టౌన్‌ బ్యాంకు గోల్‌మాల్‌పై సీఐడీ విచారణ

ABN , First Publish Date - 2021-10-26T04:35:48+05:30 IST

పట్టణంలోని కో-ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకులో జరిగిన గోల్‌మాల్‌పై తిరుపతికి చెందిన సీఐడీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి, వారి సిబ్బంది విచారణ చేపట్టారు.

టౌన్‌ బ్యాంకు గోల్‌మాల్‌పై సీఐడీ విచారణ
కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకులో విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 25: పట్టణంలోని  కో-ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకులో జరిగిన గోల్‌మాల్‌పై తిరుపతికి చెందిన సీఐడీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి, వారి సిబ్బంది విచారణ చేపట్టారు. ముందుగా 2017 సంవత్సరంలో పనిచేసిన అప్పటి బ్యాంకు మేనేజర్‌ బాలాజీ, అప్పటి పాలక మండలి ఛైర్మన్‌ తాతిరెడి ్డ హృషికేశవరెడ్డిలను విచారించినట్లు డీఎస్పీ భాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు కో-ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకులో విచారణ చేపట్టారు. కాగా సాయంత్రం 4 గంటల వరకు పట్టణంలోని బాధితులు బ్యాంకు సొసైటీ వద్దకుచేరుకుని సంబంధిత అధికారులకు వారికి జరిగిన అన్యాయంపై వాపోయారు. జమ్మలమడుగు కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకులో 2017 సెప్టెంబరులో రూ.3.50 కోట్లు గోల్‌మాల్‌ జరిగింది. అప్పట్లో పాలక మండలి సభ్యులు పది మంది ఉన్నారని, అందులో పనిచేసే సిబ్బంది ఆరు మంది, మరో ఇద్దరు ఏజెంట్లు ఉన్నట్లు బాధితులు తెలిపారు. అప్పట్లో విచారణ వేగవంతం జరిగినప్పటికి అప్పటి పాలక మండలి ఛైర్మన్‌కు సంబందించిన కొన్ని ఆస్తులకు కోఆపరేటివ్‌ సొసైటీ ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చినట్లు విచారణ అధికారి తెలిపారు. ఏది ఏమైనా విచారణ త్వరగా పూర్తి చేసి తమకు న్యాయం చేయాలని  బాధితులు విన్నవించారు. ఈ సందర్భంగా డీఎస్పీ భాస్కర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ సమస్య సుమారు అయిదు సంవత్సరాలు అయిందని, ప్రస్తుతం ఈ కేసును తనకు అప్పగించారని అందుకే నేరుగా బాధితులతో పాటు అప్పటి పాలక మండలి సభ్యులతో విచారణ చేపట్టామన్నారు. విచారణలో కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకు సిబ్బంది అప్పటి పాలక మండలి ఛైర్మన్‌పైనే గోల్‌మాల్‌పై ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు పట్టణానికి చెందిన బాధితులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T04:35:48+05:30 IST