‘పెళ్లి చేసుకుందాం.. నీ భర్తకు విడాకులివ్వు’ అని చెప్పి.. చివరకు పోలీసు చేసిన నిర్వాకమిది!

ABN , First Publish Date - 2020-02-19T08:22:27+05:30 IST

రేంజ్‌ పరిధిలో ఓ సీఐ, ఇద్దరు ఎస్‌ఐలతోపాటు మరో నలుగురు సిబ్బందిని విధు ల నుంచి సస్పెండ్‌చేస్తూ మంగళవారం సౌత్‌ కోస్టల్‌జోన్‌

‘పెళ్లి చేసుకుందాం.. నీ భర్తకు విడాకులివ్వు’ అని చెప్పి.. చివరకు పోలీసు చేసిన నిర్వాకమిది!

  • సీఐ, ఇద్దరు ఎస్‌ఐల సస్పెన్షన్‌
  • మరో నలుగురు సిబ్బంది కూడా
  • వివాహేతర సంబంధం, అవినీతి, నిర్లక్ష్యపు విధులే కారణం

గుంటూరు(ఆంధ్రజ్యోతి): రేంజ్‌ పరిధిలో ఓ సీఐ, ఇద్దరు ఎస్‌ఐలతోపాటు మరో నలుగురు సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్‌చేస్తూ మంగళవారం సౌత్‌ కోస్టల్‌జోన్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఆదేశాలు జారీచేశారు. ఓ యువతిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి వంచించిన ఘటనలో నగరంపాలెం సీఐ కె.వెంకటరెడ్డిని సస్పెండ్‌చేశారు. నెల్లూరు జిల్లాలో ఎస్‌ఐగా పనిచేస్తున్న సమయంలో అతనికి ఓ వివాహిత పరిచయం అయ్యింది. మీ భర్తకు విడాకులు ఇస్తే తన భార్యకు కూడా విడాకులు ఇస్తానని ఇద్దరం పెళ్ళి చేసుకుందామని నమ్మించాడు. నిజమేనని నమ్మిన ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. ఎస్‌ఐ మాత్రం తన భార్యకు విడాకులు ఇవ్వకుండా ఆమెతో సహజీవనం సాగిస్తూ వచ్చాడు. ఆ తరువాత ఆయనకు సీఐగా ఉద్యోగోన్నతి రావడంతో  నగరంపాలెం స్టేషన్‌కు సీఐగా నియమితులయ్యారు. అప్పటినుంచి ఆమెను నగరంలోనే ఉంచుతూ సహజీవనం సాగిస్తున్నాడు. పెళ్ళి చేసుకుంటానని మోసంచేసిన సీఐపై ఆమె అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అర్బన్‌ ఎస్పీ ఆదేశాల మేరకు వెస్ట్‌ డీఎస్పీ బీవీ రామారావు విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. ఆమెను పెళ్ళి చేసుకుంటానని మోసంచేసింది వాస్తవమేనని నివేదిక ఇవ్వడంతో ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ సీఐ వెంకటరెడ్డిని సస్పెండ్‌చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. 


ప్రకాశం జిల్లా ఉలవపాడు ఎస్‌ఐ బి.శ్రీకాంత్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రకాశం జిల్లా ఎస్పీ విచారణ జరిపించిన అనంతరం నివేదిక ఇవ్వడంతో ఎస్‌ఐ శ్రీకాంత్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐసహా ఐదుగురిని విధుల నుంచి సస్పెండ్‌చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీచేశారు. అత్యాచారం కేసులో నిందితుడు స్టేషన్‌ నుంచి పారిపోయాడు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని విచారణలో తేలింది. దీంతో ఎస్‌ఐ ముత్యాలరావు, హెడ్‌కానిస్టేబుల్‌ వై.రామయ్య, కానిస్టేబుళ్ళు బి.సురేష్‌, ఎం.నారాయణ, పి.వెంకటేశ్వర్లు తదితరులను సస్పెండ్‌చేసినట్లు ఐజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు విభాగం వృత్తిపరమైన అత్యున్నత ప్రమాణాలు పాటించాలన్నారు. సమాజం అంచనాలకు అనుగుణంగా విధులు నిర్వహిం చాలన్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తప్పు చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణాచర్యలు తీసుకున్నామన్నారు. శాఖాపరమైన విచారణ అనంతరం తుది నివేదిక ఆధారంగా వారిపై చర్యలు చేపట్టినట్లు ఐజీ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-02-19T08:22:27+05:30 IST