Abn logo
Sep 20 2020 @ 11:16AM

ఫోన్‌పే లేదు డబ్బులు ఎక్కడికి పంపాలని ఫోన్.. షాకయిన సీఐ.. అసలు విషయమేంటో ఆరా తీస్తే..

Kaakateeya

నేను సీఐ.. డబ్బులు పంపండి!

జిల్లాలో పలువురు పోలీసు అధికారుల పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు

ప్రముఖులు, వ్యాపారులకు ఈ ఖాతాల నుంచి ఫ్రెండ్‌ రిక్వస్ట్‌లు, ఛాటింగ్‌లు

ఆ తర్వాత అవసరముంది కొంత డబ్బు పంపాలంటూ విజ్ఞప్తులు

నిజమని నమ్మి అకౌంట్‌కు పలువురు గూగుల్‌పే, ఫోన్‌పేలో లక్షల్లో చెల్లింపులు

చింతూరు డీఎస్పీ, తుని రూరల్‌ సీఐ, తిమ్మాపురం ఎస్‌ఐల పేరిట కేటుగాళ్ల కలెక్షన్లు

తనకు ఫోన్‌పే లేనందున డబ్బులు ఎక్కడికి పంపాలంటూ సీఐకి ఫోన్‌ చేసిన ఓ వ్యక్తి

సదరు పోలీసు అధికారి అవాక్కు.. ఆ ఖాతా తనది కాదంటూ అసలు ఖాతా నుంచి ఖండన

ముగ్గురు పోలీసు అధికారుల పేరుతో జరిగిన నకిలీ దందాపై ఆ శాఖలో కలకలం


(కాకినాడ-ఆంధ్రజ్యోతి):

హాయ్‌...నేను...తుని రూరల్‌ సీఐ కిశోర్‌బాబు...

ఆన్‌లైన్‌లో ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ను ఉద్దేశిస్తూ.. ఎలా ఉన్నారు..

ఎక్కడున్నారు..అర్జంట్‌గా నాకు ఓ చిన్న సహాయం చేసి పెట్టండి...

ఎదుటవ్యక్తి: చెప్పండి సర్‌...ఏం చేయాలి...

సీఐ : మీకు గూగుల్‌ పే ఉందా..

ఎదుట వ్యక్తి: ఉంది సర్‌..

సీఐ : అర్జంట్‌గా రూ.20 వేలు కావాలి

ఎదుట వ్యక్తి: ఓకే సర్‌...అకౌంట్‌ నంబర్‌ పంపండి సర్‌..

సీఐ: ఇదిగో అకౌంట్‌ నంబర్‌..డబ్బులు వేగంగా వెయ్యండి..

ఎదుట వ్యక్తి : కాసేపు ఆగి...సర్‌ మీరు అడిగిన డబ్బులు జమ చేశాను..


ఏంటిది.. తుని రూరల్‌ సీఐ.. ఎవరినో ఆన్‌లైన్‌లో డబ్బులు అడగడమేంటి అనుకుంటున్నారా? కానేకాదు... ఇలా డబ్బులు అడిగింది నిజంగా సీఐ కాదు.. ఇదంతా సోషల్‌ మీడియాలో సైబర్‌ కేటుగాళ్ల మాయ... ఏకంగా సీఐ అసలు ఫోటోతో సైబర్‌ నేరగాళ్లు ఫేస్‌బుక్‌ పేజీ సృష్టించారు. ఆయన పేరుతో సర్కిల్‌ పరిధిలో పలువురు ప్రముఖులకు ఫ్రెండ్‌          రిక్వెస్ట్‌లు పంపారు. సీఐ సర్‌ కదా అని చాలామంది రిక్వెస్ట్‌కు ఓకే చెప్పారు. ఆ తర్వాత సీఐ పేరుతో నేరగాళ్లు ఛాటింగ్‌ మొదలు పెట్టారు. ఎదుటి వ్యక్తులేమో తాము సీఐతో చాటింగ్‌ చేస్తున్నామనే ఆనందంలో మునిగిపోయారు.


అదే అదనుగా వీరి నుంచి సదరు కేటుగాళ్లు గూగుల్‌పే, ఫోన్‌పే నెంబర్‌లు పంపించి అర్జంట్‌గా అవసరం వచ్చిందంటూ చాటింగ్‌లో డబ్బులు అడిగేవారు. సీఐ అడిగిన తర్వాత కాదనలేక పలువురు నిజమనుకుని ఖాతాల్లో డబ్బులు వేశారు. ఇలా అనేకమంది లక్షల్లో మోసపోయారు. ఈయనే కాదు చింతూరు డీఎస్పీ, తిమ్మాపురం ఎస్‌ఐ పేరుతోను కేటుగాళ్లు వారి ఫోటోలతోనే పేజీలు సృష్టించి డబ్బులు భారీగా గుంజేశారు. ఇదిప్పుడు పోలీసుశాఖలో కలకలం సృష్టిస్తోంది.


జిల్లాలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాలుగా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతూ పెద్దఎత్తున జనాన్ని మోసం చేస్తున్నారు. ఇప్పటివరకు వోటీపీ అడిగి బ్యాంకు ఖాతాల్లో నగదు దోచేయడం.. గిఫ్ట్‌ వచ్చిందని.. అది అందాలంటే ముందు కొంత డబ్బులు ఇవ్వాలని గుంజేయడం.. లాటరీ తగిలింది, కొంత సొమ్ము చెప్పిన ఖాతాలో వేయాలని.. ఇలా పలురకాలుగా మోసాలకు పాల్పడ్డారు. ఇప్పుడు ఏకంగా పోలీసుశాఖనే లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. చింతూరు డీఎస్పీ ఖాదర్‌బాషా, తిమ్మాపురం ఎస్‌ఐ జె.విజయ్‌బాబు, తుని రూరల్‌ సీఐ కె.కిశోర్‌బాబుల పేరుతో నేరగాళ్లు కొన్నిరోజుల కిందట ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా పేజీ సృష్టించారు.


ఎవరికి అనుమానం రాకుండా వారి అసలు ఫోటోలు ప్రొఫైల్‌ ఫోటోలుగా పెట్టారు. వారి ఇంటి పేర్లతో పేజీ సృష్టించారు. ఆయా సర్కిల్‌ పరిధిలో రాజకీయ, వ్యాపార, ఇతర ప్రముఖులకు ఈ పేజీల నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపారు. చాలామంది నిజమే అనుకుని స్పం దించి రిక్వెస్ట్‌కు ఓకే చెప్పారు. ఆ తర్వాత నుంచి ఆన్‌లైన్‌లో వీరితో సదరు పోలీసు అధికారుల పేరుతో నేరగాళ్లు ఛాటింగ్‌ మొదలుపెట్టారు. ప్రోఫైల్‌ ఫోటోలు, పేర్లు ఏమాత్రం చిన్న అనుమానంగా కూడా లేకపోవడంతో పోలీసు అధికారులతోనే ఛాటింగ్‌ చేస్తున్నామని నమ్మి వీరంతా అందులో మునిగిపోయేవారు. ఇదే అదనుగా సదరు కేటుగాళ్లు తమతో ఛాటింగ్‌లో ఉన్న ప్రముఖులు, వ్యాపారులకు చిన్న అవసరం వచ్చిందని, గూగుల్‌పే, ఫోన్‌పేలో డబ్బులు వేయాలని అడిగేవారు. నిజమేనని నమ్మి చాలామంది సదరు నేరగాళ్లు చెప్పిన అకౌంట్‌కు డబ్బులు జమచేశారు.


ఇలా చాలామంది నుంచి లక్షల్లో కేటుగాళ్లు డబ్బులు పిండేశారు. చింతూరు డీఎస్పీ, తిమ్మాపురం ఎస్‌ఐ పేరిట ఇలా నకిలీ ఖాతాలతో కేటుగాళ్లు లక్షల్లో వసూళ్లు చేశారు. తాజాగా ఈ వ్యవహారం వీరిద్దరికి తెలియడంతో సోషల్‌మీడియాలో తమపేరుతో ఉన్న నకిలీ ఖాతాలు చూసి అవాక్కయ్యారు. సైబర్‌ విభాగానికి చెప్పి నిందితులు ఎవరనేది తేల్చేపనిలో పడ్డారు. అయితే అసలు విషయం తెలియడంతో ఇప్పుడు పలువురు బాధితులు లబోదిబోమంటున్నారు. ఎంత ఇచ్చామనేది చెప్పడానికి వెనుకాడుతున్నారు. అటు తుని రూరల్‌ సీఐ ఫోటో, ఆయన పేరుతో సృష్టించిన ఖాతాను నిజమనుకుని పలువురు వ్యాపారులు, రియల్‌ఎస్టేట్‌ మనుషుల నుంచి కూడా కేటుగాళ్లు డబ్బులు భారీగా పిండేశారు. మూడు రోజుల కింద యథావిథిగా సీఐ పేరుతో ఛాటింగ్‌ చేస్తూ ఓ వ్యక్తిని డబ్బులు అడిగారు.


ఫోన్‌పే, లేదా గూగుల్‌ పేలో డబ్బులు పంపాలని అడిగారు. అయితే తనకు ఇవేవీ లేవని చెప్పారు. అనం తరం సదరు వ్యక్తి నేరుగా సీఐకి ఫోన్‌ చేసి తనకు గూగుల్‌, ఫోన్‌పేలు లేవని, డబ్బులు ఎక్కడకు పంపాలని అడిగారు. దీంతో సీఐ కంగుతిన్నారు. తాను డబ్బులు ఎప్పుడు అడిగానని ప్రశ్నించారు. దీంతో ఫేస్‌బుక్‌ పేజీ, ఆన్‌లైన్‌ ఛాటింగ్‌ గురించి వివరిస్తే సీఐ వాటన్నింటిని పరిశీలించి అవాక్కయ్యారు. సైబర్‌ నేరగాళ్లు వలవేసి తన పేరుతో మోసం చేసినట్టు గుర్తించారు. దీంతో తన అసలు ఫేస్‌బుక్‌ పేజీ నుంచి ఆన్‌లైన్‌లో వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.Advertisement
Advertisement
Advertisement