సీఐల బదిలీలు వివాదాస్పదం!

ABN , First Publish Date - 2020-08-10T10:10:43+05:30 IST

జిల్లాలో సీఐల బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీఐల బదిలీలు..

సీఐల బదిలీలు వివాదాస్పదం!

సీఎం దృష్టికి పట్టాభిపురం ఎస్‌ఐ వీఆర్‌ వ్యవహారం

ఐజీని వివరణ అడిగిన డీజీపీ

తనకు చెప్పకుండా బదిలీలు చేయెద్దని డీజీపీ ఆదేశం

కుమారుడి నిశ్చితార్దానికై ఆరు రోజులు సెలవులో ఐజీ

 

గుంటూరు, ఆగస్టు 9: జిల్లాలో సీఐల బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీఐల బదిలీలు.. పోస్టింగ్స్‌ విషయంలో మితిమీరిన రాజకీయజోక్యం అటు అధికార పార్టీ, ఇటు పోలీస్‌ వర్గాల్లోనూ చిచ్చురేపుతోంది.  ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటం ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఇటీవల పట్టాభిపురం సీఐ కళ్యాణరాజును వీఆర్‌కు పంపిన వ్యవహారం అధికార పార్టీలో చిచ్చురేపింది. ఆయనను వీఆర్‌కు పంపాలని ఓ కీలక మంత్రి ఆదేశించడంతో ఐజీ ప్రభాకర్‌ ఆమేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు పోలీస్‌వర్గాలు అంటున్నాయి. అయితే ఆయనకు పట్టాభిపురం పోస్టింగ్‌ ఇప్పించిన పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి ఈ వ్యవహారం ఆగ్రహాన్ని తెప్పించింది. వీఆర్‌ వేటును రద్దు చేసి ఆయనను అక్కడే కొనసాగించాలని ఆ ప్రజాప్రతినిధి తీవ్రంగా శ్రమించినట్లు తెలిసింది.


అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో సదరు ప్రజాప్రతినిధి ఈ విషయాన్ని నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. దీంతో జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. దీనిపై డీజీపీకి కూడా సీఎం తగు ఆదేశాలు జారీ చేసినట్లు తెలియవచ్చింది. దీంతో డీజీపీ గౌతం సవాంగ్‌.. కళ్యాణరాజు వ్యవహారంలో ఏం జరిగిందని ఐజీని వివరణ అడిగినట్లు పోలీస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ కీలక ప్రజాప్రతినిధి సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐజీ వివరించినట్లు తెలిసింది. అంతేగాక స్టేషన్‌ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో  రూ.కోటికిపైగా నగదు అదృశ్యం అయిన వ్యవహారంలో నమోదైన కేసులో సీఐ వ్యవహరించిన తీరుపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలోనే ఆయనపై వేటు పడినట్లు ఉన్నతాధికారులు అంటుననప్పటికీ దానితో పాటు ఆ సీఐ వ్యవహారంలో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా అసంతృప్తితో ఉన్నట్లు పోలీస్‌ వర్గాలు అంటున్నాయి. కీలక ప్రజాప్రతినిధి ఫోన్‌ చేసినప్పుడు ఆయన సరిగా స్పందించలేదనే కారణంగానే ఆయనపై వేటు పడినట్లు ప్రచారం జరుగుతోంది. 


ఒక నియోజకవర్గంలో మరో ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుంటుండటం కూడా వివాదాస్పదంగా మారుతోంది. ఎమ్మెల్యేలు ఉన్నచోట వారిని సంప్రదించే ఇతర ప్రాంతాల ప్రజాప్రతినిధులు తమవారికి పోస్టింగ్స్‌ ఇప్పించుకుంటున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలు అప్పటికప్పుడు కాదనలేకపోయినా తమ నియోజక వర్గంలో వేరే వారు పోస్టింగ్స్‌ ఇప్పించుకోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. వైసీపీ  ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలైన గుంటూరు పశ్చిమ, రేపల్లె వంటి చోట్ల పోస్టింగ్స్‌ వ్యవహారాల్లో పలువురి జోక్యంతో సమస్యలు వస్తున్నాయంటున్నారు. అందులో భాగంగానే పట్టాభిపురం సీఐ కళ్యాణరాజు వ్యవహారం వివాదాస్పదమైనట్లు అంటున్నారు. ఇటీవల వెస్ట్‌లో ఓ సీఐని బదిలీ చేసి మరొకరికి పోస్టింగ్‌ ఇచ్చిన విషయం వివాదాస్పదం అయింది. తనకు తెలియకుండా బదిలీ చేశారంటూ స్థానిక ఇన్‌చార్జ్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరిక్షణంలో బదిలీ నిలిపివేశారు. 


అంతేగాక ఇటీవల వెస్ట్‌లో నగరంపాలెం, వెస్ట్‌ ట్రాఫిక్‌ సీఐలను బదిలీ చేయడాన్నికూడా పోలీస్‌ వర్గాలు తప్పు పడుతున్నాయి. సమర్ధంగా పని చేస్పున్న వారిని అకారణంగా బదిలీ చేయడమే గాక వీఆర్‌కు పంపడాన్ని పోలీస్‌ వర్గాలు తప్పు పడుతున్నాయి. ట్రాఫిక్‌ సీఐ వాసు, నగరంపాలెం సీఐ కోటేశ్వరరావుల బదిలీలు పోలీస్‌ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. వేరొకరికి పోస్టింగ్‌ ఇవ్వడం కోసం వివాదరహితంగా పని చేస్తున్న వారిని ఎలా బదిలీ చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎవరెన్ని సిఫార్సులు చేసినా పోలీస్‌ ఉన్నతాధికారులు మాత్రం స్థానిక ఎమ్మెల్యే, లేదంటే ఇన్‌చార్జ్‌ల సిఫార్సులు ఉండాలనే నిబంధన విధించినట్లు తెలిసింది.


 ఆరు రోజులు సెలవులోకి ఐజీ

రేంజ్‌ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకరరావు కుమారుడికి, మెగా బ్రదర్స్‌ నాగబాబు కుమార్తెకు వివాహం నిశ్చయమైన విషయం విదితమే. దీంతో ఆరు రోజులు సెలవు పెట్టి ఐజీ శనివారం రాత్రే హైదరాబాద్‌ వెళ్ళారు. సీఐ కళ్యాణరాజు వ్యవహారం వివాదాస్పదంగా మారడం, డీజీపీ దృష్టి సారించిన నేపథ్యంలో సీఐల బదిలీల విషయంలో ఐజీ వెనకడుగు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు చెప్పకుండా సీఐల పోస్టింగ్స్‌ వేయవద్దని డీజీపీ కూడా ఆదేశించినట్లు సమాచారం.  ఐజీ ప్రభాకరరావు ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. అయితే ఆయన పదవీ కాలాన్ని మరికొంతకాలం పొడిగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-08-10T10:10:43+05:30 IST