Abn logo
Oct 30 2020 @ 05:27AM

చిరుతపులి చర్మం విక్రయించే యత్నం

ఆరుగురి అరెస్ట్‌, పరారీలో మరో ముగ్గురు 

వివరాలు వెల్లడించిన టాస్క్‌ఫోర్స్‌ సీఐ కిరణ్‌

కాసిపేట, అక్టోబరు29: చిరుతపులి చర్మాన్ని విక్రయించడానికి యత్నించిన ఆరుగురిని రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ సీఐ కిరణ్‌, దేవాపూర్‌ ఎస్సై దేవయ్య వివరాలు వెల్లడించారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం సుంగాపూర్‌కు చెందిన పెంద్రం శంకర్‌  15 రోజుల క్రితం కాసిపేట మండలం పల్లంగూడకు చెందిన చిక్రం గంగుకు తన వద్ద చిరుతపులి చర్మం ఉందని చెప్పాడు. దీన్ని అమ్మగా వచ్చిన లాభాలను పంచుకుందామని ఆశ కల్పించాడు. ఈ మేరకు చిరుతపులి చర్మాన్ని పల్లంగూడకు తీసుకువచ్చారు. అనంతరం వారు  వన్యప్రాణుల చర్మాలను కొనుగోలు చేసి విక్రయించే ముఠా సభ్యులను సంప్రదించారు.


ఈ మేరకు ఏడుగురు సభ్యుల ముఠా పల్లంగూడకు చేరుకున్నారు. బుధవారం రాత్రి పల్లంగూడ నుంచి చిరుతపులి చర్మాన్ని చిక్రం గంగుకు చెందిన ఆటోలో తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, పోలీసులు దాడి చేశారు.  ఇద్దరు బైక్‌పై ఆటోను వెంబడిస్తుండగా ఏడుగురు ఆటోలో వెళ్తున్నారు. పోలీసుల దాడి చేసి ఆరుగురు వ్యక్తులను పట్టుకోగా మరో ముగ్గురు పరారయ్యారు. అరెస్టు చేసిన వారిలో కోనూరు పంచాయతీలోని తంగళ్లప ల్లికి చెందిన గోపతి వంశీ అలియాస్‌  రాజు, మందమర్రిలోని విద్యానగర్‌కు చెంది న జూపాక దుర్గాప్రసాద్‌, మందమర్రిలోని మారుతి నగర్‌కు చెందిన షేక్‌జమీల్‌, మహ్మద్‌ వాజిద్‌ఖాన్‌, ఊరు మందమర్రికి చెందిన ఆవుల సాయికృష్ణ, పల్లంగూడలోని గోండుగూడకు చెందిన చిక్రం గంగు ఉన్నారు. 


తిర్యాణి మండలం సుంగాపూర్‌కు చెందిన పెంద్రం శంకర్‌, మందమర్రి లోని విద్యానగర్‌కు చెందిన గాదె రాజు, హైదరాబాద్‌కు చెందిన గోపతి మురళి పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి పులి చర్మంతో పాటు బైక్‌, ఆటోను  స్వాధీనం చేసుకున్నామని,  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవయ్య చెప్పారు.  ప్రధాన నిందితుడు పెంద్రం శంకర్‌ను పట్టుకుంటే ఆ  చిరుతపులి చర్మం ఎలా వచ్చిందన్న సమాచారం తెలుస్తుందని ఎస్సై తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్‌ బ్రాంచీ సీఐ సతీష్‌, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐలు లచ్చన్న, కిరణ్‌, సంపత్‌కుమార్‌, రాకేష్‌, భాస్కర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, ఓంకార్‌, వెంకటేష్‌, శ్యాం, సదానందగౌడ్‌, మల్లన్న తదితరులు పాల్గొన్నారు. 


డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షణ ..ఇన్‌చార్జి ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ లక్ష్మణ్‌ 

వన్య ప్రాణుల వేట అటవీ సంపద అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసు, అటవీ శాఖ సమన్వయంతో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు బెల్లంపల్లి ఇన్‌చార్జి ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ లక్ష్మణ్‌ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వన్య ప్రాణులను వేటాడితే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్‌ పరిధిలో అక్రమ కలప రవాణాకు పాల్పడిన 9 కేసుల్లో 56 మందిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, కలప అక్రమ రవాణా చేసినా పీడీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

Advertisement
Advertisement