సీఐని సస్పెండ్‌ చేయండి

ABN , First Publish Date - 2022-06-25T06:55:05+05:30 IST

చిత్తూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ వద్ద శుక్రవారం టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.

సీఐని సస్పెండ్‌ చేయండి
ధర్నాలో డీఎస్పీ సుధాకర్‌రెడ్డితో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

మాజీ మేయరుపై జీపు ఎక్కించడాన్ని నిరసించిన టీడీపీ నాయకులు

చిత్తూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ వద్ద  ధర్నా


చిత్తూరు, జూన్‌ 24: చిత్తూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ వద్ద శుక్రవారం టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. మాజీ మేయర్‌ కఠారి హేమలత అనుచరుడిపై గురువారం రాత్రి గంజాయి కేసు పెట్టడానికి వెళ్లిన పోలీసుల తీరుకు నిరసన తెలిపిన ఆమెపై జీపును ఎక్కించిన సీఐ యతీంద్రను సస్పెండ్‌ చేయాలని డిమాండు చేశారు.  సీఐ తీరును నిరసిస్తూ నినదించారు. టీడీపీ శ్రేణుల ఆందోళనతో పెద్దఎత్తున పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుని వాహనాల్లోకి ఎక్కించారు. అప్పటికే ఎస్పీని కలిసి మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు నాని, వసంత్‌కుమార్‌ తదితరులు రెండో పట్టణ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులున్న పోలీసు వాహనాలను పార్టీ నేతలు అడ్డుకున్నారు. అందులోని కార్యకర్తలను కిందకు దించేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన మీరే రౌడీల్లాగా వ్యవహరిస్తుంటే చూస్తు ఊరుకోవాలా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకుల ధర్నాతో చిత్తూరు- పలమనేరు రోడ్డులో కొంతసేపు వాహనాల రాకపోకలు ఆగాయి. 


హేమలతతో పాటు 15 మందిపై కేసు 

పోలీస్‌ విధులకు గురువారం రాత్రి ఆటంకం కలిగించడంతో పాటు మరికొన్ని కారణాలపై మాజీ మేయర్‌ కఠారి హేమలత, మరో 14 మందిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరుకు చెందిన ప్రసన్న, పూర్ణ గంజాయి అమ్ముతున్నారని తమకు సమాచారం వచ్చినట్లు సీఐ యతీంద్ర తెలిపారు. గురువారం రాత్రి వారిని అదుపులోకి తీసుకుని, 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అక్కడ నుంచి బయలుదేరిన పోలీసులను అడ్డుకోవడంతో పాటు వాహనాన్ని ధ్వంసం చేయడం, సిబ్బందిపై దాడికి యత్నించిన ఘటనలో మాజీ మేయర్‌ కఠారి హేమలత, కంద, కిశోర్‌, గోపి, లావణ్య, జ్యోతి తదితర 15 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. 

Updated Date - 2022-06-25T06:55:05+05:30 IST