సీఐడీ ‘సెకండ్‌ వేవ్‌’

ABN , First Publish Date - 2022-06-07T08:49:46+05:30 IST

మరో ‘వేవ్‌’ వచ్చింది. మళ్లీ ‘కేసులు’ పెరుగుతున్నాయి! అయితే... ఇవి కరోనా కేసులు కాదండోయ్‌..

సీఐడీ ‘సెకండ్‌ వేవ్‌’

  • సోషల్‌ మీడియా పోస్టులపై
  • మళ్లీ కేసులు, వేధింపులు
  • ఫార్వర్డ్‌ చేసినా వదలకుండా విచారణ
  • నేతల పేర్లు చెప్పాలంటూ ఒత్తిడి
  • ‘మహానాడు’ తర్వాత మరోసారి టార్గెట్‌


(అమరావతి - ఆంధ్రజ్యోతి): మరో ‘వేవ్‌’ వచ్చింది. మళ్లీ ‘కేసులు’ పెరుగుతున్నాయి! అయితే... ఇవి కరోనా కేసులు కాదండోయ్‌! సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ పెడుతున్న కేసులు! వైసీపీ విపక్షంలో ఉండగా చంద్రబాబు సర్కారుపై సోషల్‌ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేసింది. కానీ... తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ‘యుద్ధం’ మొదలుపెట్టింది. మహిళలు, వృద్ధులు అనే తేడాలేకుండా... అనేక మందిపై కేసులు పెట్టింది. తర్వాత కొన్నాళ్లపాటు ఈ కేసులకు కాస్త బ్రేక్‌ పడింది. తాజాగా... మహానాడు తర్వాత సీఐడీ ‘సెకండ్‌ వేవ్‌’ మొదలుపెట్టింది. అమ్మఒడి, వాహన మిత్ర అనే రెండు పథకాలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల సోషల్‌ మీడియాలో ఎవరో పోస్టు పెట్టారు. ఇది ‘ఫేక్‌’ అని తెలుసుకునేలోపే వైరల్‌గా మారింది. దీనిని పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఫార్వర్డ్‌ చేశారు. అంతే... సీఐడీ రంగంలోకి దిగింది. గతంలోలాగా అర్ధరాత్రి నోటీసులు ఇవ్వడం, విచారణకు  రావాలని పిలవడం మొదలైంది.


 ఈ పోస్టు వెనుక టీడీపీ అగ్రనేతలు ఉన్నారని చెప్పాలంటూ సీఐడీ అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు బాధితులు ఆరోపించారు. దీనికి సంబంధించి పన్నెండు మందిపై కేసులు నమోదు చేశారు. తెనాలికి చెందిన యువతికి సీఐడీ పోలీసులు అర్ధరాత్రి నోటీసు ఇచ్చారు. పల్నాడు, గుంటూరు, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన వారిని సీఐడీ కార్యాలయానికి పిలిచి రాత్రి వరకూ ప్రశ్నించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అనుచరుడు వెంకటేశ్‌ను కూడా విచారణకు పిలిపించారు. ఈ సోషల్‌ మీడియా పోస్ట్‌ వెనుక అచ్చెన్నాయుడు ఉన్నారని చెప్పాల్సిందిగా ఒత్తిడి తెచ్చినట్లు టీడీపీ ఆరోపించింది. ఇదే కేసులో శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీషకు నోటీసులిచ్చిన సీఐడీ అధికారులు సోమవారం ఆమెను విచారణకు పిలిచారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఫేక్‌ ప్రెస్‌ నోట్‌ సృష్టించింది తానేనని అంగీకరించాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు ఆమె వెల్లడించారు. దానిని ఎవరో పంపితే ఫార్వర్డ్‌ చేశానని చెప్పినా వినిపించుకోకుండా ఏడు గంటలకు పైగా ఇబ్బంది పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి... అసలు నిందితులను గుర్తించే అవకాశం ఉంది. అయినాసరే... ప్రతి పక్షాన్ని ఏదో విధంగా వేధించాలనే ఉద్దేశంతోనే తమ నేతలను టార్గెట్‌ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది.


వైసీపీ మైండ్‌ గేమ్‌..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో టీడీపీతోపాటు అమరావతి రైతులు, ప్రజా సంఘాలు, ప్రశ్నించిన సామాన్యులపై సీఐడీ బాగా గురిపెట్టింది. ఎంపీ రఘురామరాజు అరెస్టు ఎపిసోడ్‌ తర్వాత.. కొంచెం కేసుల ఉద్ధృతిని తగ్గించింది. ఇప్పుడు మళ్లీ జోరు పెంచినట్లు కనిపిస్తోంది. అది కూడా ఇటీవల ‘మహానాడు’ విజయవంతమైన తర్వాతే కావడం గమనార్హం. టీడీపీ మహానాడుకు బస్సులు అందుబాటులో లేకుండా చేశారు. వాహనాలు దొరక్కుండా చూశారు. అయినా సరే... టీడీపీ అభిమానులు ట్రాక్టర్లు, బైకులపై భారీ స్థాయిలో మహానాడుకు, బహిరంగ సభకు తరలి వచ్చారు. సభలో తమ నేతలు, కార్యకర్తలు మాట్లాడిన తీరు చూసిఅధికార వైసీపీ.... సీఐడీ కేసుల పేరుతో ‘మైండ్‌ గేమ్‌’ ఆడుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసుల పెట్టి... విచారణలతో భయపెడితే టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గుతాయన్నదే వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు.


ప్రతిపక్షాన్ని దూషిస్తే ‘నో కేసు’

ప్రభుత్వానికి, అధికారపక్షానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ఫార్వర్డ్‌ చేసినా కేసులు పెట్టే పోలీసులు... ప్రతిపక్ష నేతలపై సోషల్‌ మీడియాలో జరిగే దాడిని ఏమాత్రం పట్టించుకోరు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన గౌతు శిరీషను మంగళగిరికి పిలిపించి మరీ ఏడు గంటలు ప్రశ్నించారు. కానీ... రాజమహేంద్రవరం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై స్పందనే లేదు. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం పాడు చేస్తోందంటూ అసెంబ్లీలో మాట్లాడిన ఆమెను... ‘నువ్వు తాగేది ఏ బ్రాండ్‌’ అంటూ సోషల్‌ మీడియాలో కొందరు హేళన చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో అసెంబ్లీలో స్పీకర్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌పై పెట్టే పోస్టులు దారుణంగా ఉంటాయి. వ్యక్తిగత దూషణలకు దిగుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలే చౌకబాబు పోస్టులు పెడుతుంటారు. వైసీపీలో కీలక నాయకుడైన విజయసాయిరెడ్డి చంద్రబాబుపై పెట్టే పోస్టులు చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంటాయి. అయినా... సీఐడీ అధికారులు పట్టించుకోరు. న్యాయమూర్తులను, న్యాయ వ్యవస్థను తిట్టిపోసినా దిక్కులేకుండా పోయింది. చివరికి... హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగాల్సి వచ్చింది.

Updated Date - 2022-06-07T08:49:46+05:30 IST