ఏది తప్పు? ఎవరిది తప్పు?

ABN , First Publish Date - 2021-03-19T08:30:46+05:30 IST

అసైన్డ్‌ భూములు అమ్మడం నేరం! కొనడమూ నేరమే! అయితే... కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం ప్రభుత్వం అసైన్డ్‌ భూములను వెనక్కి తీసుకోవచ్చు. దానికి పరిహారం ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ప్రభుత్వ ఇష్టం! ‘‘కానీ... అమరావతి కోసం అసైన్డ్‌ భూములను నాటి చంద్రబాబు సర్కారు దళిత రైతుల

ఏది తప్పు? ఎవరిది తప్పు?

అసైన్డ్‌ రైతుల కోసమే జీవో 41 అంటున్న టీడీపీ

బినామీల కోసమే ఈ సవరణ అని వైసీపీ వాదన

కేసుపై ఇప్పటికే సీఐడీ ప్రాథమిక నివేదిక

అసైన్డ్‌ రైతులకూ లబ్ధిపై తొలి జీవోలోనే ప్రస్తావన

‘క్లాసిఫికేషన్‌’ లేనందువల్లే అస్పష్టత, ఆందోళన

అప్పట్లో అమరావతిలో అసైన్డ్‌ రైతుల ఉద్యమాలు

అందరికీ మేలు చేసేందుకు అధికారుల కసరత్తు

సలహాలు, సూచనల మేరకు సానుకూల స్పందన

పూర్తి స్పష్టతతో జీవో నంబరు 41 జారీ

అధికారుల స్థాయిలోనే నాడు సవరణలు

ఆ తర్వాత నెల రోజులకు సీఎంచేత ర్యాటిఫై

చంద్రబాబు ఒత్తిళ్లు ఉన్నట్లు చెప్పని సీఐడీ

అయినా... నాటి సీఎం, మంత్రిపై కేసు!

ఇది కక్ష సాధింపు అంటున్న తెలుగుదేశం


అన్ని ఆధారాలూ ఉన్నాయి

అసైన్డ్‌ భూములు బలవంతంగా లాక్కున్నారు..

సీఐడీ విచారణలో ఆళ్ల


అసైన్డ్‌ భూములు అమ్మడం నేరం! కొనడమూ నేరమే! అయితే... కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం ప్రభుత్వం అసైన్డ్‌ భూములను వెనక్కి తీసుకోవచ్చు. దానికి పరిహారం ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ప్రభుత్వ ఇష్టం! ‘‘కానీ... అమరావతి కోసం అసైన్డ్‌ భూములను నాటి చంద్రబాబు సర్కారు దళిత రైతుల నుంచి లాక్కోలేదు. మిగిలిన రైతులతో సమానంగా లబ్ధి చేకూర్చింది. అవసరమైన మేరకు చట్టాన్ని సవరించింది. దీనివల్ల అమరావతిలోని వేలాదిమంది అసైన్డ్‌ రైతులకు ఇతర రైతులతో సమానమైన హక్కులు లభించాయి. ఇలా దళిత రైతులకు మేము మేలు చేశాం’’ అని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. అయితే... జగన్‌ సర్కారు మాత్రం ఇది నేరమంటోంది! అప్పటి ముఖ్యమంత్రి, పురపాలక మంత్రిపై కేసు పెట్టింది. దీనిపై ఎవరి వాదనలు వారివి. అయితే... ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, పి.నారాయణ చేసిన తప్పేమిటో సీఐడీ తన ప్రాథమిక నివేదికలో తేల్చకపోవడం గమనార్హం!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం ఒక పెద్ద ప్రాజెక్టు చేపడుతోందనుకుందాం! దానికి  సంబంధించిన భూసేకరణ/సమీకరణ పనులు బహిరంగంగానే మొదలయ్యాయి. అంతలోనే... కొందరు దళారులు రంగంలోకి దిగారు. అసైన్డ్‌ రైతుల వద్దకు వెళ్లి... ‘మీ భూమిని ప్రభుత్వం తీసుకుంటుంది. మాకు అప్పగిస్తే ఎంతోకొంత డబ్బులు ఇస్తాం’ అని బెదిరించో, మభ్యపెట్టో భూములు తీసేసుకుంటే, అది ఎవరి తప్పు? 


అదే సమయంలో... ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు కోసం సేకరించాల్సిన భూమిలో... అసైన్డ్‌ భూమీ ఉంది! ‘‘అయ్యా... మీరు ఇతర రైతులకు రకరకాల  ప్యాకేజీలు ప్రకటించారు. మరి మా మాటేమిటి? మాకూ తగిన న్యాయం చేయండి!’’ అని సంబంధిత రైతులు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇతర రైతులతో సమానంగా వీరికీ న్యాయం చేసేందుకు అడ్డుగా ఉన్న పలు నిబంధనలను సవరించింది. దీంతో... వేలాదిమంది అసైన్డ్‌ రైతులకు మేలు జరిగింది. ఇది తప్పా? నాడు అధికారంలో ఉన్న వాళ్లు నేరం చేసినట్లా!?.... ఇది తెలుగుదేశం నాయకుల ప్రశ్న!


అమరావతి విషయంలో మాజీ సీఎం చంద్రబాబు, నాటి మంత్రి పి.నారాయణపై సీఐడీ కేసుతో తలెత్తుతున్న ప్రశ్నలివి! నాటి ప్రభుత్వం నిబంధనలు సవరించి మరీ అమరావతి పరిధిలోని అనేకమంది అసైన్డ్‌ రైతులకు మేలు చేసింది. కానీ... అసైన్డ్‌ రైతులను కొంతమంది ముందే మభ్యపెట్టి భూములు తీసుకున్నారని, అలాంటి వారికోసమే నిబంధనలను సవరించారు.! ఇది నేటి ప్రభుత్వ పెద్దల ఆరోపణ!


ఎవరు చేసినట్లు... 

రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు సర్కారు  ఏపీ సీఆర్‌డీఏ చట్టం-2014 తీసుకొచ్చింది. అసెంబ్లీలో చేసిన చట్టానికి అధికారులు నిబంధనలు రూపొందిస్తారు. (రూల్స్‌ ఫ్రేమ్‌ చేయడం). దీని ప్రకారం... 2015 జనవరి 1వ తేదీన భూసేకరణ నిబంధనలు పొందుపరుస్తూ జీవో నంబర్‌ 1 జారీ చేశారు. అసైన్డ్‌ భూములకు కూడా ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనలు వర్తిస్తాయని అందులోనే చెప్పారు. అంటే... అసైన్డ్‌ రైతులకూ లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. అయితే... ల్యాండ్‌ క్లాసిఫికేషన్‌ (1954కు ముందు అసైన్డ్‌ అయినవా, తర్వాత అయినవా... వంటి పలు అంశాలు) మాత్రం చేయలేదు. దీంతో... 26 గ్రామాల పరిధిలో ఆందోళన తలెత్తింది. తమకూ న్యాయం జరగాలని అసైన్డ్‌ రైతులు ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ స్థాయిలో ఉద్యమకారులూ రాజధానికి వచ్చి సభలూ సమావేశాలు నిర్వహించారు. దీనిపై ఓ మోస్తరు ఉద్యమం సాగింది. భూసమీకరణపై రాజధాని రైతులతో జరిపిన పలు సమావేశాల్లో దీనికి సంబంధించి అనేక సూచనలు వచ్చాయి.


ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజధాని నిర్మాణానికి భూసమీకరణ సాఫీగా సాగాలని నాటి ప్రభుత్వం, అధికార యంత్రాంగం భావించాయి. అన్ని రకాల అసైన్డ్‌ భూములు, శివాయిజమా భూములు, నిరుపేదల ఆక్రమణలో ఉన్న అభ్యంతరకరమైన, నిరభ్యంతకరమైన భూములకూ ప్యాకేజీ వర్తింప చేయాలని నిర్ణయించారు. సీఆర్డీయేకు ఒక రూపు రేఖలు వచ్చి,  రైతులతో సమావేశాలు నిర్వహించి, ఆయా భూముల వివరాలు సేకరించేందుకు చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. ఇందుకు చాలా సమయమే పట్టింది. చివరికి... సీఆర్డీయే అధికారుల సూచనల మేరకు పురపాలక శాఖ రూల్స్‌లో కొన్ని మార్పులు చేస్తూ 2016 ఫిబ్రవరి 17వ తేదీన జీవో 41 విడుదల చేసింది. దీని ప్రకారమే... రాజధాని కోసం భూసమీకరణ జరిగింది. అసైన్డ్‌తోపాటు ఆక్రమణ భూములకూ ప్యాకేజీ ఖరారు చేశారు. ఈ జీవో జారీ తర్వాతే మొత్తం భూసమీకరణ ప్రక్రియ మొదలుపెట్టారు.


ఇప్పుడెందుకు అభ్యంతరం

దళితుల భూములను లాక్కున్న వారికి మేలు చేసేందుకే జీవో నెంబరు 41 జారీ చేశారని ఇప్పుడు సీఐడీ కేసు పెట్టింది. చంద్రబాబు, పి.నారాయణలపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నిజానికి... జీవో నంబరు 41 తేవడం వెనుక భారీ కసరత్తు జరిగింది. సీఐడీ ప్రాథమిక నివేదిక ప్రకారం చూసినా... 2015 డిసెంబరు 14న నాటి గుంటూరు కలెక్టర్‌  కాంతిలాల్‌ దండే సీఆర్డీయే కమిషనర్‌కు ఓ లేఖ పంపించారు. ఆ లేఖ ఆధారంగానే వ్యవహారమంతా సాగింది. సీఆర్డీయే కమిషనర్‌ కార్యాలయంలో నాటి పురపాలక మంత్రి నారాయణ, రాజధాని ప్రాంత రైతు కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అసైన్డ్‌ భూముల పరిహారం సెటిల్‌మెంట్‌కు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటిని సీఆర్డీయే చట్టం రూల్స్‌లో పొందుపరచాలని సీఆర్డీయే కమిషనర్‌కు రాసిన లేఖలో గుంటూరు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే పేర్కొన్నారు.


ఆ లేఖ ఆధారంగా 1954కు ముందు అసైన్డ్‌ అయిన భూములను పట్టా భూములుగా, 1954 తర్వాత ఇచ్చిన వాటిని అసైన్డ్‌ భూములుగా, ఇతరులకు కేటాయించిన వాటిని శివాయిజమా భూములుగా పరిగణించాలని, అభ్యంతరకరమైన, నిరభ్యంతరకరమైన  ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికి కూడా తగిన పరిహారం ఇవ్వాలన్న రైతుల సూచనలను సీఆర్డీయే చట్టం-2014 రూల్స్‌లో చేర్చాలని నాటి సీఆర్డీయే  కమిషనర్‌ శ్రీకాంత్‌ ప్రతిపాదించారు. ఈ ఫైలును సీఆర్డీయే, పురపాలక శాఖ కార్యదర్శిగా ఉన్న అజయ్‌జైన్‌ ప్రాసెస్‌ చేశారు. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలు కోరుతూ... 2015 డిసెంబరు 19న రెవెన్యూ శాఖకు పంపించారు. సీఆర్డీయే కమిషనర్‌ ప్రతిపాదించిన అంశాలు ఏపీ అసైన్డ్‌ చట్టం-1977 (పీఓటీ)పై ప్రభావం చూపిస్తాయని, ఈ సమస్యను నివారించేందుకు ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ శాఖ అభిప్రాయపడింది. ఇదే అంశాలను కోట్‌ చేస్తూ, రిమార్క్‌లు ఇవ్వాలని సీఆర్డీయే కార్యదర్శి  తన కమిషనర్‌ను ఆదేశించారు.


అయితే, పీఓటీ చట్టంపై రిమార్కులకు బదులుగా ఇంతకు ముందు తానే చేసిన ప్రతిపాదనలనే రూల్స్‌లో చేరుస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని సీఆర్డీయే  కమిషనర్‌ 2016 జనవరి 13న మరోసారి కోరారు. చివరకు 2016 ఫిబ్రవరి 17న పురపాలక శాఖ జీవో ఇచ్చింది! ఇదీ దీని వెనుక జరిగిన కసరత్తు! ఈ జీవోను అధికారుల స్థాయిలోనే జారీ చేశారు. ఆ తర్వాత 32 రోజులకు (2016 మార్చి 22న) నాటి సీఎంతో ర్యాటిఫై చేయుంచుకున్నారు. ఇదంతా సీఐడీ ప్రాథమిక నివేదికలో ఉన్న విషయమే! రూల్స్‌ మార్చాలనిగానీ, ఫలానా విధంగా ఉండాలనిగానీ చంద్రబాబు లేదా నారాయణ అధికారులపై ఒత్తిడి  చేసినట్లుగా సీఐడీ నివేదికలో ఎక్కడా లేదు. రెవెన్యూశాఖ అభ్యంతరాలకు తగిన పరిష్కారం చూపకుండానే అధికారుల స్థాయిలోనే జీవో ఇచ్చారన్న విషయం సీఐడీనే చెబుతోంది. మరి ఇందులో చంద్రబాబు, నారాయణ కలిసి చేసిన నేరం ఏమిటి? 


వైసీపీ సర్కారు చేసిందేమిటి?

పేదలకు ఇళ్ల స్థలాల పేరిట ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్‌ భూములను సేకరించింది. అధికారులు పోలీసుల సహాయంతో పంటలను దున్ని మరీ భూములు లాక్కున్నారు. ఇదే ఇళ్ల స్థలాల కోసం విశాఖపట్నంలో సుమారు 6 వేల ఎకరాలు ‘సమీకరించారు’. ఇక్కడ మాత్రం అసైన్డ్‌ భూములకు అమరావతి తరహాలోనే ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో నెంబరు 72 జారీ చేశారు. అంతకుముందే... ఇక్కడ కూడా దళారులెవరైనా రంగ ప్రవేశం చేసి అసైన్డ్‌ భూములు తీసుకోలేదని కచ్చితంగా ఎవరూ చెప్పలేరు! మరి... ఇలాంటి వారికి మేలు చేసేందుకే ప్రభుత్వం జీవో 72 జారీ చేసిందా? ఇందులోనూ కుట్ర ఉందా? నేటి ప్రభుత్వ పెద్దలపైనా సీఐడీ కేసు పెడుతుందా? ఇవి తెలుగుదేశం నేతలు సంధిస్తున్న ప్రశ్నలు! నాడు జారీ చేసిన జీవో 41 తప్పయితే... నేటి జీవో 72 కూడా తప్పేనని వారు వాదిస్తున్నారు.


సవరణలు చేయొద్దా?

సీఆర్డీయే రూల్స్‌కు అసెంబ్లీ ఆమోదం తీసుకోలేదని సీఐడీ కొత్త వాదన లేవనెత్తింది. నిజానికి.. చట్టంలో మార్పులు చేయాలనుకుంటేనే అసెంబ్లీ ఆమోదం తీసుకుంటారు. కానీ... రూల్స్‌కు అసెంబ్లీ ఆమోదం అవసరం లేదు. ఒక వేళ రూల్స్‌ను కూడా చట్టంలో చేర్చాలనుకుంటేనే అప్పుడు సవరణ బిల్లును పెట్టి ఆమోదం పొందాలి. 


తప్పు ఎవరిది.. అసలు తప్పేమిటి?

అమరావతి కోసం చేపట్టిన భూసమీకరణ కోర్టు కేసుల్లో చిక్కుకోకూడదని, ఈ విషయంలో జాప్యం జరగకూడదని నాటి సర్కారు భావించింది. రైతులను ఒప్పించి, మెప్పించి తగిన ప్యాకేజీ ఇచ్చి అమరావతి పనులు సజావుగా సాగడానికి  అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భూ సమీకరణ రూల్స్‌ కూడా ఉన్నాయి. దీనికోసం అధికారులకూ నాటి ప్రభుత్వం తగిన స్వేచ్ఛనిచ్చింది. ఈ రూల్స్‌ను రూపొందించింది అధికారులే.  జీవో జారీ చేశాక, 32 రోజుల ఆలస్యంతో ప్రభుత్వం వాటిని ర్యాటిఫై చేసింది. చంద్రబాబు ఆమోదం లేకుండానే అధికారుల స్థాయిలో జీవో ఇచ్చారని సీఐడీయే చెబుతోంది. ఇలాంటప్పుడు... చంద్రబాబు, పి.నారాయణ చేసిన తప్పేమిటి? వారిని ఏ1, ఏ2లుగా ఎలా చేర్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


సీఐడీకి ఫిర్యాదు సరైనదేనా?

‘నా నియోజకవర్గానికి చెందిన కొందరు రైతులు తాము నష్టపోయామని వినతిపత్రం ఇచ్చారు’ అని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇప్పుడు చెబుతున్నారు. నిజానికి... సీఆర్‌డీఏ చట్టం అమలుకు ఉపయోగపడే రూల్స్‌ కోసం జరిగిన సవరణలో తప్పులున్నా, ఎవరికైనా అయాచిత ప్రయోజనాలు కల్పించే అంశాలున్నాయని భావించినా...  అప్పుడే కోర్టులో సవాల్‌ చేయాలి. ఆ విషయాలను ఇప్పుడు ఆలస్యంగా గ్రహించినట్లయితే... ఇప్పుడైనా కోర్టు దృష్టికి తీసుకెళ్లవచ్చు. అలా కాకుండా ప్రభుత్వంలో అంతర్భాగమైన సీఐడీకి ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే కేసు నమోదు చేయడంతో ప్రభుత్వ ఉద్దేశాలపై సందేహాలు తలెత్తుతున్నాయి.

Updated Date - 2021-03-19T08:30:46+05:30 IST