Chintakayala Vijay: నాన్‌బెయిలబుల్ కేసులు పెడతానంటూ.. టీడీపీ నేతలను బెదిరించిన సీఐ

ABN , First Publish Date - 2022-10-03T21:27:52+05:30 IST

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు జయ్‌రామ్ చంద్రపై బంజారహిల్స్ పోలీస్ స్టేషన్‌ (Banjara Hills Police Station)లో కేసు నమోదు చేశారు

Chintakayala Vijay: నాన్‌బెయిలబుల్ కేసులు పెడతానంటూ.. టీడీపీ నేతలను బెదిరించిన సీఐ

హైదరాబాద్: తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు జయ్‌రామ్ చంద్రపై బంజారహిల్స్ పోలీస్ స్టేషన్‌ (Banjara Hills Police Station)లో కేసు నమోదు చేశారు. అంతేకాదు తెలుగు యువత కార్యకర్తలను పీఎస్‌లో కూర్చోబెట్టారు. దీంతో బంజారాహిల్స్ పీఎస్ దగ్గర తెలుగు యువత కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అలాగే తనను ఏపీ సీఐడీ పోలీసులు కొట్టి దూషించారంటూ.. ఫిర్యాదు చేయడానికి చింతకాయల విజయ్ డ్రైవర్, తెలుగు యువత నేతలు బంజారహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. 


ఐటీడీపీ కో-కన్వీనర్‌ చింతకాయల విజయ్‌ (Chintakayala Vijay) ఇంటి వద్ద ఏపీ సీఐడీ పోలీసులు హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి... డ్రైవర్‌ను కొట్టి, ఇంట్లోకి ప్రవేశించి, పిల్లలను, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని ఓ అపార్ట్‌మెంట్‌లో విజయ్‌ నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం 11గంటల సమయంలో నలుగురు వ్యక్తులు మఫ్టీలోనే అక్కడికి వచ్చారు. మెడలో బ్యాడ్జీలూ, గుర్తింపుకార్డులూ లేవు. వచ్చీ రాగానే... విజయ్‌ ఎక్కడున్నారని సెల్లార్‌లో ఉన్న ఆయన డ్రైవర్‌ చంద్రను ప్రశ్నించారు. విజయ్‌ దంపతులు ఇంట్లో లేరని ఆయన బదులిచ్చారు.


పైకి వెళ్లి చూస్తామనడంతో... డ్రైవర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సీఐడీ పోలీసులు (CID Police) డ్రైవర్‌ చెంపమీదకొట్టి విజయ్‌ ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో విజయ్‌ పిల్లలు(ఐదేళ్ల పాప, రెండేళ్ల కుమారుడు), ఇద్దరు పనిమనుషులు మాత్రమే ఉన్నారు. వచ్చిన నలుగురిలో ఇద్దరు పనిమనిషిని ప్రశ్నిస్తుండగా... మరో ఇద్దరు ఇళ్లంతా గాలించారు. బీరువాలు, కప్‌బోర్డుల్లో వెతికారు. సామాన్లు చిందర వందర చేశారు. పనిమనుషులను దుర్భాషలాడారు. నలుగురు వ్యక్తులు వచ్చి తనను కొట్టి ఇంట్లోకి వెళ్లారని డ్రైవర్‌ చెప్పడంతో... స్థానికులు అక్కడికి చేరుకున్నారు. 

Updated Date - 2022-10-03T21:27:52+05:30 IST