రుయా, మెటర్నిటీ ఆస్పత్రుల్లో సీఐడీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-11T07:10:23+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు తిరుపతిలోని రుయా, మెటర్నిటీల్లోనూ శనివారం సీఐడీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది.

రుయా, మెటర్నిటీ ఆస్పత్రుల్లో సీఐడీ తనిఖీలు
తనిఖీలు చేస్తున్న సీఐడీ అధికారులు

వైద్య పరికరాల వినియోగంపై రికార్డుల పరిశీలన


తిరుపతి (వైద్యం), ఏప్రిల్‌ 10: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు తిరుపతిలోని రుయా, మెటర్నిటీల్లోనూ శనివారం సీఐడీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా సీఐడీ తిరుపతి డివిజన్‌ డీఎస్పీ భాస్కర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 1315 ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, ఏహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జీజీహెచ్‌సీల్లో వినియోగిస్తున్న బయోమెట్రిక్‌ వైద్య పరికరాలు, వాటి కొనుగోలుపై పలు ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు. దీనిపై సీఐడీ హెడ్‌ క్వార్టర్స్‌లో కేసు నమోదైందన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము తిరుపతి, చిత్తూరు, కడప పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో  తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. ముందుగా రుయా, మెటర్నిటీ ఆస్పత్రుల్లోని ఆపరేషన్‌ థియేటర్లు, ల్యాబ్‌లలో తనిఖీలు చేశామన్నారు. ఇంకా శ్రీకాళహస్తి, రేణిగుంట, చంద్రగిరి తదితర ఆస్పత్రుల్లో రేపు, ఎల్లుండి తనిఖీలు ఉంటాయన్నారు. ముఖ్యంగా 2015-18 మధ్య కాలంలో వైద్యశాఖ కొనుగోలు చేసిన వైద్య పరికరాలు, టెండరు ద్వారా కేటాయించినవి వినియోగిస్తున్నారా? లేదా? సంబంధించిన వివరాలను పరిశీలించామన్నారు. డీఎస్పీ పద్మలత, గిరిధర్‌, రవికుమార్‌, ఇన్‌స్పెక్టర్లు ఎంవీ రమణ, పార్థసారథి, భాస్కర్‌ నాయక్‌, చంద్రశేఖర్‌తోపాటు ఆరుగురు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-11T07:10:23+05:30 IST