్తున్నారు. విసిగిపోయిన లీజుదారులు మూడు నెలల క్రితం తమ సొసైటీకి ఎన్నికలు నిర్వహించడంలో  ప్రభుత్వం జాప్యం చేస్తోందని హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు సొసైటీకి ఎన్నికలు జరిపించాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని లీజుదారులు కమిషనర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ నుంచి మొదలు ఇండస్ట్రీస్‌ జీఎం వరకు అధికారులందరినీ కలిసి కోరారు. వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. 2003లో సొసైటీ గడువు పూర్తయిందని, అప్పటి నుంచీ సొసైటీకి చెందిన మెంబర్‌షి్‌పలు, ఆడిటింగ్‌లు సరిగ్గా లేవంటూ ప్ర భుత్వం హైకోర్టుకు కౌంటర్‌ ఫైల్‌ దాఖలు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే ఎన్నికల నిర్వహణకు కొన్ని నెలలు పట్టవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. 


అద్దెలపై ఉత్తర్వులు ఇవ్వకుండానే...

లీజు గడువు పూర్తయిందని, అద్దెలు చెల్లించవద్దని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులూ రాక పోయినప్పటికీ 2016 నుంచి లీజు స్థలాల్లో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అద్దెలు చెల్లించకుండానే వాడుకుంటున్నారని అలాటీస్‌ కొందరు ఆరోపిస్తున్నారు. 


మాకైనా ఇప్పించండి...

బాలానగర్‌ కో ఆపరేటీవ్‌ ఎస్టేట్‌ సొసైటీకి ఎన్నికలు జరిపించాలని లీజుదారులంతా పట్టుపడుతుంటే లీజు స్థలాల్లో ఉన్న చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులు సుమారు  176 మంది ఆ స్థలాన్ని లీజుకు లేదా అమ్మకం ద్వారా తమకు చెందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లీజు స్థలంపై అంతు చిక్కని ప్రభుత్వ ఆలోచన, ఎన్నికల కోసం ఎందాకైనా వెళ్లాలనే అలాటీస్‌, తాము క్యూలో ఉన్నామనే టెనెంట్స్‌ల తీరుతో ఆ స్థలం ఎవరికి దక్కతుందోననే ఉత్కంఠ పెరిగింది. 


ఎన్నికలు జరిపిస్తే మంచిది

మాకు పరిశ్రమను నడిపించుకోవడమే తెలుసు. యువకుడిగా వచ్చి పరిశ్రమల నిర్వహణలో జుట్టు నెరిసి పోయింది. పరిశ్రమ నిర్వహణ తప్ప మరే వ్యాపారం మాకు తెలియదు. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సపోర్టు చేసి సొసైటీకి ఎన్నికలు జరిపిస్తే మంచిది. 

- శ్యాం అగర్వాల్‌, సీఐఈ మాజీ చైర్మన్‌


ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి..

ఈ పరిశ్రమను నమ్ముకుని ఎందరో కార్మికులు బతుకుతున్నారు. ఎన్నికలు జరిపిస్తే ఎన్నో  విషయాలు వెలుగులోకి వస్తాయి. తెలంగాణ ఫండ్‌తో నిర్మితమైన సొసైటీ భవనాన్ని మాకు కేటాయించాలి.

- భరత్‌వీర్‌, సొసైటీ మాజీ సభ్యుడు, హైదరాబాద్‌ షీట్‌మెటల్‌, అలాయిడ్‌ పరిశ్రమ నిర్వాహకులు 


త్వరగా నిర్ణయం తీసుకోవాలి

లీజు స్థలంపై అలాటీస్‌, టెనెంట్స్‌ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఏదో ఒకటి త్వరగా తేల్చితే బాగుంటుంది. లేదంటే కు త్బుల్లాపూర్‌ 307 సర్వే నెంబర్‌లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చిన్న పరిశ్రమలకు కేటాయిస్తే మేలు జరుగుతుంది. 

 - శ్రీనివాస్‌, ఏ-6, ఎస్‌ఎల్‌జీ ఫ్యాబ్రికేషన్‌

Updated Date - 2021-04-12T06:51:28+05:30 IST