దళారీలకు దేహశుద్ధి

ABN , First Publish Date - 2022-08-09T06:40:16+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయం పరిసరాల్లో భక్తులను మోసగించే పలువురు దళారీలను సీఐ అంజుయాదవ్‌ పట్టుకున్నారు.

దళారీలకు దేహశుద్ధి
తనిఖీలుచేస్తున్న సీఐ అంజుయాదవ్‌

అడ్డదారి వ్యవహారాలు అడ్డగింత

40మంది నకిలీ నేతిదీపాల విక్రేతలపై కేసు నమోదు

శ్రీకాళహస్తి, ఆగస్టు 8: శ్రీకాళహస్తీశ్వరాలయం పరిసరాల్లో భక్తులను మోసగించే పలువురు దళారీలను సీఐ అంజుయాదవ్‌ పట్టుకున్నారు. సోమవారం వేకువజామున 2గంటల నుంచే ఆలయ పరిసరాల్లో సీఐ అంజుయాదవ్‌ భక్తురాలిగా వెళ్లి నిఘా పెట్టారు. ఈ క్రమంలో స్వామివారి రథం పక్కన భిక్షాల గాలిగోపురం సమీపంలో పెద్దఎత్తున నకిలీ నేతి దీపాలు, పసుపుదారాలు విక్రయిస్తూ రాహుకేతు సర్పదోషం పరిహారం ఇదే అంటూ మోసగిస్తున్న అక్రమార్కులను సీఐ గుర్తించారు. రూ.50 కూడా విలువ చేయని నకిలీ నేతి దీపాల సెట్టు, చెట్టుకు కట్టే పసుపుదారాలను కలిపి ఒక్కొక్కటి రూ.200 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్న వారిని పట్టుకున్నారు. భిక్షాల గాలిగోపురం వద్ద కన్నప్పగుడిని సైతం కనపడ కుండా ఏర్పాటు చేసిన చెప్పుల స్టాండ్‌ను గుర్తించి మందలించారు.  ముగ్గురు దళారీలు  భక్తులను అడ్డదారిలో దర్శనానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకుని దేహశుద్ధి చేశారు. రూ.1,500 రాహుకేతు పూజ టికెట్‌ కౌంటర్‌ వద్ద రద్దీగా ఉండడంతో ఓ  స్వీపర్‌  భక్తుల వద్ద రూ.1800 తీసుకుని అడ్డదారిలో టిక్కెట్టు తీస్తుండగా పట్టుకుని మందలించారు. ఆ తరువాత నకిలీ నేతి దీపాలు విక్రయించే 40 మందిపై  న్యూసెన్సు కేసులు నమోదు చేశారు.   

అంతర్గత బదిలీలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పలువురు ఉద్యోగులను సోమవారం ఈవో సాగర్‌బాబు అంతర్గతంగా బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.1,500 రాహుకేతు పూజా మండపంలో పనిచేసే జయకుమార్‌ అలియాస్‌ చంటి అనే అర్చుకుడిని రూ.750 మండపానికి రామకృష్ణ అర్చకులను అంజి అంజి గణపతి నుంచి రూ.750 రాహుకేతు పూజామండపానికి, దర్బా బాలసుబ్రహ్మణం అనే అర్చకుడిని రూ.750 రాహుకేతు పూజా మడపం నుంచి రూ.1,500కు, ప్రశాంత్‌ను సీనియర్‌ అసిస్టెంట్‌  పేబిల్స్‌ విభాగానికి ఇటీవల శ్రీశైలం నుంచి డిప్యూటేషన్‌పె వచ్చిన కిషోర్‌కుమార్‌రెడ్డికి ప్రోటోకాల్‌ విధులు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన కల్యాణి ని ఎస్‌ఆర్‌ విభాగానికి బదిలీ చేశారు. 

Updated Date - 2022-08-09T06:40:16+05:30 IST