ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీఐడీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-11T09:01:04+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో శనివారం సీఐడీ తనిఖీలు చేపట్టింది. కృష్ణా, చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ తనిఖీలు కొనసాగాయి.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీఐడీ తనిఖీలు

తిరుపతి(వైద్యం)/ విజయవాడ, ఏప్రిల్‌ 10: ప్రభుత్వ ఆస్పత్రుల్లో శనివారం సీఐడీ తనిఖీలు చేపట్టింది. కృష్ణా, చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. చిత్తూరు జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుతో పాటు తిరుపతిలోని రుయా, మెటర్నిటీ ఆస్పత్రుల్లో సీఐడీ తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా సీఐడీ తిరుపతి డివిజన్‌ డీఎస్పీ భాస్కర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 1,315 ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగిస్తున్న బయోమెట్రిక్‌ వైద్య పరికరాలు, వాటి కొనుగోలుపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై కేసు నమోదైందని తెలిపారు. ఈ నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోని అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టినట్టు చెప్పారు.


వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు 2015-18 మధ్య కొనుగోలు చేసిన వైద్య పరికరాలు, టెండరు ద్వారా కేటాయించిన పరికరాలు ఆస్పత్రుల్లో వినియోగిస్తున్నారా? అసలు కొనుగోలు చేసిన పరికరాలనే వాడుతున్నారా? మరేవైనా వాడుతున్నారా? ఇన్వాయిస్‌, పరికరాలకు సంబంధించిన వివరాలు, ధరలు రికార్డుల్లో కరెక్టుగా ఉన్నాయా? వంటి వివరాలను తనిఖీ చేసినట్టు వివరించారు. కృష్ణా జిల్లాలో ఉన్న పలు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో సీఐడీ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు.


తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న 2015-16 మధ్య కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు అవసరమైన వైద్య సామగ్రిని కొనుగోలు చేశారు. ఇందులో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగా విజయవాడ ప్రాంతీయ సీఐడీ అధికారులు జిల్లాలో పలు ఆస్పత్రుల్లో పరిశీలన చేశారు. జిల్లాలో మొత్తం 105 ఆస్పత్రులకు ఈ తరహా సామగ్రి వచ్చింది. ఇలా కొనుగోలు చేసిన సామగ్రిని ఉపయోగిస్తున్నారా, ఎక్కడైనా మూలన పడేశారా, వాటి సర్వీసింగ్‌, బిల్లులు తదితరు అంశాలపై ఆరా తీశారు. 

Updated Date - 2021-04-11T09:01:04+05:30 IST